ఆయన వయస్సు 64 సంవత్సరాలు! అలాగని ఆయనేమీ వృద్ధాప్య పెన్షను తీసుకుని రోజులు వెళ్లదీస్తున్న ముదుసలి కాదు! ఎంతో జీవితానుభవం ఉన్నవాడు! వందల కోట్ల రూపాయల టర్నోవర్ కలిగి ఉన్న అనేక కంపెనీలకు కొన్ని దశాబ్దాలుగా పద్దులు చూసి పెట్టే.. చార్టర్డ్ అకౌంటెంట్ గా సుదీర్ఘ వృత్తి అనుభవం గడించిన వాడు! ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ తరఫు నుంచి రాజ్యసభ ఎంపీ! పార్లమెంటరీ పార్టీ నాయకుడు! పార్లమెంటు సభ్యుడిగా నెలకు 3,30,000 రూపాయలకు పైగానే జీతం వస్తుంది. ఎంపీలకు ఉండే సకల సదుపాయాలు, అలవెన్సులు ఈ జీతానికి అదనం! ఆయన అయిదేళ్లకు పైగా ఎంపీగానే పనిచేస్తున్నారు! ఇన్ని సానుకూల అంశాలు ఉన్నా సరే.. ఆయనకు ఇప్పటిదాకా సొంత ఇల్లు కూడా లేదు! అద్దె ఇంటిలోనే నివాసం ఉంటున్నాడట. అయ్యోపాపం ఎవరబ్బా ఇంతటి మహానుభావుడు అని అనుకుంటున్నారు.. ఆయన మరెవ్వరో కాదు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి!
ఇప్పటికీ అద్దె ఇంటిలోనే..
తాను హైదరాబాదులో ఇప్పటికీ అద్దె ఇంటిలోనే ఉంటున్నానంటూ.. విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పుకున్నారు. డబ్బుపై తనకు వ్యామోహం లేదని అన్నారు. నెల్లూరు జల్లాకు చెందిన విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంతానికి పార్టీ ఇన్‌చార్జీగా ప్రస్తుతం హవా చెలాయిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అక్కడ పార్టీ వారందరినీ తన చెప్పుచేతల్లో పెట్టుకుని.. రాజధాని విశాఖకు రాబోతున్నదనే ప్రచారం కూడా కలిపి.. విపరీతంగా భూదందాలకు పాల్పడుతున్నారని, అక్రమాలు, ఆక్రమణలు చేస్తున్నారని, వ్యాపారాలకు అడ్డాగా చేసుకున్నారని విపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఇలాంటి విమర్శలకు విజయసాయిరెడ్డి సమాదనం చెప్పారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన తన నిజాయితీని చాటిచెప్పుకునే ప్రయత్నం చేశారు. తనకు డబ్బు వ్యామోహం లేదని, హైదరాబాదులో అద్దె ఇంటిలోనే ఉంటున్నానని సాక్షాత్తూ భగవంతుడి మీద ఒట్టు వేసి మరీ.. ఉద్వేగంగా చెప్పడం విశేషం. తనపై ఆరోపణలన్నీ అవాస్తవాలనీ, తన చిత్తశుద్ధిపై నమ్మకం లేనివారే అలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన వాక్రుచ్చారు. పాపం.. ఇంత సీనియర్ నాయకుడికి సొంత ఇల్లు కూడా లేదంటే జాలి పడాల్సిన విషయమే కదా!
సొంతింటి కల సాకారమెప్పుడో..?
వేల కోట్ల అవినీతి కుంభకోణాలకు సంబంధించి విచారణ జరుగుతున్న కేసుల్లో ఏ2 గా విచారణ ఎదుర్కొంటున్న ఈ నాయకుడు, ఆయన స్వయంగా చెప్పుకుంటున్న ప్రకారం అద్దె ఇంట్లోనే ఇప్పటికీ గడుపుతుండడం చిత్రమే. సొంత ఇల్లు అనేది ఏ మనిషికైనా ఒక కల! విజయసాయిరెడ్డి పాపం.. ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన సొంత ఇంటి కల ఎప్పటికి తీరుతుందో ఏమో! పోనీ ఆయనకు కూడా ఒక జగనన్న పక్కాఇల్లు మంజూరు చేస్తే.. సొంతింటి కల తీరుతుంది కదా.. అని మీకు సానుభూతి కలుగుతోందా? అలా అనిపిస్తే తప్పేం లేదు!.
Must Read ;- కుంతల దేశం విశాఖ.. దానికి రాజు సాయిరెడ్డి











