మెగా కుటుంబమో లేక నందమూరి కుటుంబమో `రాంగ్ గోపాల్ వర్మ‘ సినిమా తీసేందుకు తనకు ప్యాకేజీ ఇచ్చిందని కొందరు ఊహాగానాలు చేస్తున్నారని, అందులో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆ చిత్ర దర్శక, నిర్మాత, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్లో ఈ చిత్రాన్ని పాత్రికేయులకు ప్రదర్శించారు.
అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో ప్రభు మాట్లాడుతూ, ఒకప్పుడు ట్రెండ్ సెట్టర్ చిత్రాలను తీసిన రాంగోపాల్ వర్మ కొన్నేళ్లుగా రూట్ మార్చి, అశ్లీల చిత్రాలను తీయడం కరెక్ట్ కాదని, ఎందరో కొత్తవాళ్లు సినీ పరిశ్రమలోనికి రావడానికి స్ఫూర్తిని సైతం నింపిన వర్మ తన స్థాయిని దిగజార్చుకుని మరీ సినిమాలు తీస్తూ సామాజిక కాలుష్యానికి కారణమౌతున్నారనే అంశాలను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తీశానని అన్నారు. ఎవరి మెప్పు కోసమో తాను ఈ సినిమా చేయలేదని చెప్పారు. నిజానికి వర్మ తన టాలెంట్ ను ఒకప్పటి మాదిరిగా మంచిగా ఉపయోగించుకుంటే ఆస్కార్ అవార్డును సైతం ఆయన అందుకోగలరని, అందుకోసం ఇప్పటికైనా ఆయనలో పరివర్తన రావాలనే పాయింట్ ను ఇందులో చెప్పామని అన్నారు.
ఈ చిత్రం తీయడానికి ముందు మెగా ఫ్యామిలీ దృష్టికి తీసుకుపోయానని, అయితే ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఈ సినిమా తీసేందుకు తనకు ఎవరి నుంచి ఎలాంటి ప్రోత్సాహాకాలు అందలేదని చెప్పారు. బ్యాంకు నుంచి టాప్ అప్ లోను తీసుకుని ఈ చిత్రం చేశానని ఆయన స్పష్టం చేస్తూ, ఎవరి ప్యాకేజీకి తలొగ్గి ఈ చిత్రం చేయలేదని అన్నారు. ఈ చితం వల్ల వర్మ మారతాడని కూడా తాను అనుకోవడం లేదని, తాను చిత్రానికి పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా? లేదా? అన్న కోణాన్ని కూడా ఆలోచించ లేదని అన్నారు. చిత్ర పరిశ్రమను పాడు చేయవద్దని వర్మను ప్రశ్నిస్తూ దీనిని తీశానని చెప్పారు. శుక్రవారం శ్రేయాస్ మీడియా ఓటీటీ ద్వారా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నామని అన్నారు.
ఇదే సమావేశంలో పాల్గొన్న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, తనదైన పంథాలో వెళ్తున్న వర్మ ఈ చిత్రం చూసి మారతాడని అనుకోవడం అనవసర వ్యయప్రయాసేనని అన్నారు. ఈ చిత్రం చూడటానికి ఎన్ని టిక్కెట్లు తెగుతాయో ఆలోచించుకుని సినిమా చేసి ఉంటే బావుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయినా తన కెరీర్ ప్రారంభం నుంచి ప్రభు తనకు సన్నిహితుడని అన్నారు.
ఈ చిత్రంలో ఓ పాత్రను పోషించిన కత్తి మహేష్ మాట్లాడుతూ, కరోనా సమయంలో వర్మ తీస్తున్న చిత్రాలు, ఆయనపై తీస్తున్న చిత్రాల పైనే చర్చ జరిగింది. ఈ చిత్రంపై వర్మ ఎలా రియాక్ట్ అవుతారోనని అనుకోవచ్చు. కానీ ఆయన ఈ చిత్రం గురించి పట్టించుకుంటారని అనుకోవడం లేదు. వర్మలోని మ్యాడ్నెస్ కాకుండా ఆయనలోని మెథడ్ ను పట్టుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో భాగంగానే పబ్లిక్ ఫండింగ్ తో వర్మ సినిమాలను కూడా చేశారు. అలాంటి కొత్త కొత్తవి వర్మ మెదడులోంచి పుట్టుకొస్తున్నవే.. ప్రభు ఓ మంచి ప్రయత్నమైతే చేశారు. ఆయనకు నా అభినందనలు అని అన్నారు.
రచయిత భారతీబాబు మాట్లాడుతూ, నాటి వర్మ, నేటి వర్మ అనే అంశంపై ప్రభు చేసిన ఈ చిత్రం జర్నలిస్ట్ గా ఆయన తపనను సూచిస్తోందని అన్నారు. సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, రెంటాల జయదేవ్ మాట్లాడుతూ, ఎంతో ధైర్యం చేసి ప్రభు ఈ చిత్రం తీయడం అభినందనీయమని అన్నారు. ఇంకా ఈ సమావేశంలో పాత్రికేయులు అప్పాజీ, రాజాబాబు, వీర్ని శ్రీనివాస్, రాజేష్ మన్నె తదితరులు పాల్గొన్నారు.
Must Read ;- అమృత, ప్రణయ్ ల ‘మర్డర్’పై వర్మ అన్ని మాటలేల?