గౌతం అదానీ.. పరిచయం అక్కర్లేని పేరు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన వ్యాపార సామ్రాజ్యం అదానీ గ్రూప్ ను ఇంతింతై వటుడింతే.. అన్నట్టుగా విస్తరించుకుంటూ సాగుతున్న అదానీ.. త్వరలోనే దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలూ లేకపోలేదు. ప్రస్తుతం ఇండియన్ రిచెస్ట్ గా ఉన్న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీని కూడా అదానీ దాటేసే సమయంమరెంతో దూరంలో లేదన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో గౌతం అదానీ తన సోదరులతో కలిసి ఆదివారం విజయవాడ వచ్చారట. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టులో ల్యాండైన అదానీ బ్రదర్స్.. మధ్యాహ్నం 3.30గ గంటలకు తిరిగి అదే విమానంలో టేకాఫ్ తీసుకున్నారట. ఉదయం 10.30 గంటకు విజయవాడ చేరుకున్న అదానీ బ్రదర్స్.. మధ్యాహ్నం 3.30 దాకా ఏం చేశారు? ఎక్కడికెళ్లారు? ఎవరిని కలిశారు? ఏం మాట్లాడారు? అన్న వివరాలేమీ బయటకు రాలేదు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గన్నవరం నుంచి నేరుగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన అదానీ బ్రదర్స్ సీఎం జగన్ తో భేటీ అయ్యారట. సుధీర్ఘంగానే సాగిన ఈ భేటీ ముగియగానే.. తిగిరి అదానీ బ్రదర్స్ తాము వచ్చిన ఫ్లైట్ లోనే తిరుగు ప్రయాణయ్యారు. అదానీల పర్యటన, జగన్ తో భేటీ గురించిన వివరాలేమీ వెల్లడి కాలేదు.
సాంతం సీక్రెట్ గానే..
సాధారణంగా అదానీ పర్యటన అంటే.. అటు బిజినెస్ వర్గాలతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లోనూ అమితాసక్తి ఉంటుంది. అదానీ ఎక్కడికెళ్లినా కూడా మీడియా ఆయనపై ఓ కన్నేసే ఉంటుంది. అయితే ఆదివారం నాడు అదానీ తన సోదరులతో కలిసి విజయవాడ రావడం, తాడేపల్లిలో జగన్ తో భేటీ కావడం, ఆ తర్వాత వచ్చిన ఫ్లైట్ లోనే తిరుగు ప్రయాణమవ్వడం.. ఇదంతా పూర్తయ్యే దాకా ఈ విషయం అసలు బయటకే పొక్కలేదు. అదానీ తన విజయవాడ పర్యటన ముగించుకుని వెళ్లిన తర్వాత మాత్రమే మీడియాకు కూడా ఈ సమాచారం అందింది. ఆలస్యంగా అందిన ఈ సమాచారానికి సంబంధించిన వివరాలేమీ వెల్లడి కాలేదు. కేవలం అదానీ బ్రదర్స్ స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి తాడేపల్లికి వెళ్లారు. జగన్ తో భేటీ అయ్యారు. తిరిగి వెళ్లిపోయారు.. అన్న వివరాలు తప్పించి అసలు జగన్ తో వారి భేటీకి గల కారణాలేమిటన్న విషయం బయటకు రాలేదు. ఈ సమాచారం కూడా ఏదో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా లీకైందే తప్పించి.. ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతేకాకుండా అధికార వర్గాలు కనీసం ఈ భేటీని ధ్రువీకరించలేదు కూడా. అసలు అదానీ బ్రద్స్ వచ్చారనో, రాలేదనో కూడా వెల్లడించలేదు. దీంతో అదానీలు సీఎం జగన్ తో భేటీ అయ్యారని, కీలక అంశాలపై చర్చించే ఉంటారన్న వాదనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
డీల్ ముగిసినట్టేనా?
ఎప్పుడో 1988లో చిన్న కంపెనీగా ప్రారంభమైన అదానీ గ్రూప్ ఇటీవలి కాలంలో శరవేగంగా విస్తరిస్తోంది. దాదాపుగా అన్ని రంగాల్లోనూ అడుగు పెట్టేసింది. నౌకాశ్రయాల అభివృద్దిపై ఇప్పటికే ప్రధానంగా దృష్టి సారించిన అదానీలు.. ఇప్పుడు తాజాగా ఎయిర్ పోర్టులపైనా కన్నేశారు. నౌకాశ్రయాలకు సంబంధించి ఇప్పటికే ఏపీలోని కృష్ణపట్నం పోర్టును హస్తగతం చేసుకున్న అదానీలకు ఇటీవలే గంగవరం పోర్టును కూడా ఏపీ సర్కారు కానుకగా ఇచ్చేసింది. గంగవరం పోర్టును వంద శాతం అదానీలకు అప్పగించిన జగన్ సర్కారు.. అందులోని ప్రభుత్వ వాటాను కూడా నిబంధనలకు విరుద్ధంగా అదానీలకు అప్పగించింది. వెరసి గంగవరం పోర్టును అదానీలకు జగన్ రాసిచ్చినట్టే కదా. దీనిపై ఇప్పటికే ఓ రేంజిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఆ విమర్శలను జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గంగవరం పోర్టును తమ చేతికి అప్పగించినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపేందుకే గౌతం అదానీ తన సోదరులతో కలిసి మరీ జగన్ తో భేటీ అయ్యారన్న గుసగుసలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. గంగవరాన్ని ఆయాచితంగా తమకు అప్పగించిన జగన్ కు అదానీలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకే తాడేపల్లి వచ్చి ఉంటారన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.
Must Read ;- రఘురామ సెటైర్లతో జగన్ ఉక్కిరిబిక్కిరి











