( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు గత రెండు నెలల కాలంలో నిర్వహించిన సర్వేలో సుమారు ఆరువేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. జిల్లా రివ్యూ సమావేశంలో అధికారులు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించిన తరువాత అక్రమ నిర్మాణాలు పెరిగాయని , వాటికి అడ్డుకట్ట వేసేందుకు సర్వే చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగని అధికారులు అడపాదడపా అమాయకుల భవన నిర్మాణాలపై రంధ్రాలు పెడుతున్నారు. స్లాబ్ పైభాగంలో ఒకటి రెండు చోట్ల హోల్స్ పెట్టి మళ్లీ కట్టుకోండి అంటూ జీవీఎంసీ సిబ్బంది వెనుదిరుగుతున్నారు.
Also Read:-విశాఖ కూల్చివేతల్లో ఈ వీకెండ్ టార్గెట్ ఎవరు?
సీన్ కట్ చేస్తే..
విశాఖలో అనేక అంతర్జాతీయ ఈవెంట్లకు వేదికగా నిలిచిన మంగమారి పేట వద్ద గల గో కార్ట్ కేంద్రాన్ని శనివారం జీవీఎంసీ అధికారులు నేలమట్టం చేసేశారు. లియో న్యూస్ చెప్పినట్టుగానే శని, ఆది వారాల్లోనే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు తెగబడుతోంది. విశాఖ వచ్చిన పర్యాటకులు అధిక శాతం go-kart కేంద్రాన్ని సందర్శిస్తుంటారు. కుటుంబ సమేతంగా అన్ని వయస్సుల వారికి ఉపయోగపడే విధంగా ఈ కేంద్రాన్ని కొన్నేళ్ల క్రితం తీర్చిదిద్దారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడేవారు go-kart పోటీలకు హాజరయ్యేవారు. అనేక జాతీయ స్థాయి ఈవెంట్లు ఈ కేంద్రంలో నిర్వహించారు.
Also Read:-విశాఖలో ‘గో కార్టింగ్’ కూల్చివేత..
ఇతరులకు ఓ రీతి.. టీడీపీ నేతలకు మరో నీతా
మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ , మాజీ మేయర్ సబ్బం హరి, గీతం యూనివర్సిటీ, గత వారం గంటా భూములు… తరవాత హర్షవర్ధన్ రెస్టారెంట్.. ఈ వారం గంటా శ్రీనివాసరావు అనుచరుల వ్యాపార సంస్థలపై చర్యలు…. విశాఖలోని అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనాలు. టీడీపీ నేతలు టార్గెట్‌గా చేపడుతున్న కూల్చివేతల చిట్టా ఇది.
వాటిని కూలుస్తారా?
జీవీఎంసీ గుర్తించిన సుమారు 6, 000 నిర్మాణాలను సైతం ఇదే విధంగా కూల్చే సత్తా, ధైర్యం అధికారులకు ఉందా? అటువంటి చర్యలకు ఉపక్రమిస్తే ప్రజల తిరుగుబాటును ఎదుర్కొనే దమ్ము ప్రభుత్వానికి, అధికారులకు ఉంటుందా? అని ప్రశ్నిస్తే సమాధానాలు వెతకడం చాలా కష్టం. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను సకాలంలో గుర్తించి తొలగింపులు చేపడితేనే వ్యతిరేకత వస్తుంది. అటువంటిది ఏళ్ళనాటి ఆస్తులను అడ్డగోలుగా కూల్చివేస్తున్న కారణంగా ప్రభుత్వమే అప్రతిష్ట మూట కట్టుకుంటోంది. నగరంలోని అన్ని జోన్లలో కలిపి 6, 000 లకు పైగా ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. వాటన్నింటినీ పక్కనపెట్టి టీడీపీ నేతలు లక్ష్యంగా చేపడుతున్న తొలగింపులు ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని గ్రహించకపోవడం విడ్డూరం.
నిరంతరం ఇదే ప్రక్రియ..
విశాఖలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, సానుభూతిపరుల ఆస్తులపై దాడులు కొనసాగుతున్న తీరు చూస్తుంటే ఇది ఒక నిరంతర ప్రక్రియలా కనిపిస్తోంది. కోర్టు సెలవులు అయిన శని, ఆదివారాలు వస్తే చాలు… గత రెండు నెలలుగా టీడీపీ నేతలకు సంబంధించిన ఆస్తులు, వ్యాపారాలపై నిబంధనల అస్త్రాన్ని అధికారులు ఎక్కుపెడుతున్నారు. విశాఖలో ఇటువంటి వ్యవహారాలపై దృష్టి పెడితే.. పట్టుమని పది శాతం వ్యాపార సంస్థలు కూడా మిగలవు. మరి ఈ అధికార దుర్వినియోగం ఇంకెంత కాలం కొనసాగిస్తారో చూడాల్సిందే.
Also Read:-తెలుగుదేశం ముద్ర ఉంటే.. భయపడుతూ బతకాలా?