ఇటువైపు ఏపీ సీఎం జగనేమో వైసీపీ అధినేత. టీడీపీ అంటే అస్సలు గిట్టని రీతిగా వ్యవహరించే నేత. అటువైపు నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే. అధికార వైసీపీపై ఓ రేంజిలో యుద్ధం సాగిస్తున్న టీడీపీకి చెందిన నేత. మరి వీరిద్దరి మధ్య భేటీ ఎలా సాధ్యం అంటారా? బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే అయ్యేకంటే ముందుగా సినిమా నటుడు. టాలీవుడ్ లో అగ్రహీరో. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం దిశగా బాలయ్య రంగంలోకి దిగి జగన్ ను కలిస్తే తప్పేమీ లేదు కదా. అది రాజకీయానికి చెందిన అంశమూ కాదు. ఇక బాలయ్య అపాయింట్ మెంట్ అడిగితే.. జగన్ ఇస్తారంటారా? అనే అనుమానాలు కూడా లేకపోలేదు. జగన్ కూడా రాజకీయాల్లోకి రాకముందు బాలయ్యకు వీరాభిమానేనట కదా. ఈ విషయాన్ని జగన్ స్వయంగా చెప్పకున్నా.. కాలేజీ డేస్ లో బాలయ్య సినిమాల విడుదల సందర్భంగా కడపలో వెలిసే ఫ్యాన్స్ పోస్టర్ల మీద జగన్ బొమ్మ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ లెక్కన సినిమా అంశాలపై చర్చించేందుకు బాలయ్య అడగడమే ఆలస్యం.. జగన్ వెంటనే అపాయింట్ మెంట్ ఇచ్చేయడం ఖాయమేనని చెప్పాలి.
చిరుతో కావట్లేదుగా
వాస్తవానికి కరోనా నేపథ్యంలో టాలీవుడ్ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించే దిశగా జగన్ ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి పలువురు సినీ ప్రముఖులను వెంటేసుకుని మరీ జగన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కూడా. అయితే ఆ భేటీలో నిర్ణయాలేమీ తీసుకోకపోగా.. మరోమారు కలుద్దాం అంటూ జగన్ చెప్పారట. అయితే ఆ రెండో భేటీ చిరు అండ్ కో సిద్ధంగానే ఉన్నా.. జగనే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న అపాయింట్ మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేశారట. తాజాగా ఈ నెల 20న అపాయింట్ మెంట్ ఇచ్చారని, అయితే ఆ భేటీలో చిరు అండ్ కోతో జగన్ భేటీ కారని, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేర్ని నాని భేటీ అవుతారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఏం జరుగుతుందో కూడా స్పస్టంగా తెలియడం లేదు. ఇలాంటి నేపథ్యంలోనే బాలయ్య ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అన్నీ ఊహాగానాలేనా?
చిరంజీవితో పాటు ఇతర ప్రముఖులందరూ కలిసికట్టుగానే జగన్ వద్దకు వెళ్లిన సమయంలో ఏ కారణం చేతనో బాలయ్య వారితో కనిపించలేదు. ఆ తర్వాత బాలయ్యను చిరు పిలవలేదని కొందరు, చిరు పిలిచినా బాలయ్య వెళ్లలేదని మరికొందరు ప్రచారం చేశారు. అందులో నిజమేదో తెలియదు గానీ.. చిరుతో ఎలాగూ పని కావట్లేదు కదా.. స్వయంగా నేనే రంగంలోకి దిగితే ఎలా ఉంటుందని బాలయ్య యోచించారట. ఈ విషయంపై తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఇద్దరు నిర్మాతలతో పాటు ఇద్దరు బడా డిస్ట్రిబ్యూటర్లతోనూ బాలయ్య చర్చించారట. ఇందులో తప్పేముంది.. టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం మీరే కృషి చేస్తే అందరూ స్వాగతిస్తారు కదా.. ఇందులో రాజకీయాలేమీ లేవు కదా అని వారు అన్నారట. దీంతో ఆ నలుగురిని మాత్రమే వెంటేసుకుని బాలయ్య.. జగన్ తో భేటీ అయ్యే దిశగా ఆలోచిస్తున్నారన్న వార్తలు గడచిన రెండు, మూడు రోజుల నుంచి ఓ రేంజిలో వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలేమిటో తెలియదు గానీ.. బాలయ్య కోరితే జగన్ నుంచి మాత్రం సానుకూలంగానే స్పందన రావడం ఖాయమన్న వాదన అయితే బలంగా వినిపిస్తోంది.
Must Read ;- మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలపై లాఠీచార్జి