ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడ నగరంలో పట్ట పగలు జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలై కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇటీవలే ఇంటికి చేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మళ్లీ రంగంలోకి దిగారు. ఏ రోజు అధికార పార్టీ ఆగడాలపై మీడియా ముందుకు వచ్చినా… పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో రంగంలోకి దిగుతున్న పట్టాభి నిజంగానే అధికార పార్టీకి కంటిలో నలుసుగా మారారని కూడా చెప్పాలి. ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకు వచ్చి అధికార పార్టీ ఆగడాలను ఎండగట్టిన పట్టాభి తనపై జరిగిన దాడి తర్వాత మరింత పకడ్బందీగా మీడియా ముందుకు వచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై జగన్ మోహన్‌రెడ్డి సర్కారు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడమే కాకుండా… అసలు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం అవుతుందన్న విషయం తెలిసి కూడా ఏడాది పాటుగా నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరించిన వైసీపీ సర్కారు దమననీతిని ఆయన పక్కా ఆధారాలతో సహా బయటపెట్టారు.
గూడు పుఠాణిని వివరించిన పట్టాభి
ఇటీవల విజయవాడలోని గురునానక్ కాలనీలో తన ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలో పట్టాభిపై గుర్తు తెలియని దుండగులు మూకుమ్మడి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పట్టాభి కారుపై విచుకుపడిన పది మంది దుండగులు రాళ్లు, కర్రలు, రాడ్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి సందర్భంగా పట్టాభి కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ దాడి నుంచి పట్టాభి ప్రాణాలతో బయటపడ్డారు. దుండగుల దాడిలో పట్టాభికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి ఒక్క విజయవాడలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలమే రేపింది. అధికార పార్టీపై ప్రత్యేకించి సీఎం జగన్ మోహన్‌రెడ్డిపై వరుస విమర్శలు చేస్తుండటం, సదరు విమర్శలను ఏదో అదాటుగా కాకుండా పక్కా ఆధారాలతో బయటపెడుతున్న కారణంగానే పట్టాభిపై దాడి జరిగిందని అంతా అనుకున్నారు. దాడిలో తృటిలో తప్పించుకున్న పట్టాభి… చికిత్స అనంతరం మంగళవారం ఓ తెలుగు వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన తనపై జరిగిన దాడిని వివరించడంతో పాటుగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలను ఓ కుదుపు కుదిపేస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జరుగుతున్న గూడు పుఠాణిని పట్టాభి పూసగుచ్చినట్టు వివరించారు.
Must Read ;- పట్టాభిపై దాడి కేసులో ఆరుగురి అరెస్టు
పోలీసుల తీరుతో మరింత బాధ
తనపై జరిగిన దాడిపై పట్టాభి ఏమన్నారన్న విషయానికి వస్తే.. నాడు తాను తన ఇంటి నుంచి బయటకు వచ్చాక… ఓ స్పీడ్ బ్రేకర్‌ను దాటుతున్న సమయంలో కారు స్పీడ్ తగ్గగా… ఒక్కసారిగా పది మంది దుండగులు రాళ్లు, కర్రలు, రాడ్లు చేతబట్టుకుని దాడికి దిగారట. పెద్ద సంఖ్యలో ప్రముఖులున్న ప్రాంతం కావడం, అక్కడి వారికి తానెవరో తెలియడం, తనపై దాడి జరుగుతుండటాన్ని చూసిన వారంతా అరుచుకుంటూ పరుగెత్తుకుని రాగా.. దుండగులు పారిపోయారు. అదే సమయంలో తన డ్రైవర్ కూడా చాకచక్యంగా వ్యవహరించడం కూడా తాను దాడి నుంచి ప్రాణాలతో బయటపడేసిందని కూడా పట్టాభి చెప్పారు. ఆపై ఎంట్రీ ఇచ్చిన పోలీసులు… ఎక్కడైతే గాయాలయ్యాయో అక్కడే చేతులతో గట్టిగా పట్టేసుకుని తనను మరింత బాధకు గురి చేశారని చెప్పారు. తనను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కనీసం ఒక్క 108 వెహికిల్ కూడా అందుబాటులోకి రాలేదా? అంటూ పట్టాభి ప్రశ్నించారు. ఈ దాడిపై తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వెనువెంటనే స్పందించడం, తన ఇంటికి రావడం, తనపై జరిగిన దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజిలను సేకరించిన వైనాన్ని ఆయన వివరించారు. నాడు చంద్రబాబు స్పందించకపోయి ఉంటే… సదరు సీసీటీవీ ఫుటేజీని కూడా జగన్ సర్కారు మాయం చేసి ఉండేదని కూడా పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. తనపై జరిగిన దాడి ముమ్మాటికీ జగన్ సర్కారు చేయించినదేనని కూడా పట్టాభి ఆరోపించారు. తనపై దాడికి దిగిన వారు… దాడి సందర్భంగా మా జగనన్నపైనే మాట్లాడతావా? అంటూ విరుచుకుపడ్డారని పట్టాభి చెప్పుకొచ్చారు.
