రాష్ట్రం మాత్రమే కాదు.. ఇవాళ దేశం మొత్తం కూడా మదనపల్లెలోని ఉన్మాద కుటుంబం గురించి మాట్లాడుకుంటోంది. తమ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని అనుకున్న కూతుళ్లు, దేవుళ్లు ఉన్నారని అంటున్న తల్లిదండ్రులు.. తమ పిల్లలు తిరిగివస్తారని చెబుతున్న తండ్రి, తానే శివుడిని అని.. కరోనా అనేది చైనా నుంచి రాలేదని, సమాజంలో చెత్తను ఏరిపారేయడానికి తానే తన శరీరంలోంచి కరోనాను పంపించానని చెబుతున్న తల్లి… ఇన్ని విచిత్ర వ్యాఖ్యలు వ్యాఖ్యానాల గురించి అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. తొలినుంచి- ‘అతి’ అనదగిన స్థాయికి చేరిన ఆధ్యాత్మిక చింతన ఉన్న కుటుంబం వారిది. కొన్నాళ్లుగా విపరీతమైన క్షుద్రపూజలు చేసుకుంటూ గడుపుతున్నారు.
పెద్దమ్మాయి అలేఖ్య ఫేస్ బుక్ పోస్టులు మతవిద్వేషాలతో నిండి ఉన్నాయని… ఇలాంటి పోస్టులే ఇన్‌స్టా అకౌంట్ లో కూడా ఉన్నాయని ఇప్పటికే చాలా ప్రచారం జరుగుతోంది. అయితే కాస్త లోతుగా వెళ్లి గమనిస్తే.. మూర్ఖత్వంతో చెలరేగిపోయి.. కన్న బిడ్డలను కడతేర్చిన ఈ కుటుంబంలో.. న.మో. భక్తి విశృంఖలంగా ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే మరింత లోతుగా అలేఖ్య ఇన్‌స్టా పోస్టులను గమనిస్తే.. నరేంద్రమోడీ పట్ల ఆమె అపార ప్రేమభక్తులు కూడా తెలుస్తాయి. న.మో. అని పేరున్న దుకాణం బోర్డు ఎదుట నిల్చుని ఓ ఫోటో దిగిన అఖ్య.. Love of NaMo అనే క్యాప్షన్ తో పోస్టు పెట్టడం కూడా గమనించొచ్చు. ఈ కుటుంబం యావత్తూ.. మతపరమైన మూర్ఖత్వం నిండిన వారు మాత్రమే కాదు.. వారి మూలాల్లో మోడీ భక్తి కూడా పుష్కలంగా ఉందని కనిపిస్తోంది.
Also Read ;- దేవాలయాలపై వరుస దాడులు.. హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం
నమ్మకాల్లో ఇది మోడీ శకం..
హిందూత్వం ఒక మతంగా పరిగణన ఉంది. అయితే.. మతాన్ని మించి.. హిందూ అనే పదాన్ని సమర్థించే వాళ్లు.. దీనిని ఒక ధర్మంగా అభివర్ణిస్తూ ఉంటారు. అయితే.. నరేంద్రమోడీ.. హిందూత్వ అనే దానిని ఒక ఓటు బ్యాంకు ట్రంపు కార్డుగా మార్చేశారు. ఆ పదం వాడితే చాలు.. ఇబ్బడిముబ్బడిగా ఓట్లు దండుకోవచ్చుననే వ్యూహాలకు ఆయన తెరతీశారు. అది ఆయనకు బాగా వర్కవుట్ అయింది. ప్రధానిగా రెండుసార్ల దేశానికి అత్యున్నత అధికార పీఠం అధిష్టించారు.
ఆ తర్వాతి పరిణామాల్లో ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన చట్టాలు, రద్దుచేసిన చట్టాలు.. ముస్లిముల్లో ఒక అభద్రతను పెంచాయి. ముస్లిం సమాజం ఆ అభద్రతా భావంలో ఐక్యం కావడానికి ప్రయత్నించింది. వారిని చూసి.. హిందూ అనే ట్యాగ్ లైన్ ఉన్న వారంతా… ఏకం కావాలనే దిశగా పాలక పార్టీలు రెచ్చగొట్టడం కూడా చాలా సహజంగా జరుగుతూ వచ్చింది.
ఈ క్రమంలో ఒక మతం, ధర్మం, ఓటు బ్యాంకు అనే రూపాల నుంచి పరివర్తంనం చెంది.. హిందూత్వం ఒక ఉన్మాదంగా కూడా మారింది.
ఈ విషయాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. హిందూత్వపు మౌలిక లక్షణంగా ఏ పరమత సహనాన్ని అయితే పెద్దలు చెబుతూ వచ్చారో.. అది నాశనం అయిపోయింది. పరమత ద్వేషం పెచ్చరిల్లింది. అలాంటి విద్వేషం- ఇప్పుడు మరణించిన ఇద్దరు అమ్మాయిల్లో అక్క అలేఖ్య పోస్టుల్లో కూడా కనిపిస్తోంది. ఆమె ఇన్ స్టా అకౌంట్ లో #shivaspeaks అనే హ్యాష్ ట్యాగ్ తో ఒక తాజా పోస్టు ఉంది. Islam is dead. Muslims are gone. Mohammad is in halahal అనేది ఆ పోస్టులోని కంటెంట్. ఆ అమ్మాయి సోషల్ మీడియా అకౌంట్ లో చిట్టచివరి పోస్టు అదే. తన మరణానికి రెండురోజుల ముందు పెట్టిన పోస్టు అది. 27ఏళ్ల యువతి, ఉన్నత విద్యావంతురాలు, భోపాల్ లో ఎంబీయే చదువుతున్న అమ్మాయి, నవతరానికి ప్రతీక అయిన అలేఖ్యలో ఇలాంటి మతవిద్వేషాలు నిండి ఉన్నాయంటే.. ఆమె మోడీ భక్తురాలు అంటే.. ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి ఉన్మాదాలకు దారితీస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఒక స్థాయి వరకు పరమతాలు అంతమైపోయేంతగా వారిలో ప్రబలిన ఉన్మాదం.. ఆ తర్వాతి దశలో వారిని వారే అంతమొందించుకునేంతగా ముదిరిపోయింది. దెయ్యం ఉందని చెల్లెలు కేకలు వేయడం, దెయ్యాని తోలేయడానికి ఆమెను డంబెల్స్‌తో కొట్టగా చనిపోవడం ఆ ఇంట్లో జరిగిన తొలి దుర్ఘటన. తనను కూడా కొట్టి చంపేస్తే.. తాను వెళ్లి.. చెల్లెలి ఆత్మను తిరిగి తీసుకువస్తానని అలేఖ్యే తల్లిని కోరగా ఆమె పెద్ద కూతురిని కూడా చంపేయడం.. రెండో దుర్ఘటన.
ఈ ఉన్మాదాలకు మూలాలు ఎక్కడ ఉన్నాయి. మతాన్ని ప్రేమించడంలో అతికి వెళ్లడంలోనా? ఆ క్రమంలో మూఢభక్తి, మూఢ నమ్మకాలు ముదిరిపోవడం అనేది పర్యవసానం మాత్రమే. మూలాలు ఎక్కడ ఉన్నాయో.. ఎవరికి వారు విశ్లేషించుకోవాలి.
Must Read ;- సయీఫ్ అలీఖాన్ పై శివ ‘తాండవమే’