తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కోవిడ్ లక్షణాలు బయట పడటంతో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్నానని, అందులో పాజిటివ్‌గా తేలిందని మంత్రి తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన విజ్ఙప్తి చేశారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ఎవరూ కలవడానికి ప్రయత్నం చేయవద్దని మంత్రి అజయ్ సూచించారు. చికిత్స పూర్తయ్యే వరకూ ఎవరూ తనకు ఫోన్ కూడా చేయవద్దని మంత్రి పువ్వాడ ట్విట్టర్ వేదికగా విజ్ఙప్తి చేశారు. తన ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రి భరోసా ఇచ్చారు.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా..
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినా ప్రజాప్రతినిధులను మాత్రం కరోనా వెంటాడుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ బారిన పడ్డారు. రెండు రోజుల కిందట మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. వీరు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్యం కలకడగా ఉందని తెలుస్తోంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు విజ్ఙప్తి చేశారు.
కరోనా టీకాకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
మరో రెండు వారాల్లో టీకా అందుబాటులోకి రానుందని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. టీకా మందు నిల్వ చేసుకోవడం, ప్రణాళిక ప్రకారం పంపిణీ చేయడంపై శిక్షణా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పటికే టీకాను అతిశీతల రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. టీకా ఎలా ఇవ్వాలి, ఇచ్చిన తరవాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై కూడా వైద్య శిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఈ శిక్షణ పూర్తి కానుంది.
తెలంగాణలో కరోనా అప్ డేట్స్
పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందనే చెప్పాలి. ఏపీలో ఇప్పటికే 8 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మరో 7 వేల మంది చనిపోయారు. తెలంగాణలో ఇప్పటి వరకు అందిన గణాంకాల ప్రకారం 2,78,599 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నిన్న ఒక్క రోజే 491 కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో 1499 మంది చనిపోయారు. నిన్న ఒక్క రోజే కరోనాతో ముగ్గురు చనిపోయారు. మరో రెండు వారాల్లో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. అయితే టీకా రెండో డోసు తీసుకునే వరకు కరోనా జాగ్రత్తలు పాటించాలని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది.
Must Read ;- టీకా పంపిణీకి కేంద్రం, రాష్ట్రాల అత్యవసర ఏర్పాట్లు
#RTPCR పరీక్షల్లో నాకు #COVID పాజిటివ్ అని తేలింది.దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నాతో కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేసుకోవాలని మనవి. హోం ఐసోలాషన్ లో ఉన్నాను. ఆందోళన చెందాల్సిన పని లేదు. మళ్ళీ యధావిధిగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను.
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) December 15, 2020