టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్యే గిరీకి రాజీనామా చేసి పారేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికను అనివార్యం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తనను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే.. తనను అవమానించిన కేసీఆర్‌కు గుణపాఠం చెప్పేలా ఈటల ఉప ఎన్నికలకు తెర తీశారు. ఈటల వ్యూహం ఫలించి హుజూరాబాద్‌కు ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుండగా.. గెలుపోటములపై ఇటు అధికార టీఆర్ఎస్‌తో పాటుగా బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఈటలకు కూడా ముచ్చెమటలే పడుతున్నాయి. నెలల తరబడి ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీతో కలిసి ఈటల నియోజకవర్గాన్ని చుట్టేశారు. అయితే శనివారం ఉదయం ఉప ఎన్నికల పోలింగ్ ఎలాగూ మొదలైపోవడంతో అటు కేసీఆర్‌తో పాటు ఇటు ఈటల భవిష్యత్తు కూడా ఈవీఎంలలో నిక్షిప్తమైపోతోంది. వచ్చే నెల 2న జరగనున్న ఓట్ల లెక్కింపులో గెలుపు గుర్రం ఎవరన్నది తేలిపోనుంది. అప్పటిదాకా అందరూ సైలెంట్‌గానే ఉండక తప్పదు. ఇక్కడ అందరూ అంటే.. బెట్టింగ్ రాయుళ్లు మినహా అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే.. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా బెట్టింగ్ రాయుళ్లు మాత్రం ఫలితాలు వచ్చేదాకా యమా బిజీగా ఉంటారు కదా. అలాంటిది ఇజ్జత్ కా సవాల్ అన్న రీతిలో జరుగుతున్న హుజూరాబాద్ బైపోల్ అంటే మాత్రం వారు ఇంకెంత బిజీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.
రూపాయికి పది రూపాయలు
హూజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన నాటి నుంచి ఈ ఉప ఎన్నిక ఫలితంపై భారీ ఎత్తున చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. ఆదిలో కాస్తంత నిదానంగానే మొదలైన బెట్టింగ్.. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణమే ఒక్కసారిగా ఊపందుకుంది. రూ.10వేలకు రూ.1 లక్ష అంటూ సాగుతున్న ఈ బెట్టింగ్‌లో ఇప్పటికే కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగా సమాచారం. అయితే గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఈ బెట్టింగ్ కు సంబంధించి ఇప్పటిదాకా ఒక్కరంటే ఒక్కరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. బెట్టింగ్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో పోలీసులకు ఏమాత్రం సమాచారం చిక్కకుండా ఉండేలా పకడ్బందీగా ప్లాన్ చేసిన బెట్టింగ్ రాయుళ్లు దందాను సాగిస్తున్నారట. అంతేకాకుండా పొలిటికల్ బెట్టింగ్ లో బడా బాబులే పాలుపంచుకుంటున్న నేపథ్యంలోనూ భారీ ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నట్లుగా సమాచారం. బెట్టింగుల్లోనూ పోలింగ్ ముందు వరకు ఓ రకమైన బెట్టింగ్, పోలింగ్ తర్వాత మరో రకమైన బెట్టింగ్ సాగుతుండగా.. పోలింగ్ రోజైన శనివారం మరో రకమైన బెట్టింగ్ జరుగుతోందట.
ఆ రెంటికే ప్రాధాన్యం
హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తరఫున ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యార్థి ఉద్యమ నేత బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. వీరితో పాటు మరికొందరు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం గెల్లు, ఈటల మధ్యేనని చెప్పాలి. గెల్లు గెలిస్తే టీఆర్ఎస్ కు రెట్టించిన ఉత్సాహం వచ్చినట్టే. అదే సమయంలో ఈటల గెలిస్తే.. టీఆర్ఎస్‌కు నిరుత్సాహం, బీజేపీకి ఉరిమే ఉత్సాహం వచ్చినట్లే. ఇదే అంచనాతో సాగుతున్న బెట్టింగులు కూడా ఈ రెండు పార్టీలు, ఈ పార్టీల అభ్యర్థుల మీదే జరుగుతున్నాయట. సుధీర్ఘ కాలంగా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ వస్తున్న ఈటల గెలుపుపై చాలా మంది పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కాస్తున్నారట. అయితే వ్యూహ రచనలో ఆరితేరిన మంత్రి హరీశ్ రావు నేరుగా రంగంలోకి దిగిన నేపథ్యంలో గెల్లు గెలుపుపైనా భారీ ఎత్తున బెట్టింగులు కాసేందుకు గులాబీ దళానికి చెందిన మద్దతుదారులు ముందుకు వస్తున్నారట. మరి నవంబరు 2న వెలువడనున్న ఫలితాల తర్వాత ఈ బెట్టింగుల ద్వారా ఎవరు ధనవంతులవుతారో? ఎవరు బికారులు అవుతారో? చూడాలి.
Must Read ;- బైపోల్ షురూ!.. రెండు చోట్లా గలాటలే!