గ్రేటర్ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్ట మరింత దిగజారింది. అన్ని పార్టీలు గ్రేటర్ వార్‌లో దూసుకు పోతుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం కుమ్ములాటల్లో కూరుకుపోతోంది. టికెట్ల కేటాయింపుల్లో ఆ పార్టీ అనుసరించిన వ్యూహం ఆ పార్టీకి శాపంగా మారుతోంది. అధిష్టానం ఒంటెద్దు పోకడలతో నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ నగర ముఖ్యనేతలు గాంధీభవన్ వైపు వెళ్ళేందుకు కూడా ఇష్టపడటం లేదు. దీంతో ఎన్నికల వేళ కలకల లాడాల్సిన పార్టీ కార్యాలయం బోసిపోయి కనిపిస్తోంది. నగరంలో పట్టు ఉన్న నేతలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కేడర్‌ను కలవర పాటుకు గురి చేస్తున్నారు.
Must Read:-గ్రేటర్తో ఓట్ల వేట.. టీడీపీని దెబ్బకొట్టేందుకేనా?
నేతలు బీజేపీలోకి వెళ్తారా..
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఎక్కువవ్వడంతో చాలామంది ఆ పార్టీలో ఇక ఇమడ లేమని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ పార్టీ నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత, సోనియా విధేయుడు సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరడం ఖాయం అంటున్నారు. విజయశాంతి ఇప్పటికే బీజేపీ నేతగా మారిపోయారన్న చర్చ సాగుతోంది. మరోవైపు ఆ పార్టీ నేతలను కూడా కలిసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు వారు బీజేపీలో చేరతారా లేదా అనేది స్పష్టత లేదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయం అంటున్నారు బీజేపీ నేతలు.
బీజేపీపై కాంగ్రెస్ నేతల ఫైర్..
బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ‘ఆపరేషన్ ఆకర్ష్’ కు కాంగ్రెస్ అధిష్టానం బేజారవుతోంది. అసలే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఇలా నేతలు ఒక్కక్కరు చేజారుతుండటం వారికి మింగుడు పడటం లేదు. దీంతో బీజేపీపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అర్థరాత్రులు తమ నేతల ఇళ్లకు వెళ్ళి వారిని కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి బలం లేనందునే వారు తమ పార్టీ నేతల వెంట పడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. కేవలం ఒక్క దుబ్బాకలో గెలిచినంత మాత్రాన వారు తెలంగాణలో పాగా వేసినట్టు భావిస్తున్నారని.. గ్రేటర్ ఎన్నికల్లో తమ బలం చూపిస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే, కాంగ్రెస్ విమర్శలను బీజేపీ ప్రస్తుతం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. గ్రెటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి.
Also Read:-ఆపరేషన్ ఆకర్ష్‌తో బీజేపీ జోష్..











