ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడచిన రెండు రోజులుగా పరిపాలనను పర్యవేక్షించడం లేదు. తన సిల్వర్ జూబ్లీ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ కోసం ఆయన కుటుంబ సమేతంగా సిమ్లా పర్యటనకు వెళ్లారు. అధికారిక కార్యక్రమాల నుంచి ఆయన పూర్తిగా విశ్రాంతి తీసుకుని తన మెమోరబుల్ మ్యారేజీ డేను కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా జరుపుకునేందుకే సిమ్లా వెళ్లారు. సీఎంగా ఉన్న నేత పూర్తిగా సెలవు తీసుకుంటే.. ఎవరికో ఒకరికి పాలనా బాధ్యతలు అప్పగించాల్సిందే కదా. అలాంటి ఏర్పాట్లలో భాగంగానే తన బాధ్యతలను ఆయన తన నమ్మినబంటుగా, తనకు అత్యంత సన్నిహితుడిగా, అన్ని విషయాల్లో తన వెన్నంటే నడుస్తున్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించినట్టుగా వినిపిస్తున్న వార్తలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
బాబు ఉండగా ఇలా లేదు
ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలోనే కాకుండా.. నవ్యాంధ్రకు తొలి ఐదేళ్లే సీఎంగా ఉన్న సమయంలోనూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సింగిల్ డే కూడా లీవు తీసుకున్న సందర్భాలే లేవు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం చాలా దేశాల్లో పర్యటనలు సాగించిన సమయంలోనూ చంద్రబాబు.. నిత్యం పాలనపై ఓ కన్నేసే ఉంచేవారు. ఎక్కడ ఉన్నా కూడా నిత్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చంద్రబాబు టచ్ లోనే ఉండేవారు. అంతేకాకుండా పార్టీ వ్యవహారాలపైనా చంద్రబాబు ఓ కన్నేసే ఉంచేవారు. విదేశాల్లో ఉన్నా.. పార్టీ ముఖ్యులతో ఆయన నిత్యం మాట్లాడుతూనే ఉండేవారు. ఏవైనా కీలక అంశాలుంటే.. వీడియో కాన్ఫరెన్సుల ద్వారా అటు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు ఇటు పార్టీ ముఖ్యులతోనూ చంద్రబాబు టచ్ లోనే ఉండేవారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్రం బయట ఉన్నా.. యాక్టింగ్ సీఎం అనో, యాక్టింగ్ పార్టీ చీఫ్ అన్న భావనలే రాలేదు.
మరి ఇప్పుడు అలా కాదుగా..
అయితే చంద్రబాబు వ్యవహారానికి విరుద్ధంగా జగన్ సాగుతున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్లిన సందర్భంగానూ జగన్ పాననతో పాటు పార్టీ వ్యవహారాలకు దూరంగానే సాగారు.ఈ క్రమంలో నాడు పార్టీ వ్యవహారాలను తన బాబాయి, ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించి వెళ్లారు. అయితే సీఎం బాధ్యతలను ఆయన ఎవరికీ అప్పగించినట్లుగా నాడు కనిపించలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదిన గండంగా మారింది. విపక్షాల ఆందోళనలు ఓ రేంజిలో సాగుతున్నాయి. మరి ఇలాంటప్పుడు ప్రభుత్వ పాలనకు సంబంధించి ఎవరికో ఒకరికి బాధ్యతలు అప్పగించే ఉంటారు కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అలా యాక్టింగ్ సీఎంగా బాధ్యతలు సజ్జలకే దఖలుపడి ఉంటాయన్న మాట వైసీపీ వర్గాల్లోనే జోరుగా వినిపిస్తున్నాయి. జగన్ హాలీడే ట్రిప్ మొదలై ఇప్పటికే రెండు రోజులైనా.. సజ్జల ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు, అదే సమయంలో కొత్త జీవోలు కూడా జారీ కాలేదు గానీ.. జగన్ తిరిగి రాష్ట్రానికి వచ్చేది ఈ నెల 31ననే. అంటే ఇంకా మూడు రోజులు జగన్ రాష్ట్రానికి, రాష్ట్ర పాలనకు దూరంగానే ఉంటారు. మరి ఈ సమయంలో సజ్జల నుంచి ఏమైనా నిర్ణయాలు వస్తాయో, లేదంటే జగన్ వచ్చేదాకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే సాగుతారో చూడాలి.
Must Read ;- ఈ రెడ్డిగారి స్వామి భక్తి ఆకాశాన్నంటింది











