టాలీవుడ్ దర్శకులలో సురేందర్ రెడ్డి స్థానం ప్రత్యేకం. ఆయన కథాకథనాలను నడిపించే తీరు .. పాత్రలను మలిచే విధానం కొత్తగా ఉంటాయి. ఇక ఆయన టేకింగ్ చాలా స్టైలీష్ గా ఉంటుంది. హీరోయిజాన్ని చూపించడంలోను ఆయనకంటూ ఒక మార్కు ఉంది. తన సినిమాకి సంబంధించిన కథలో యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ పుష్కలంగా ఉండేలా ఆయన చూసుకుంటాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూర్చోబెట్టే అంశాలతో పాటు, మాస్ ఆడియన్స్ విజిల్స్ కొట్టే అంశాలను కూడా యాడ్ చేస్తూ వెళుతుంటాడు. దర్శకుడిగా ఆయన సత్తాను .. స్టైల్ ను చాటిచెప్పడానికి, ‘కిక్’ .. ‘రేసుగుర్రం’ .. ‘ధ్రువ’ సినిమాలు సరిపోతాయి.
లవ్ .. యాక్షన్ .. కామెడీ కలిసిన కథలను తెరకెక్కించడం వేరు .. చారిత్రక నేపథ్యం కలిగిన కథలతో మెప్పించడం వేరు. ‘సైరా’తో భారీ చిత్రాల బాధ్యతను కూడా మోయగలననే విషయాన్ని సురేందర్ రెడ్డి నిరూపించాడు. అలాంటి సురేందర్ రెడ్డి .. పవన్ కల్యాణ్ తో ఓ సినిమా చేయనున్నాడనే సంగతి తెలిసిందే. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ ప్రాజెక్టు సెట్ కావడానికి కారకుడు చరణ్ అనే చెప్పాలి. సురేందర్ రెడ్డి – చరణ్ మంచి స్నేహితులు. అందువలన ఆ మధ్య సురేందర్ రెడ్డి ఒక లైన్ అనుకోగా, దానిని పవన్ కి చెప్పమని చరణ్ సిట్టింగ్ ఏర్పాటు చేశాడు. ఆ లైన్ విన్న వెంటనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
అప్పటి నుంచి సురేందర్ రెడ్డి ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తూ వచ్చాడు. రీసెంట్ గా పవన్ ను కలిసిన సురేందర్ రెడ్డి ఆయనకు పూర్తి స్క్రిప్టును వినిపించాడనీ, పవన్ సంతృప్తిని వ్యక్తం చేశాడని అంటున్నారు. ఇక స్క్రిప్ట్ సైడ్ సురేందర్ రెడ్డి రెడీగా ఉన్నట్టే. ప్రస్తుతం ఆయన అఖిల్ ప్రాజెక్టుకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాతనే ఆయన పవన్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. ఇంతవరకూ పవన్ చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. ఆల్రెడీ చరణ్ .. బన్నీ .. చిరంజీవిలతో భారీ సినిమాలు చేసిన సురేందర్ రెడ్డికి, పవన్ తో చేయాలనే ముచ్చట కూడా త్వరలోనే తీరనుందన్నమాట!
Must Read ;- పవన్ చుట్టూ తిరుగుతున్న మహేష్ డైరెక్టర్











