ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు సంబంధించి తాజా అప్ డేట్ వచ్చేసింది. వచ్చే ఫిబ్రవరి 2న ఈ సినిమా షూటింగ్ ప్రారభమవుతుంది. ఈ సినిమాని త్రీడీలో తెరకెక్కిస్తున్నారు. 2022 ఆగస్టు 11న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఇంతకుముందే ప్రకటించారు. దర్శకుడు ఓంరౌత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. పాన్ ఇండియా మూవీగా రూపొందే ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, రావణుడిగా సయీఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
టీ సిరీస్ అధినేతలు భూషణ్ కుమార్, రాజేష్ నాయర్, కిషన్ కుమార్, ఓంరౌత్, ప్రసాద్ సుతారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మోషన్ క్యాప్చర్ ఫోటోను కూడా విడుదల చేశారు. హీరో ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలలోనూ ఏక కాలంలో ప్రభాస్ నటిస్తారని అర్థమవుతోంది.
Must Read ;- ప్రభాస్ ‘సలార్’ లో నైఫ్ లాంటి హీరోయిన్.. ?

మోషన్ క్యాప్చర్ విధానానికి నేడే శ్రీకారం
ఆదిపురుష్ సినిమా మోషన్ క్యాప్చర్ ఈ రోజు ఉదయం నుంచి ప్రారంభమవుతుంది. దీనిపై భూషణ్ కుమార్ మాట్లాడుతూ టి-సిరీస్ లో తాము ఎప్పుడూ కొత్త ఆలోచనలతో ముందుకు వెళుతుంటామన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, చిత్రనిర్మాణ భవిష్యత్తుకు మోషన్ క్యాప్చర్ విధానం మార్గం సుగమం చేస్తుందని, ఓంరౌత్, అతని బృందం మొత్తం కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతోందని వివరించారు.
అంతర్జాతీయ సినిమాల్లో సాధారణంగా ఉపయోగించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఆదిపురుష్ సినిమా మొదటిసారిగా భారతీయ చిత్రనిర్మాణంలోకి అడుగుపెడుతోందని అన్నారు. నిర్మాత ప్రసాద్ సుతార్ మాట్లాడుతూ రియల్ టైమ్ టెక్నాలజీతో కలిపి హై-ఎండ్ విజువల్ ఎఫెక్ట్స్ సాధారణంగా అంతర్జాతీయ చిత్రాలలోనే ఉపయోగిస్తారని, కథను చక్కగా వివరించడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని అన్నారు. ఆదిపురుష్ కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికీ, పురాణ కథను చెప్పడానికీ తాము ఈ విధానాన్ని ఎంచుకున్నామని వివరించారు.
Must Read ;- ఈ విషయంలో ప్రభాస్ అభిమానులకు నిరాశేనా?











