స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎఫ్ 3 సెట్ లో అడుగుపెడితే ఎలా ఉంటుంది. అదో పెద్ద సందడే. ప్రస్తుతం అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్న ‘పుష్ప’ చిత్రం డిసెంబరు 17న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దాంతో సరదాగా ఎఫ్ 3 సెట్ లో అడుగుపెట్టారు బన్నీ. ఒక్కసారిగా బన్నీ సెట్ లో కనిపించే సరికి చిత్ర బృందం ఆశ్చర్యపోయింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 రూపొందుతున్న సంగతి తెలిసిందే.
పైగా సెట్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ ఉన్నారు. బన్నీ వచ్చేసరికి వెంకీతో వరుణ్ తేజ్ కాసేపు ముచ్చట్లు పెట్టారు. ఆ సమయంలో ఓ కామెడీ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, వెన్నెల కిషోర్ లపై ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. సెట్ లో ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి, ఇతర నటులతోనూ అల్లు అర్జున్ మాట్లాడారు. ఈ ఫొటోలను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒకరి సినిమా షూటింగ్ లోకి ఇంకొకరు రావడం ఒకప్పుడు తరచూ జరిగేది.
ఇప్పుడు ఎవరికి వారు తమ షూటింగులతో బిజీగా ఉండటం, వారి షూటింగుకు ఎందుకు అంతరాయం కలిగించడం అన్న ఉద్దేశంతో ఆ సంప్రదాయం మరుగున పడిపోయింది. ఇలాంటి ముచ్చట్లు అప్పుడప్పుడూ ఉంటే అందరి మధ్యా సుహృద్భావ వాతావరణం ఉంటుంది. వరుణ్ తేజ్ బంధువు కావడం, చిన్నప్పట్నుంచీ స్నేహం ఉండటంతో బన్నీ ఆ సెట్ కు రావాల్సి వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన తమన్నా, వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ దీనికి నిర్మాతలు. అల్లు అర్జున్ తో జరిగిన చర్చల్లో సినిమాల కన్నా వ్యక్తిగత అంశాలే ఎక్కువగా ఉన్నాయట.
Must Read ;- ‘పుష్ప’లో శ్రీవల్లి గా రష్మిక ఎలా ఉందో చూడండి











