ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో నిరసనలకు దిగిన అన్నదాతలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన కారుతో తొక్కించిన ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ ఘటనపై అందరికంటే ముందుగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ యూపీ ఇంచార్జీగా కొనసాగుతున్న ప్రియాంకా గాంధీ వాద్రా బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే ఆమెను అడ్డుకున్న పోలీసులు పరామర్శకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పరామర్శకు వెళ్లి తీరతానని ప్రియాంకా పట్టుబట్టగా.. ఆమెను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తనను ఉంచినబ సీతాపూర్ జైలు గది అపరిశుభ్రంగా ఉన్న వైనాన్ని చూసిన ప్రియాంకా స్వయంగా చీపురు పట్టి గది మొత్తాన్ని శుభ్రంగా ఊడ్చి తన నిరసనను వ్యక్తం చేశారు. ముందుస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనను ఎంతకాలం పాటు జైలులో పెడతారని కూడా ప్రియాంకా ఆగ్రహం వ్యక్తం చేసినా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రియాంకను అరెస్ట్ చేసిన తీరు, ఆమెను అపరిశుభ్రంగా ఉన్న గదిలో ఉంచిన తీరుపై పెద్ద ఎత్తున నిరనసలే వ్యక్తమయ్యాయి.
రాహుల్ రాకతో ప్రియాంక విడుదల
ప్రియాంకను అరెస్ట్ చేసిన పోలీసులు రెండు రోజులు దాటినా ఆమెను విడుదల చేయలేదు. ఈ క్రమంలో చెల్లికి ధైర్యం చెబుతూనే.. రాహుల్ గాంధీ లఖింపూర్ ఖేరీ బాధితుల పరామర్శకు బయలుదేరారు. అయితే ఢిల్లీలోనే ఆయనను అడ్డుకున్న పోలీసులు లఖింపూర్ వెళ్లేందుకు అనుమతి లేదంటూ తెలిపారు. పోలీసుల తీరుపై విరుచుకుపడిన రాహుల్.. తనను ఎలా ఆపుతారో ఆపండి చూద్దామంటూ ముందుకు కదిలారు. ఈ క్రమంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారతోందన్న భావనతో.. లఖింపూర్ ఖేరీ పర్యటనకు ఎట్టకేలకు రాహుల్ ను అనుమతించారు. అదే సమయంలో రెండు రోజులుగా సీతాపూర్ జైలులో ఉన్న ప్రియాంకను కూడా యూపీ పోలీసులు విడుదల చేశారు. అంటే.. అన్న రాహుల్ యూపీలో ఎంట్రీ ఇస్తే గానీ.. చెల్లి ప్రియాంకను పోలీసులు విడిచిపెట్టలేదన్న మాట. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర సెటైర్లు పడిపోతున్నాయి. ఇదిలా ఉంటే.. జైలు నుంచి రెండు రోజుల తర్వాత విడుదలైన ప్రియాంక తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి లఖింపూర్ ఖేరీ బాధితులను పరామర్శించనున్నారు.
అమిత్ షాతో అజయ్ మిశ్రా భేటీ
విపక్షాల పట్టు వదలని నిరసనలతో లఖింపూర్ ఖేరీ బాధితుల పరామర్శకు ఒక్కో పార్టీ నుంచి ఐదుగురికి అనుమతి ఇస్తూ యూపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో రాహుల్, ప్రియాంకల బృందం బుధవారమే లఖింపూర్ ఖేరీ బాధితులను పరామర్శించనుంది. అదే సమయంలో విపక్షాల నిరసనలు అంతకంతకూ అధికం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై దృష్టి సారించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగితో ఈ ఘటన గురించి మాట్లాడారు. మరోవైపు ఈ ఘటనకు ప్రధాన కారణంగా నిలిచిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా.. కేంద్ర హోం శాఖ మంత్రితో భేటీ అయ్యారు. ఘటనపై సమగ్ర వివరాలు అందజేశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితులు. తనపై వెల్లువెత్తిన ఆరోపణలు, తన కుమారుడి ప్రమేయం లేదన్న వాదనలను ఆయన వినిపించారు. ఈ భేటీ ముగియగానే.. నేరుగా రంగంలోకి దిగిపోయిన అమిత్ షా.. యూపనీ ప్రభుత్వ అధికారులతో వివరాలను సేకరించే పనిలో పడ్డారట.
Must Read ;- అరెస్ట్ చేస్తే.. ప్రియాంకా గాంధీ ఏం చేశారంటే?











