ప్రభాస్ ఇప్పుడు ప్రపంచపటాన్ని ఆక్రమించుకున్న హీరో. ఆయన సినిమా ఏదైనా ఇప్పుడు మారుమూల గ్రామాల నుంచి దేశాలను దాటుకుని వెళుతోంది. అదే స్థాయిలో ఆయన క్రేజ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నవన్నీ, పాన్ ఇండియా సినిమాలే. ఒకటి రొమాంటిక్ మూవీ కాగా, మరొకటి యాక్షన్ మూవీ. ఇక మూడో సినిమాగా ‘ఆది పురుష్’ పట్టాలెక్కనుంది. రామాయణం కథా వస్తువుగా రూపొందనున్న సినిమా ఇది. ప్రభాస్ రాముడిగా .. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు.
500 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. కీలకమైన పాత్రలకి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ‘హేమమాలిని’ని తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. కథానాయికగా ఒకప్పుడు బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసిన హేమమాలిని, కొంతకాలంగా అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు కోసం ఆమెను ఒప్పించినట్టుగా తెలుస్తోంది.ఆమె కూడా ఇతిహాసమైన రామాయణం కథా వస్తువు కావడం వలన అంగీకరించారని అంటున్నారు.
రాముడు ధీర గంభీరుడు .. ఎంతటి పరాక్రమవంతుడో అంతటి శాంతమూర్తి. ఆయన తన జీవితంలో ఒక్క వృథా అయిన మాట మాట్లాడలేదని రామాయణం చెబుతోంది. తనని ఆరాధించిన శబరి .. గుహుడు వంటి వారికే కాదు, వాలి .. రావణుడు వంటివారికి కూడా ముక్తిని ప్రసాదించినవాడాయన. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అడుగడుగునా ధర్మాన్ని ఆవిష్కరిస్తూ వెళ్లే రాముడి పాత్రలో ప్రభాస్ ను చూడటానికి ఆయన అభిమానులంతా ఉత్సాహపడుతున్నారు. అందుకు తగినట్టుగానే ఆయనను చూపించడానికి దర్శకుడు ఓం రౌత్ కృషి చేస్తున్నాడట. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Must Read ;- ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ తమ్ముడుగా బాలీవుడ్ హీరో











