ప్రజలే సర్వాధికారులని, కొన్నేళ్లకోసారి జరిగే ఎన్నికలు ‘అణచివేసే నిరంకుశ ప్రభుత్వాలు’ రాకుండా అడ్డుకోలేవని, అలాంటి హామీ ఏదీ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వాలు ఎల్లప్పుడూ వినాలని ఆయన హితవు పలికారు. బుధవారం సాయంత్రం జస్టిస్ పి.డి. దేశాయి 17వ స్మారకోపన్యాసంలో భాగంగా ‘రూల్ ఆఫ్ లా (న్యాయాధికారం)’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు దేశంలో జరిగిన 17 సార్వత్రిక ఎన్నికలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఎన్నికల్లో 8 సార్లు ప్రభుత్వాలను ప్రజలు మార్చారని ఆయన తెలిపారు. దేశంలో భారీగా అసమానతలు, పేదరికం, వెనుకబాటు తనం ఉన్నా ప్రజలు తెలివైనవారేనని, వారు తమ పనిని సంపూర్ణంగా నిర్వహించారని ఈ ఎన్నికలే నిరూపించాయన్నారు. ఆ ఎన్నికల్లో ప్రజలందరూ హేతుబద్ధంగా వ్యవహరించారని అన్నారు.
ప్రజలే సర్వాధికారులైనా..
పాలకులను ప్రజలే ఎన్నుకుంటున్నా అధికారం చేపట్టిన తర్వాత కొన్ని ప్రభుత్వాలు చాలా నిరంకుశంగా పాలిస్తున్న సందర్భాలు మన కళ్ల ముందు కదలాడుతున్నాయి. ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా అయిదేళ్లు తమకు తిరిగే లేదన్న విధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజలే సర్వాధికారులైనా ఎన్నుకున్న పాపానికి అయిదేళ్లు భరించక తప్పడం లేదు. అడ్టగోలు పాలనతో ప్రజలను ఇబ్బందులు పెడుతుంటే కోర్టులే వారికి శరణ్యమవుతున్నాయి. చట్ట వ్యతిరేక పాలనతో కోర్టుల్లో ఎదురుదెబ్బలు తింటున్నా కొందరి వైఖరి మారడం లేదు. పైగా నిశిగ్గుగా కోర్టులపైనే ఆక్షేపణలకు దిగుతున్నారు. పాలకులు తమకు అనుకూలమైన జీవోలు, అడ్డగోలు చర్యలకు దిగుతున్న సందర్భాల్లో కోర్టుల్లోనే బాధితులకు ఉపశమనం కలుగుతోంది. కరోనా మహామ్మారి సమయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొన్ని చోట్ల కోర్టులు కల్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సంఘటనలన్నీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నట్లు ఎన్నికలు ‘అణచివేసే నిరంకుశ ప్రభుత్వాలు’ రాకుండా అడ్డుకోలేవన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
కోర్టులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలంటూ..
కోర్టులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రభుత్వాలు లేదా అధికారులు కోర్టులను ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ నియంత్రించ కూడదు. అలా జరిగినప్పుడు న్యాయాధికారం అన్నది ఓ భ్రమలా మారుతుందని ఆయన అన్నారు. కోర్టులను ఉద్దేశించి ప్రజలు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను చూసి జడ్జిలు భావోద్వేగానికి లోను కావొద్దని సూచించారు.ఆ పోస్టులను అసలు పట్టించుకోవద్దని చెప్పారు. నిర్ణయాత్మక కేసుల్లో మీడియా ట్రయల్ మంచిది కాదని ఆయన చెప్పారు. కోర్టులు స్వేచ్ఛగా పనిచేయాలంటే బాహ్య ఒత్తిళ్లను అధిగమించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం నుంచి న్యాయమూర్తులపై ఒత్తిళ్లున్నాయని బయట చర్చ జరుగుతోందని, అయితే, కోర్టులను సోషల్ మీడియా ట్రెండ్స్ ఎలా ప్రభావితం చేస్తాయో కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు.
స్ఫృహ పెరిగే కొద్దీ న్యాయాధికారం మారుతోంది..
స్వేచ్ఛ, సమానత్వం, కుటుంబం, న్యాయం వంటి వాటిపై స్పృహ పెరిగే కొద్దీ న్యాయాధికారం కూడా మారిపోతూ వస్తోందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో సామాన్యుల జీవితాలను కాపాడేందుకు ఆ న్యాయాధికారాన్ని ఎంత వరకు వాడుకున్నారన్న దానిని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహమ్మారి అంతం ఇక్కడితో అయిపోలేదని అన్నారు. రాబోయే దశాబ్దాల కాలంలో మరిన్ని పెద్ద సంక్షోభాలకు ఇది ఓ తెర లాంటిదని హెచ్చరించారు. కాబట్టి కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో మనం కరెక్ట్‌గా ఏం చేశాం? ఏ విషయంలో తప్పు చేశాం? అనే విషయాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Must Read ;- హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రానికి కృషి : సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ











