ఎంతగా తమ ప్రభుత్వ వైఫల్యాలను కవరప్ చేసుకుంటున్నప్పటికీ.. నిశిత విమర్శలతో విరుచుకుపడిపోతున్న తెలుగుదేశం పట్ల కొంచెం భయం. ప్రత్యేకించి.. ప్రజల్లో కొత్త ఆలోచనను రేకెత్తిస్తున్న వారి అసలైన సంక్షేమాన్ని ఉద్దేశించి పోరాడుతున్న నారా లోకేష్‌కు మంచి పేరు వచ్చేస్తుందని మహా భయం! వెరసి లక్షల మంది భావిపౌరుల ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కారు వెనుకాడడం లేదు. ఇంటర్మీడియట్ పరీక్షల రూపేణా వారిని మృత్యు కుహరంలోకి నిర్దాక్షిణ్యంగా పంపడానికే తెగిస్తోంది. ఒకవైపు సుప్రీం కోర్టు నోటీసులు పంపినా కూడా.. ఇప్పటికీ.. పరీక్షలు పెట్టి తీరాల్సిందేనంటూ చెలరేగుతున్న ఏపీ ప్రభుత్వం.. రాజకీయ పంతాలకు పోయి పిల్లల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నదా అనే అభిప్రాయం కలుగుతోంది.
18 రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు రద్దు
మన దేశంలోని 28 రాష్ట్రాల్లో 6 రాష్ట్రాలు కరోనా సెకండ్ వేవ్ చెలరేగడానికి ముందే ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించేశాయి. 18 రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలను పూర్తిగా రద్దు చేశారు. సిబిఎస్ఇ కూడా పరీక్షలను రద్దు చేసింది. కేవలం నాలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంకా పరీక్షలను రద్దు చేయకుండా.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారిని ఆందోళనకు గురిచేస్తున్నారు. ఒకవైపు పరీక్షల తోను, మరోవైపు కరోనా ఉధృతిలో ప్రాణభయంతోను వారు ఆందోళన చెందేలా చేస్తున్నారు. ఆ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. త్రిపుర, పంజాబ్, అస్సాం కూడా ఉన్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది.
సిబిఎస్ఇ 12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన తర్వాత.. ఏ రకంగా పిల్లలకు గ్రేడ్లు ఇవ్వాలనే విషయంలో ఒక విధానాన్ని రూపొందించారు. ఇది సుప్రీం ఎదుటకు వచ్చింది. దీన్ని సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ సందర్భంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో పరీక్షలు ఇంకా రద్దు చేయలేదనే విషయం తమ దృష్టికి రాగానే.. ఎందుకిలా చేస్తున్నారో తెలియజేయాలని ఆయా ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంకా మొండిగానే..
అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా మొండిగానే వ్యవహరిస్తోంది. త్వరలో సెకండియర్ పరీక్షలకు అవకాశం ఉందన్న విద్యాశాఖ మంత్రి.. తాజాగా సుప్రీం కోర్టు నోటీసుల గురించి అడిగితే.. అవి తమకు ఇంకా అందలేదని, అందిన తర్వాత చెప్తాం అంటున్నారు. పరీక్షల విషయంలో తమ ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట అభిప్రాయం ఉందని.. ఆ అభిప్రాయాన్ని సుప్రీంకు తెలియజేస్తామని అంటున్నారు.అంటే ఇప్పటికీ.. సుప్రీం నోటీసులు జారీచేసిన తర్వాత కూడా.. పరీక్షలు నిర్వహించే విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయడం లేదు. తమ నిర్ణయం విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నదనే బాధ వారిలో కలగడం లేదు.
ప్రభుత్వంలో లోకేష్ ఫోబియా?
దేశమంతా ఒక బాటలో వెళుతుండగా.. జగన్ మోహన్‌రెడ్డి సర్కారు అనుసరిస్తున్న పెడసరం ధోరణలు, పిల్లల ప్రాణాలతో చెలగాటం గురించి.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తొలి నుంచి గట్టిగా గళం వినిపిస్తున్నారు. పరీక్షల విషయంలో రద్దు చేయడం మంచిదని చాలా ముందుగానే ప్రభుత్వానికి సూచించారు. ఎక్కడ లోకేష్‌కు పేరొచ్చేస్తుందో అని మొండిపట్టు పట్టిన సర్కారు.. చివరి దాకా నాన్చి.. విద్యార్థుల్ని ఆందోళనలోకి నెట్టి.. చివరికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చినా కూడా అదే మొండితనం కొనసాగిస్తోంది. ఇప్పటికైనా పంతాలు మాని, పిల్లల ప్రాణాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది.
Must Read ;- ధాన్యం కొనుగోలు బకాయిలు వెంటనే చెల్లించాలి : సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ











