సూర్యకి తమిళనాట మాత్రమే కాదు .. తెలుగులోను మంచి క్రేజ్ వుంది. కోలీవుడ్ లోనే కాదు .. టాలీవుడ్లోను మంచి మార్కెట్ ఉంది. అందువలన ఆయన సినిమాలు తమిళంతో పాటు, తెలుగులోను విడుదలవుతూ ఉంటాయి. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి వచ్చింది. ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఒక వైపున హీరో సూర్యను అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతూ ఉంటే, మరో వైపున దర్శకురాలు సుధా కొంగరను అభినందించే ప్రముఖుల జాబితా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను గురించి ఈ వారం ‘పరుచూరి పాఠాలు’లో పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని ఆవిష్కరించారు.
“ఈ సినిమాలో చిన్న విమానాలను చూస్తున్నప్పుడు, నాకు నా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. ‘నా దేశం’ సినిమాకి ముందువరకూ నేను విమానంలో ప్రయాణించలేదు. ‘నా దేశం’ సినిమా షూటింగు కోసం కోయంబత్తూరు నుంచి ఊటీకి ఓ చిన్నపాటి విమానంలో బయలుదేరాము. నిర్మాత దేవీవరప్రసాద్ గారు నా కోసం టికెట్ తీసుకున్నారు. అది రూపాయి టికెట్ కాదుగానీ, నిర్మాతల డబ్బుతో నేను తొలిసారిగా విమానం ఎక్కాను. నా పక్క సీట్లోనే ఎన్టీ రామారావుగారు కూర్చున్నారు. ఫ్లైట్ లో ఏదో ఎనౌన్స్ చేస్తున్నారు .. నేను అలాగే కూర్చున్నాను. అది గమనించిన అన్నగారు “బ్రదర్ .. బెల్ట్ పెట్టుకోండి” అన్నారు. “నేను విమానం ఎక్కడం ఇదే ఫస్టు టైమ్ .. నాకు తెలియదు అన్నగారు” అన్నాను. అప్పుడు ఆయనే సీట్ కి వున్న బెల్ట్ ను ఎలా పెట్టుకోవాలో .. ఎలా తీయాలో చూపించారు. ఆ తరువాత విమానాన్ని చాలాసార్లు ఎక్కినప్పటికీ మొదటి అనుభవమే ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
తన ఆశయం దిశగా దూసుకుపోతున్న హీరోకి ఎలాంటి అవాంతరాలను సృష్టించవచ్చు అనేది కొత్త రచయితలు ఈ సినిమాను చూసి తెలుసుకోవచ్చు. ఆదిలోనే హీరోకి అధికారులు అడ్డుపడటం .. అనుమతులు రాకుండా చేయడం .. డబ్బులు రాకుండా .. విమానాలు దిగకుండా చేయడం .. జనంలో అతని విమానాలపై నమ్మకం పోయేలా చేసినా హీరో వాటిని ఎలా అధిగమిస్తూ వచ్చాడనేది సుధా కొంగర గొప్పగా ఆవిష్కరించారు. హీరో గెలుపు ఓటమిలను తన స్క్రీన్ ప్లే తో ఆసక్తికరంగా నడిపించిన ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నాను.
చాలాకాలం తరువాత సూర్య ఒక గొప్ప సినిమా చేశాడనిపించింది. తన చిన్నప్పటి నుంచి సూర్య నాకు తెలుసు. మేము చెన్నైలో నూతన్ ప్రసాద్ ఇంట్లో ఉంటున్నప్పుడు, పక్క ఇంట్లోనే శివకుమార్ గారు వాళ్లు ఉండేవారు. ఆయన సూర్య – కార్తి వాళ్ల నాన్నగారు. ఆయన నాతో చాలా బాగా మాట్లాడేవారు. అప్పటికి సూర్య – కార్తి చిన్నపిల్లలు. అప్పట్లోనే వాళ్లు తెలుగు చాలా చక్కగా మాట్లాడేవాళ్లు. ఇప్పటికీ నేను ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. అలాంటి ఆ పిల్లలు ఈ రోజున ఈ స్థాయికి ఎదగడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ఒక అద్భుతమైన సినిమాగా కార్తి ‘ఖైదీ’ సినిమా చేస్తే, మరో అద్భుతమైన సినిమాగా సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ చేశాడు. రజనీకాంత్ .. కమలహాసన్ మాదిరిగా, సూర్య – కార్తి అక్కడా .. ఇక్కడా అదే క్రేజ్ ను సంపాదించుకోవడం విశేషం” అంటూ తన మనసులోని మాట చెప్పారు.
Must Read ;- కిక్ దిగకముందే.. లైన్లో మూడు సినిమాలు