కొలంబియా కాఫీ తోటల్లో పని చేసే ఓ యువకుడు తన కన్నా వయసులో పెద్ద వాళ్ళు, తన యజమానుల భార్యల ( అందులో ఒకరి కుమార్తెతో కూడా )తో రహస్య శృంగారం జరిపితే ఏమవుతుంది ? నిప్పుతో చెలగాటం అవుతుంది . అదే Netflixలో ఉన్న ” ప్లేయింగ్ విత్ ఫైర్ ‘ వెబ్ సిరీస్ . అందమైన ఆర్టిస్టులు, వాళ్లతో లవ్ మేకింగ్ సీన్స్ ఒక తరహా ప్రేక్షకులకి నచ్చితే ఆ యువకుడి వెనుక ఉన్న కథ, క్రైమ్ డ్రామా, చిన్నపాటి విషాదం ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకునేలా చేస్తాయి .అయితే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు తెలుగు సినిమాకి అమ్మమ్మఅనిపిస్తాయి.
కథ విషయానికి వస్తే…
మొదట ఈ కథ 2014లో బ్రెజిల్ టీవీలో సీరియల్ గా వచ్చింది . తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ ఎక్కువయ్యాక 2019లో అమెరికాలో వెబ్ సిరీస్ గా తీశారు. కొలంబియా ప్రాంతంలో కాఫీ పంట ఎక్కువగా పండే లోయ ప్రాంతం అది. రెండు పెద్ద కుటుంబాలు డోన్ పీటర్, డోన్ గోర్జి … డోన్ పీటర్ ముసలి వాడు. భార్య కామిలా ఆతని కంటే చిన్నది. కోరికలతో తహతహలాడుతోంది. డోన్ గోర్జి దగ్గర పని చేసే ఫ్యాబ్రిజియోతో రహస్యంగా శృంగారం నడుపుతుంటుంది .
పీటర్ భార్య వంటి మీద ఎవరన్నా చేయి వేయాలని చూస్తే చంపేసే రకం. వారికి అయిదేళ్ల కొడుకు . ఇక డోన్ గోర్జి విషయానికి వస్తే మామ గారి నుంచి వచ్చిన ఆస్తులు చూసుకుంటుంటాడు. భార్య మార్టినాతో ప్రేమగా ఉండడు. ప్రేమ కోసం పరి తపిస్తోంది . . డిప్రెషన్ పోవడానికి డ్రగ్స్ తీసుకుంటుంది. వాళ్ళ కుమార్తె ఆండ్రియాని తమ బిజినెస్ పనులు చూసుకోమంటాడు తండ్రి. అంతే కాదు తన మేనేజర్ ని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుంటాడు .ఫ్యాబ్రిజియో తల్లి ఒక వేశ్య. అతని తండ్రి ఎవరో తెలియదు. తల్లి జీవితం అతడిని వెంటాడుతోంది.
తల్లి ప్రవర్తన కారణంగా, ఆడవాళ్ళని సెక్స్ టాయ్స్ గా చూస్తుంటాడు ఫ్యాబ్రిజియో. తన కంటే వయసులో పెద్ద అయిన ఆడ వాళ్ళ మీదే అతని దృష్టి. కామిలా తర్వాత తన బాస్ భార్య మార్టినా ని లొంగదీసుకోవాలనుకుంటాడు . అతని స్నేహితుడు పించో ఇది ప్రమాదకరమని హెచ్చరిస్తుంటాడు. మరో వైపు ఫ్యాబ్రిజియో తల్లి కొడుకుని వెతుకుంటూ మెక్సికో నుంచి కొలంబియా వస్తుంది .
కొడుకు ప్రియురాలు కామిలా దగ్గర పని మనిషిగా చేరి ఆమెనే బ్లాక్ మెయిల్ చేస్తుంది. మార్టినా నెమ్మదిగా ఫ్యాబ్రిజియోతో ప్రేమ లో పడుతుంది . . ఆమె కుమార్తె ఆండ్రియా కూడా ఫ్యాబ్రిజియోని ప్రేమిస్తుంది. డాన్ గోర్జికి భార్య మీదా, ఫ్యాబ్రిజియో మీద అనుమానం వస్తుంది . ఫ్యాబ్రిజియోని చంపేయమని మేనేజర్ ని ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని నియమిస్తాడు. వేట మొదలైంది, ఫ్యాబ్రిజియోకి ఏదన్నా జరిగితే నలుగురు ఆడ వాళ్ళ జీవితం ఏమవుతుందనేదే కథ. మొత్తం10 ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ రూపొందింది. మనసుని తాకుతూ సాగిన ఈ కథ ముగింపు కి వచ్చేటప్పటి కి ఆకట్టుకుంటుంది .
వేదిక: నెట్ ఫ్లిక్స్
రేటింగ్: 2.5/5