AP CM YS Jagan Delhi Tour :
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వారంలోనే ఢిల్లీ పర్యటనకు బయలుదేరతారన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఢిల్లీ టూర్ లో ప్రధాన నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, మరో ఇద్దరు కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్ర సింగ్ షెకావత్ లతో భేటీ అయ్యారు కదా. ఈ సందర్భంగా ఇతర అంశాలు ఎలా ఉన్నా.. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై కేసీఆర్ కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వినిపించాయి. ఈ ఫిర్యాదుల్లో జగన్ సర్కారు కొత్తగా కడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకమే కేంద్ర బిందువుగా మారిందని, ఈ ప్రాజెక్టు కారణంగానే ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొందని, దీనిని నిలుపుదల చేస్తే వివాదం సద్దుమణిగినట్టేనని కూడా కేసీఆర్ చెప్పినట్లుగా వార్తలు వినిపించాయి. ఇలా కేసీఆర్ కేంద్ర మంత్రులతో వరుస భేటీలు వేసి తిరిగి రానున్న సమయంలో జగన్ ఢిల్లీ టూర్ కు రెడీ అయిపోతున్న తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. కేసీఆర్ ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రమే జగన్ ను ఢిల్లీకి రావాలని పిలిచిందా? లేదంటే కేసీఆర్ చేసిన ఫిర్యాదుల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పేందుకే జగన్ ఢిల్లీ వెళుతున్నారా? అన్న కోణంలో సరికొత్త విశ్లేషణలు సాగుతున్నాయి.
మోదీ షాలతో భేటీనే కీలకం
జగన్ తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో భేటీలే కీలకంగా మారనున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. వీరిద్దరితో భేటీ కోసమే తపించిపోయేవారు. వారి అపాయింట్ మెంట్ల కోసం రోజుల తరబడి కసరత్తు చేసేవారు. ఒక్కోసారి అమిత్ షా అపాయింట్ మెంట్ దొరికినట్టే దొరికి రద్దైపోయేది. అలాంటి సమయాల్లో తన ఢిల్లీ టూర్ ను వాయిదా వేసుకున్న జగన్.. మళ్లీ అమిత్ షా నుంచి కబురు రాగానే ఢిల్లీ ఫ్లైటెక్కేవారు. మొత్తంగా జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. మోదీ, అమిత్ షాలతో భేటీలే ప్రముఖంగా వినిపించేవి. ఈ దఫా అదే రిపీట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే.. కేసీఅటు అటు ప్రధానితో పాటు ఇటు అమిత్ షాతోనే భేటీ అయ్యారు. ఇరువురి వద్ద జగన్ సర్కారు తీరుపై ఫిర్యాదు చేశారు. మరి కేసీఆర్ వాదనలు నిజం కాదని తేల్చాలంటే.. జగన్ కూడా వారిద్దరితో భేటీ కావాల్సిందే కదా. మరి మోదీ అపాయింట్ మెంట్ విషయంలో ఏమంత ఇబ్బంది లేకున్నా.. అమిత్ షా అపాయింట్ మెంట్ ను జగన్ సాధిస్తారా? అన్న దిశగా సరికొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
జగన్ లక్ష్యం ఏమిటంటే..?
ఢిల్లీ పర్యటనకు వెళితే మాత్రం.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కేంద్రం నుంచి అనుమతులు సాధించాల్సిందేనని జగన్ భావిస్తున్నారట. ఎందుకంటే..కృష్ణా నదీ జలాలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ వృథా నీటి ఆధారంగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ సామర్ధ్యాన్ని అమాంతంగా పెంచేస్తూ దానికే రాయలసీమ ఎత్తిపోతల పథకం అని జగన్ సర్కారు కొత్త పేరు పెట్టింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే.. రాయలసీమకు పుష్కలంగానే నీరందించే అవకాశం ఉంది. అంతేకాకుండా కొంత మేర డెల్టాకు కూడా నీరందించే అవకాశాలు కూడా ఉన్నాయి. వెరసి ఈ ప్రాజెక్టుపై వేరెవరో చెప్పిన కారణాలు విని కేంద్రం దానిని నిబంధనలకు విరుద్ధమైన ప్రాజెక్టుగా నిర్ధారిస్తే.. జగన్ కొంప కొల్లేరైనట్లే. అందుకే.. కేసీఆర్ ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం పెద్దలు పిలిచినా, పిలవకపోయినా కూడా తాను ఢిల్లీ వెళ్లి తీరాల్సిందేనని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కేంద్రం పెద్దలు పిలిచినా.. తానే వెళుతున్నా.. ఈ దఫా ఢిల్లీ టూర్ మాత్రం జగన్‌కు అత్యంత ప్రాముఖ్యమైనదిగానే చెప్పాలి.
Must Read ;- జగన్ కంటే కేసీఆరే తోపు