సంధ్యావందనం.. ఈ మాటను మనం అనేక సందర్భాల్లో వింటూ ఉంటాం. అసలు సంధ్యావందనం అంటే ఏమిటి? ఆ సమయంలో ఏం చేయాలి? చేస్తే మనకు ఏం వస్తుంది? లాంటి ప్రశ్నలకు మనం సమాధానాలు తెలుసుకుందాం. ఉపనయనం జరిగి యజ్ఞోపవీతాన్ని ఎవరైతే ధరిస్తారో వారు చేయాల్సిన పని సంధ్యావందనం చేయడం. సంధి కాలంలో దీన్ని చేయడం వల్ల ఈ పేరు వచ్చింది. సంధి కాలమంటే పగలు, రాత్రి కలిసే కాలం. యజ్ఞోపవీతం ధరిస్తే సంధ్యావందన చేయకుండా ఏ పనీ తలపెట్టకూడదు. సంధ్యావందనం అంటే ఈ సంధి కాలంలో గాయత్రి, సావిత్రి, సరస్వతి లను ప్రార్ధించాలి. ప్రతి రోజూ మూడు సంధ్యలు ఉంటాయి.
ఉదయ సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య.. ఈ మూడు సమయాల్లోనూ సంధ్యావందనం చేయాలి. ఉదయ సంధ్యలో జీవులు నిద్ర లేస్తాయి. మధ్యాహ్నం నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. సాయం సంధ్యలో జీవులు ఇంటికి చేరి ప్రశాంతతను పొందుతాయి. ముఖ్యంగా ఈ మూడు సమయాలూ ప్రశాంతతకు చిహ్నాలు. మనం ధ్యానం చేయాలంటే ప్రశాంతత కావాలి. అందుకే వీటికి ఇంత ప్రాముఖ్యం. ఉదయం విష్ణుస్వరూపం, మధ్యాహ్నం బ్రహ్మస్వరూపం, సాయంత్రం శివస్వరూపంలో గాయత్రిని ప్రార్థించాలి. గాయత్రిని అనుష్ఠానం చేయకుండా ఏ మంత్రం జపించినా ఫలితం ఉండదు. సూర్యుని అర్ఘ్యం ఇవ్వడం, గాయత్రీ జపం సంధ్యావందనంలో ప్రధానం.
ఎన్నిసార్లు, ఎలా చేయాలి?
మొదటి సంధ్యావందనం రాత్రి చివరిభాగం.. అంటే నక్షత్రాలు ఉండగా చేస్తేనే మంచిది. మనం సూర్యోదయం తర్వాత చేయడం ఆచారంగా వస్తోంది. రెండో సంధ్యా వందనాన్ని సూర్యోదయమైన 12 ఘడియలు తర్వాత చేయాలి. ఇది మధ్యాహ్నం అవుతుంది. సాయం సంధ్యావందనం సూర్యుడు అస్తమిస్తుండగా చేయాలి. నక్షత్ర దర్శనం తర్వాత చేయకూడదు. పురుడు, మైల సమయాల్లో అర్ఘ్యప్రదానం చేస్తే చాలు. ప్రయాణాల్లో వీలుపడకపోతే ధ్యానంతో సరిపెట్టవచ్చు. సంధ్యావందనానికి యజ్ఞోపవీతం ధరించడం ముఖ్యం.
ద్విజులు తప్ప ఇతరులు సంధ్యావందనం చేయకూడదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను ద్విజులు అంటారు. వేకువ స్నానం తర్వాతే సంధ్య చేయాలి. ఒంటి గంట సమయంలో మధ్యాహ్నం. సాయంత్రం ఆరు గంటలకు సాయంకాలగా గమనించాలి. సరైన కాలంలో సంధ్య చేస్తే 10 సార్లు గాయత్రి చాలు. సమయం దాటిపోతే 108 సార్లు చేయాల్సిందే. బ్రాహ్మణుడికి గాయత్రీ జపంతోనే ముక్తి కలుగుతుంది. బ్రాహ్మణుడు సంధ్య వార్చకపోతే కీడు. ధన, ధాన్య నష్టమే కాకుండా మళ్లీ జన్మలో హీన జన్మ లభిస్తుంది. సంధ్యను ఉపాసించని ద్విజుడు సూర్యుడిని హింసించినట్లనని శాస్త్రం చెబుతోంది.
సంధ్యావందనం ఎందుకు చేయాలి?
సంధ్యావందనం ఎందుకు చేయాలో చూద్దాం. సూర్యుడిలో మూడు శక్తులు, ఏడు రంగులు ఉన్నాయి. ఆయనే మనకు ప్రత్యక్ష దైవం. సూర్యుడి సావిత్రి, గాయత్రి, సరస్వతి శక్తులుంటాయి. మూడు సంధ్యల్లో సంధ్యావందనం చేయడం వల్ల ఆ శక్తులు మన సొంతమవుతాయి. ఆయా శక్తులను
“గాయత్రీం ఆవాహయామి
సావిత్రీం ఆవాహయామి
సరస్వతీం ఆవాహయామి”
అనే మంత్రంతో ఆకర్షించడమే సంధ్యావందనం. మూడు సంధ్యలూ ఒకేలా ఉండవు. ఉదయ సూర్యుడిని బాలార్క అని, సాయం సూర్యుడిని వృద్దార్క అంటారు. సూర్యుడు ఉదయం ఏమంత ప్రభావం చూపడు. సాయంత్రం ఆయన ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ఆయన వేడిని భరించలేం. ఈ మూడు దశల్లో సూర్య కిరణాలను చూడటం చాలా అవసరం. అందువల్లే సంధ్యావందనం పేరుతో ఓ ఆచారాన్ని మన పూర్వికులు ఏర్పరిచారు. మనిషి ఆరోగ్య వంతంగా ఉండటానికి ఇది ఎంతో సహకరిస్తుంది. ఉదయం ఎండలో ఉంటే డి విటమిన్ లభిస్తుందని ఇప్పుడు డాక్టర్లు అంటున్నారు. మన ఆచారాల వెనక ఇంతటి అంతరార్థం ఉంటుంది.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- పంచగ్రామాల భూవివాదం.. ఇప్పుడే గుర్తుకొచ్చిందా?