Must Read ;- ఇక్కడా, అక్కడా బలైయింది రైతులే.. విశాఖ ఉక్కు బాధితులకు అమరావతి రైతుల సంఘీభావం
దాడులకు భయపడేది లేదు..
ఇక ఆసుపత్రిలో చికిత్స, ఆ తర్వాత ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా తాను ఏం ఆలోచించానన్న విషయాన్ని వెల్లడించిన పట్టాభి… జగన్ మోహన్‌రెడ్డి సర్కారుపై తాను చేస్తున్న పోరాటాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా సంచలన ప్రకటన చేశారు. ఇప్పటిదాకా జగన్ సర్కారుపై తాను కొనసాగించిన పోరాటాన్ని మరింత తీవ్రంగా కొనసాగిస్తానని, ఇందుకు అనుసరించాల్సిన వ్యూహాలపైనే తాను ఆలోచించానని కూడా పట్టాభి చెప్పారు. జగన్ సర్కారు తప్పులు చేయడాన్ని మానేస్తే… దోపిడీని మానేస్తే… తాను తన పోరాటాన్ని ఆపేస్తానని ఆయన చెప్పారు. వైసీపీ సర్కారు తప్పులు చేసినంత కాలం తాను పోరాటం కొనసాగించడమే కాకుండా… ప్రతి అంశంపైనా ఆధారాలతో సహా నిజానిజాలను బయటపెడతానని పట్టాభి చెప్పారు. అయినా తాను ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం సాగిస్తే… తన నోరు మూయించేందుకు దాడులు చేయించే దుస్సాహసానికి జగన్ సర్కారు దిగుతోందని ఆరోపించారు. దాడులకు తాను భయపడేది లేదని, ఎంతమేర తన నోటిని అదుపు చేయాలని యత్నిస్తే.. అంతకు రెండింతలుగా బయటకు వస్తానని పట్టాభి చెప్పారు. దాడి సందర్బంగా తన ఇంటిని దాదాపుగా చుట్టుముట్టేసిన పోలీసులు.. ఆ తర్వాత నిందితులను పట్టుకోవడంలో ఎందుకు ఆసక్తి చూపలేదని ప్రశ్నించారు.
వైసీపీ ఎంపీలకు ఏడాది క్రితమే తెలుసు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అడుగులు వేస్తుండగా… అందులో తమ పాపమేమీ లేదన్నట్లుగా కలరింగ్ ఇస్తున్న వైసీపీ సర్కారు నిజ స్వరూపం ఏమిటన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా పట్టాభి బయటపెట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తున్న విషయం వైసీపీ ఎంపీలకు ఏడాది క్రితమే తెలిసిన వైనాన్ని కూడా పట్టాభి బయటపెట్టారు. ఏడాదిగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా మోదీ సర్కారు అడుగులు వేస్తున్నా… ఆ విషయం తెలిసి కూడా వైసీపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిన వైనాన్ని ఆధారాలతో సహా పట్టాభి బయటపెట్టారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) (విశాఖ ఉక్కు పరిశ్రమ)ను జపాన్ లేదా కొరియా కంపెనీలకు విక్రయించడం గానీ, ఆ కంపెనీలతో జాయింట్ వెంచర్ లు ఏర్పాటు చేయడం గానీ ఏమైనా చేస్తున్నారా? అంటూ గతేడాది అంటే… 2020 ఫిబ్రవరి 5న రాజ్యసభలో వైసీపీ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రబాకర్ రెడ్డి ఓ ప్రశ్నను సంధించారట. ఈ ప్రశ్నకు ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రదాన్… కొరియాకు చెందిన ఫోస్కో కంపెనీతో ఆర్ఐఎన్ఎల్‌ను జత కట్టేసి ఓ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసే దిశగా ఓ ఒప్పందం కుదిరిందని విస్పష్టంగా సమాధానం ఇచ్చారట. అది జరిగిన నెలకే అంటే… 2020 మార్చి 3న పరిశ్రమలకు సంబంధించి పార్లమెంటరీ కమిటీ ఆయా పరిశ్రమల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి పరిశ్రమలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఓ నివేదిక ఇచ్చిందట. ఈ కమిటీలో జగన్‌కు స్వయానా సోదరుడు అయిన ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి సభ్యుడిగా ఉన్న విషయాన్ని పట్టాభి బయటపెట్టారు. ఈ ఆరోపణలకు సంబంధించి పట్టాభి పూర్తి ఆధారాలను బయట పెట్టారు. అంటే… 2020 ఫిబ్రవరిలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతున్న విషయం వైసీపీ ఎంపీలకు తెలిసిపోయిందని, విశాఖ ఉక్కుకు చెందిన విలువైన భూములను కొట్టేసే యత్నంలో భాగంగానే జగన్ అండ్ కో తమకేమీ తెలియనట్లుగా వ్యవహరిస్తోందని… మొత్తంగా ఈ విషయంలో జగన్ సర్కారు పెద్ద కుట్రకే పాల్పడుతోందని పట్టాబి సంచలన వ్యాఖ్యలు చేశారు.