అటు జనసేనాని పవన్ కల్యాణ్.. ఇటు ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన బొచ్చెడు మంది నేతలు.. మాటల తూటాలతో పాటు తిట్ల పురాణాలను ఎత్తుకుని రచ్చ రచ్చ చేస్తున్నారు. వీరి మాటల దాడుల్లో ఎక్కడ కూడా టీడీపీ పేరు గానీ, టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు పేరు గానీ వినిపించలేదనే చెప్పాలి. అదంతా జనసేన, వైసీపీ మధ్య సాగుతున్న యుద్ధమే. అంతకుమించి ఇప్పుడు ఆ మాటల పోరు వ్యక్తిగత జీవితాలకు అంటుకుంది. పవన్ కల్యాణ్ కాస్తంత సంయమనం పాటిస్తున్నా.. వైసీపీ వర్గం మాత్రం బూతులతో చెలరేగిపోతోంది. ఈ వ్యవహారంపై మిగిలిన పార్టీలు స్పందించాల్సిన అవసరం లేదు కూడా. ఆ మేరకే ఏపీకి చెందిన రాజకీయ పార్టీలు గానీ, తెలంగాణకు చెందిన పార్టీలు గానీ అసలు తమకు ఆ మాటల పోరు వినిపించనట్లుగానే వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ ఏపీ ఛీప్. అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా కొనసాగుతున్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. అచ్చెన్న స్పందనను చూసిన వారంతా అచ్చెన్న తొందరపడ్డారా? అన్న దిశగా ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
అచ్చెన్న ఏమన్నారంటే..?
పవన్, వైసీపీ నేతల మాటల యుద్ధంపై బుధవారం నాడు స్పందించిన అచ్చెన్న కీలక వ్యాఖ్యలే చేశారు. ఇంతకూ అచ్చెన్న ఏమన్నారంటే.. ‘‘ సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ కలిసి ఒక వికృత క్రీడ ప్రారంభించారు. ఈ ఆటలో పోసాని కృష్ణమురళి ఒక పెయిడ్ అర్టిస్ట్‌గా మారారు. వైసీపీ నేతలు ప్రజలు వినలేని భాషలో మాట్లాడుతుంటే జగన్ చాలా సంతోషిస్తున్నారు. పవన్ విషయంలో పోసాని మాట్లాడిన బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఇలాంటి భాషను ప్రయోగించి సంస్కృతీ సంప్రదాయాలను మంటగలుపుతున్నారు. పవన్ కుటుంబ సభ్యుల గురించి పోసాని చేత ప్రశాంత్ కిషోర్ టీం మాట్లాడిస్తుంటే జగన్ రెడ్డి ఎందుకు ఆపడం లేదు? సామాన్య ప్రజలు కనీసం వినలేని.. మాట్లాడలేని భాషలో వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే తాడేపల్లిలో జగన్ రెడ్డి ఆనంద పడిపోతున్నారు. మద్యం షాపుల దగ్గర చీప్ లిక్కర్ తాగిన తాగుబోతులైనా ఇలా మాట్లాడతారా?” అని అచ్చెన్న ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.
బాబు, లోకేశ్‌లు పట్టించుకోలేదుగా
వాస్తవానికి రెండు వేర్వేరు రాజకీయ పార్టీల మధ్య జరిగే వివాదాల్లో మూడో రాజకీయ పార్టీ తలదూర్చదు. అంతకుమించి తమ ప్రస్తావనను ఆ రెండు పార్టీలు తీసుకురానప్పుడు ఇతర పార్టీలు స్పందించాల్సిన అవసరం కూడా లేదు కదా. ఈ భావనతోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గానీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గానీ ఈ వివాదంలో వేలు పెట్టలేదు. అసలు ఈ వ్యవహారం తమకు సంబంధించినది కాదన్న భావనతోనే వారు సాగుతున్నారు. వీరి మాదిరే టీడీపీకి చెందిన ఇతర నేతలు కూడా ఈ వ్యవహారంపై అసలు నోరు విప్పడం లేదు. ఇలాంటి నేపథ్యంలో టీడీపీ ఏపీ శాఖకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్న స్పందించి తొందరపడ్దారా? అన్న దిశగా సరికొత్త విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- బద్వేల్ బైపోల్‌లో విక్టరీ టీడీపీదేనా?











