గ్రేటర్ ఎన్నికలకు నగరా మోగింది. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. ఈ ఎన్నికలకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని బరిలోకి దిగుతున్నాయి. అలాగే ఎన్నికల బరిలో తాము కూడా ఉన్నామని జనసేన, టీడీపీ ప్రకటించేశాయి. ముఖ్యంగా అందరి ఫోకస్ బీజేపీ పార్టీపై ఉంది. టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీ ఈ ఎన్నికల్లో ఎలాంటి స్ట్రాటజీ అమలు చేయబోతుందనే అంశం ఆసక్తిగా మారింది. దుబ్బాక విజయంతో యమ స్పీడ్ మీద ఉన్న బీజేపీ నాయకత్వం అదే స్పీడ్‌ను గ్రేటర్ ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని భావిస్తోంది. దీని కోసం జాతీయ నాయకత్వం రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీని జాతీయ నాయకత్వంతో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతను ఎన్నికల వ్యూహాలను అత్యంత పకడ్బందీగా రచించే అమిత్‌షా సన్నిహితుడైన భూపేంద్ర యాదవ్ అప్పగించిన విషయం కూడా తెలిసిందే.
టీఆర్ఎస్‌ను రాజకీయంగా గ్రేటర్‌లో దెబ్బ కొట్టేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాలను అమలుచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువగా ఉంది. ఈ తక్కువ సమయంలో ఓటర్లను ఆకట్టుకోవాలంటే చాలా కష్టమే. ఇందుకు ప్రజాభిమానం కలిగిన జాతీయ నాయకులను దింపనున్నట్లు సమాచారం. బీజేపీ కీలక నేత, కేంద్ర మంత్రి అమిత్‌షా, బిజెపీ జాతీయ అధ్యక్షులు జెపీ నడ్డా గ్రేటర్ ఎన్నికల బరిలో దిగి ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే అమిత్‌షా లాంటి నేత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటేనే మెజార్టీ సీట్లు సాధించే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. ఈవిషయంపై బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వానికి ఒప్పించి గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు జాతీయ నాయకత్వాన్ని దింపితేనే మంచిదనే అభిప్రాయాన్ని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అమిత్‌షా ఎంటరైతే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.
Must Read ;- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుచరుడు టీఆర్ఎస్‌లోకి జంప్