Gurjala CI Surendrababu Conducts Seemantham To Lady Constable At The Police Station :
విధి నిర్వహణలోకి దిగితే.. పోలీసులు కఠినంగానే వ్యవహరించాలి. ఏమాత్రం మెతకగా కనిపించినా.. నేరస్తులు వారిని ఓ ఆట ఆడుకుంటారు. అల్లర్లు చెలరేగిపోతాయి. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. అందుకే ఖాకీని మనం కఠినంగా వ్యవహరించే డ్యూటీగానే పరిగణిస్తాం. పోలీసులను కఠినాత్ములుగానే చూస్తాం. వారిని చూస్తేనే.. ఎంతటి ఘనాపాఠీలైనా జడుసుకుంటారు. మొత్తంగా ఖాకీ డ్రెస్ వేసుకునే పోలీసులు ఏమాత్రం కరుణగా వ్యవహరించరన్న వాదన అయితే జనంలో నాటుకుపోయింది. అయితే తమలోనూ సున్నితత్వం, సంప్రదాయాలను పట్టించుకునే తత్వం కూడా ఉంటాయని.. ఉన్నాయని నిరూపించారు గుంటూరు జిల్లా గురజాల సీఐ సురేంద్ర బాబు.
లేడీ కానిస్టేబుల్ కు సీమంతం
అయినా సురేంద్ర బాబు ఏం చేశారన్న విషయానికి వస్తే.. పై ఫొటో చూస్తేనే అర్థం అవుతోంది కదా. గురజాల సర్కిల్ పోలీస్ స్టేషన్ కు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సీఐ సురేంద్ర బాబు.. తన పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది పట్ల చాలా ఆప్యాయంగా ఉంటారు. ఈ క్రమంలో స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఓ మహిళ గర్భం దాల్చింది. నెలలు నిండిన ఆమెను స్టేషన్ కు పిలిపించిన సురేంద్ర బాబు.. సంప్రదాయబద్ధంగా ఆమెకు ఓ సోదరుడిలా సీమంతం నిర్వఃహించారు. ఈ కార్యక్రమాన్ని ఏదో తూతూ మంత్రంగా కాకుండా స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించి.. పుట్టింటి వారు ఏ మేర సీమంతం నిర్వహిస్తారో.. అచ్చూ అలాగే సురేంద్ర బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పై అధికారే తన సొంత సోదరుడిలా తనకు సీమంతం జరపడంతో ఆ లేడీ కానిస్టేబుల్ ఆనందానికే అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
Must Read ;- కటకటాల్లో తండ్రి.. ఐసీయూలో కూతురు