దుబ్బాకలో గెలుపు, జీహెచ్ఎంసీలో ఊహించని విధంగా ఎక్కువ డివిజన్లు గెలిచి ఇక తెలంగాణలో తామే ప్రత్యామ్నాయమని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ తామే గెలుస్తామని చెబుతున్న బీజేపీకి షాక్‌లు తగులుతున్నాయి. నాగార్జునసాగర్ టిక్కెట్ల కేటాయింపు విషయంలో బీజేపీలో తడబాటు మొదలైంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో టిక్కెట్‌ను ఎస్టీ వర్గానికి చెందిన డా. రవి నాయక్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నియోజకవర్గంలో బీజేపీలో కీలకంగా ఉన్న నేతలు గులాబీ గూటికి చేరారు. మరికొందరు చేరతారని ప్రచారం కూడా జరుగుతోంది.
ఆశలు పెట్టుకున్న ముగ్గురు..
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి భార్య కంకణాల నివేదితారెడ్డితోపాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మరో కీలక నేత కడారి అంజయ్య యాదవ్, ఇంద్రసేనారెడ్డి పోటీ పడ్డారు. రెండు రోజుల ముందే నివేదితారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నివేదిత రెడ్డి బీజేపీ టిక్కెట్ తనకే వస్తుందన్న నమ్మకంతో ఈ నామినేషన్ దాఖలు చేశామని వ్యాఖ్యానించారు. కొంత కాలం క్రితమే ప్రచారం కూడా మొదలు పెట్టారు నివేదిత రెడ్డి. ఇక టీడీపీ నుంచి 2019లో బీజేపీలో చేరిన బీసీ వర్గానికి చెందిన కడారి అంజయ్య యాదవ్ కూడా టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. గతంలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సమయంలో పార్టీ నుంచి వచ్చిన హామీ మేరకు ఆయన ఆశలు పెట్టుకున్నారని చెప్పవచ్చు.ఇక ఆర్థికంగా బలంగా ఉన్న ఇంద్రసేనారెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నించారు. చివరి నిమిషంలో పార్టీ అనూహ్యంగా డా.రవినాయక్‌ను ఎంపిక చేసింది. దీంతో కడారి అంజయ్య యాదవ్ ఇప్పటికే టీఆర్ఎస్ లో చేరారు. నివేదిత రెడ్డికూడా టీఆర్ఎస్ పార్టీలో చేరతారన్న ప్రచారం నడుస్తోంది.
గులాబీ కండువా కప్పుకున్న అంజయ్య యాదవ్
బీజేపీ నుంచి టిక్కెట్ డా.రవికుమార్‌కు ఖరారైన వెంటనే కడారి అంజయ్య యాదవ్‌తో టీఆర్ఎస్ నేతలు టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. వెంటనే పరిణామాలు మారిపోయాయి. తలసాని, జగదీశ్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, రవీంద్రకుమార్ తదితరులు మాట్లాడినట్టు సమాచారం. అదే సమయంలో కేటీఆర్‌తో మాట్లాడించినట్టు తెలుస్తోంది. అప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్న అంజయ్య యాదవ్‌తో సహా మరో వందమందితో తొలుత ప్రగతిభవన్‌కు వెళ్లి అక్కడ సీఎం కేసీఆర్ లేకపోవడంతో ఫాంహౌస్‌కి తీసుకెళ్లారు. కేసీఆర్ సమక్షంలో కడారి అంజయ్య యాదవ్ గులాబీ కండువా కప్పుకున్నారు.
పార్టీకి నష్టమా..
కడారి అంజయ్య యాదవ్ బీజేపీని వీడడం, టీఆర్ఎస్‌లో చేరడంతో నియోజకవర్గంలో పరిస్థితులు మారిపోవడం ఖాయమని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. ఇప్పటికే బీసీ వర్గానికి చెందిన నోముల భగత్‌ని టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. కడారి అంజయ్య యాదవ్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ నియోజకవర్గంలో ఉన్న దాదాపు 56వేల ఓట్లు తమకు పడతాయని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గాలిలోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కడారి అంజయ్య యాదవ్‌కు అప్పట్లోనే 27,858 ఓట్లు వచ్చాయి. ఈ విషయాన్ని కూడా టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇక నివేదిత రెడ్డి విషయానికి వస్తే.. 2018లో ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసినా 2675ఓట్లు వచ్చాయి. అయితే అప్పటికి, ఇప్పటికి రాష్ట్రంలో, నియోజకవర్గంలో పరిస్థితి మారిందని, తాను గెలిచే సీటు అని నివేదిత రెడ్డి చెబుతున్నారు.
Nagarjuna Sagar bypoll :
ప్రతి ఓటూ కీలకమే..
2018 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే ప్రస్తుతం ప్రతి ఓటు పార్టీలకు కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యకు 83,655ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 75,884ఓట్లు వచ్చాయి. గెలుపోటముల మధ్య కేవలం 4.3శాతం మాత్రమే తేడా ఉంది. 7771ఓట్లతో నోముల గెలుపొందారు. ఈ నేపథ్యంలో అసమ్మతి, రెబెల్స్ ప్రభావం ఎలా ఉంటుందని, ఎవరి ఓట్లకు గండిపడుతుందనే టెన్షన్ పార్టీల్లో మొదలైంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఓసీ అభ్యర్థిని, టీఆర్ఎస్ బీసీ అభ్యర్థిని, బీజేపీ ఎస్టీ అభ్యర్థిని రంగంలోకి దింపిన నేపథ్యంలో సామాజిక సమీకరణాలు కూడా ప్రభావం చూపనున్నాయి.
Must Read ;- సాగర్‌లో అసమ్మతి.. బీజేపీ, టీఆర్ఎస్‌ల్లో టెన్షన్