జనసేనాని పవన్ కళ్యాణ్‌కి బీజేపీ మధ్య దూరం పెరిగింది. బీజేపీతో అవమానాలు ఎదుర్కొంటున్నారన్న అభిప్రాయం కూడా కేడర్‌లో ఉంది. అందుకే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన అధికార టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ శ్రేణుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నా అంతర్గతంలో బీజేపీతో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నాయకులతో విసిగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ
ఓవైపు ధిల్లీలో అపాయింట్‌మెంట్‌ల విషయం, రాష్ట్రంలో పొత్తులో ఉన్నా కనీసం కార్యాచరణ విషయంలో బీజేపీ ఏకపక్షంగా వ్యవహరించడం, కొందరు నాయకులు బీజేపీలో ఉన్నవారు కూడా పవన్‌ని విమర్శిస్తూ మాట్లాడడం, ప్రజల్లో ఉన్న ఆదరణ కంటే పలు రెట్లు ఎక్కువగా తమకు ఆదరణ ఉందని బీజేపీ భావించిన క్రమంలో తమ పార్టీని, కేడర్‌ని చిన్నచూపు చూడడం తదితర కారణాలు తెరపైకి వచ్చాయి. గత జనవరికి ముందే జరిగిన పార్టీ సమావేశంలో ఈ అభిప్రాయాన్ని ద్వితీయ శ్రేణి నాయకులు వ్యక్తం చేశారు. అదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ కోరిక మేరకు జనసేన పోటీ నుంచి తప్పుకుంది. ఆ పార్టీ నుంచి నామినేషన్లు వేసిన దాదాపు 80 మంది అభ్యర్థులను పార్టీ ఉపసంహరించుకునేలా చేసింది. అయినా గుర్తింపు లభించలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. అప్పట్లోనే జనసేన జెండాలు కనిపించకూడదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పినా తాము సైలెంట్‌గానే ఉన్నామని జనసేన నాయకులు చెబుతున్నారు. తమ పార్టీ బరిలో లేనందునే బీజేపీ 48స్థానాలు గెలుచుకుందని, తమ పార్టీ పోటీలో ఉంటే ఓట్ల చీలిక వచ్చేదని, అందులో కనీసం 10సీట్లైనా ప్రభావితం అయ్యేవని జనసేన నాయకులు చెబుతున్నారు.
ఏపీలోనూ అదే పరిస్థితి..
ఓవైపు ఏపీలో అధికార వైసీపీ నాయకులు జనసేనను టార్గెట్ చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఒక్కమాట కూడా అనడం లేదు. అది పోలరవం నిధుల కేటాయింపు, విశాఖఉక్కు..ఇలా ఏ అంశమైనా సరే..బీజేపీని విమర్శించే సాహసం చేయడం లేదు. అదే సమయంలో టీడీపీ కనీసం కొద్దోగొప్పో.. బీజేపీని విమర్శిస్తోంది. ఇదంతా వైసీపీ – బీజేపీ మ్యూచువల్ అండర్ స్టాండింగ్ ప్రకారమే జరుగుతోందన్న చర్చ నడుస్తోంది. చివరికి చంద్రబాబు మతపరమైన రాజకీయం చేస్తున్నారని వైసీపీ విమర్శించే పరిస్థితికి వచ్చారు. బీజేపీని ఒక్క మాటకూడా విమర్శించే పరిస్థితి వైసీపీకి లేదు. వైసీపీని విమర్శిస్తే కొన్ని వర్గాల ఓట్లు పోతాయని బీజేపీ, బీజేపీని విమర్శిస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని వైసీపీ సర్దుబాట్లు చేసుకున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నాయకుల విషయంలో జనసేనాని విసుగు చెంది ఉంటారనే చర్చ నడుస్తోంది.
Must Read ;- సమధానం దొరకని ప్రశ్నలు.. పవన్ కన్ఫ్యూజన్
2014లో పవన్ ఇలా..
అదే సమయంలో గతంలో ఆయన 2014 లో టీడీపీతో పొత్తులో ఉన్న సమయంలో ఉన్న పరిస్థితిని కూడా జనసేన శ్రేణులు గుర్తుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అధికారంలో ఉన్నా.. చంద్రబాబుతో పలుమార్లు కలిసే అవకాశం రావడం, నియోజకవర్గ స్థాయిలో అప్పటికి పూర్తిస్థాయి పార్టీగా ఇంకా నిర్మాణం పూర్తికానప్పటికీ అభిమానులను కలుపుకొని వెళ్లడం, ప్రాధాన్యం ఇవ్వడాన్ని గుర్తు చేస్తున్నారు. కాకినాడ, తాడేపల్లి గూడెం, విశాఖ, మచిలీపట్నం తదితర చోట్ల పవన్ కల్యాణ్ అభిమానులుగా గుర్తింపు ఉన్నవారికి కూడా టీడీపీ అవకాశం ఇవ్వడం, ఆ అభ్యర్థులు పలుచోట్ల గెలుపొందడాన్ని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. రాజకీయంగా ఓ వైపు ప్రాధాన్యం ఉండడమే కాదు..క్షేత్ర స్థాయిలోనూ కలుపుకొని వెళ్లడం చూసిన జనసేన కేడర్ బీజేపీ నుంచి కూడా అదే ప్రాధాన్యం ఆశించి భంగపడిందని చెబుతున్నారు.
ఇంకా వేచి చూద్దామా..
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక జనసేన కేడర్‌లో ఇంకో చర్చ కూడా మొదలైంది. పార్టీ నిర్మాణానికి అవసరమైతే కొన్ని అవమానాలు భరించవచ్చని, అయితే బీజేపీతో ఉండడం వల్ల బీజేపీకే ప్రయోజనం తప్ప జనసేనకు కాదనే చర్చ మొదలైంది. ఎందుకంటే పురపాలక ఎన్నికల్లో టీడీపీ నామినేషన్లు వేయలేకపోయిన స్థానాల్లో సదరు టీడీపీ నాయకులను ఆ కేడర్ జనసేనకు పరోక్షంగా మద్దతు ఇచ్చారు. పలుచోట్ల జనసేన గెలుపొందింది. అదే సమయంలో బీజేపీ పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలో తమని వాడుకుంటూ..తమనే చిన్నచూపు చూసే బీజేపీ కంటే.. మిత్ర ధర్మాన్ని పాటించే టీడీపీనే బెటర్ అన్న చర్చ పార్టీ కేడర్‌లో నడుస్తోంది.
బీజేపీ బలం..ఇంత తక్కువా
ఏపీలో తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న బీజేపీది మేకపోతు గంభీర్యమేనని జనసేన నాయకులు దుమ్మెత్తి పోస్తున్నారు. పార్టీ బలం ఎంత.. వారు మాట్లాడే మాటలేంటి అనే చర్చ కూడా నడుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 52.63 ఓట్లు వైసీపీకి దక్కాయి. టీడీపీకి 30శాతం రాగా బీజేపీ 2.41 శాతం, జనసేన 4.67 శాతం ఓట్లు పొందాయి. నోటాకు 1.07 శాతంగా ఓట్లు పడ్డాయి. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సానుకూల అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ క్రమంలో 2019అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే టీడీపీ 9శాతం ఓట్లు కోల్పోయింది. అందులో రెండు శాతం వైసీపీకి మళ్లాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏమాత్రం పుంజుకోలేకపోయింది. ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల లెక్కలే. 47లక్షల మంది పాల్గొన్న ఎన్నికల ఫలితాలే. వాటిని 3.94 కోట్ల మంది ఓటర్లు ఉన్న, 3.14 కోట్లమంది ఓటు వేసిన సార్వత్రి ఎన్నికలతో పోల్చలేం. అయితే పురోగతిని పరిశీలించవచ్చు. ఈ రకంగా చూస్తే.. ఏడు డివిజన్ లు, 18వార్డుల్లో జనసేన గెలిచింది. అందులోనూ విశాఖ, గుంటూరు, ఒంగోలు, మచిలీపట్నంలలో గెలుపొందింది. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నామని, తామే అధికారంలోకి వస్తామని చెబుతున్న బీజేపీ క్షేత్రస్థాయిలో ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చని, అయితే వాటిని వదిలేసి తమను అవమానాలకు గురి చేస్తారా అనే చర్చ పార్టీలో నడుస్తోంది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీతో మిత్ర ధర్మం పాటిస్తున్నప్పుడు ఒకటి రెండు అంశాలు తప్ప ఇంతటి పరాభవాలు ఎదురుకాలేదన్న చర్చ నడుస్తోంది.
Also Read ;- బీజేపీ వల్లే ఓడిపోయాం.. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్