జీవితంలో ఎవరైనా సరే ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని .. పట్టుదలతో పరుగును ప్రారంభిస్తే, విజయశిఖరాలను చేరుకోవడం అసాధ్యమేం కాదు. ఆత్మస్థైర్యం వుంటే అవరోధాలను అధిగమించడం కష్టమేం కాదు. ఈ విషయాన్ని ఆచరించి చూపిన కథానాయికగా నయనతార కనిపిస్తుంది.
విమర్శలను మౌనంగా వింటూ .. విజయాలతోనే వాటికి సమాధానం చెప్పడం తెలిసిన తెలివైన కథానాయిక ఆమె. తన వ్యక్తిగత విషయాలనుగానీ .. వృత్తిపరమైన విశేషాలను గాని ఎక్కడా ప్రస్తావించకుండా, తన పనిని తాను సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్లడం నయనతారకి అలవాటు. సినిమాను ఒక తపస్సులా .. పాత్రను ఒక యజ్ఞంలా భావించి న్యాయం చేయడం ఆమె ప్రత్యేకత .. అదే ఆమె విజయ రహస్యం కూడా. అలాంటి నయనతార పుట్టినరోజు ఈ రోజు.
17 సంవత్సరాల క్రితం నయనతార నటిగా తన ప్రయాణాన్ని ఆరంభించింది. తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో అవకాశాలను అందుకుంటూ అడుగులు వేసింది. అందం .. అంతకు మించిన అభినయం .. నయనతార సొంతం అనే విషయాన్ని ఇటు ఇండస్ట్రీ .. అటు ప్రేక్షకులు గ్రహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దాంతో సహజంగానే ఈ మూడు భాషల్లోను ఆమె కుదురుకుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఆమెకి అగ్రహీరోల సరసన అవకాశం లభించడం, ఆ వెంటనే విజయాలు క్యూ కట్టడంతో స్టార్ హీరోయిన్ గా నయనతార క్రేజ్ తారాజువ్వలా దూసుకుపోయింది. ఆమె ప్రయాణం నవరస నట ప్రవాహంలా సాగింది.
Must Read ;- పెళ్లి విషయంలో నయనతార కండిషన్ ఏంటి?
కెరియర్ పరంగా ఒక దశవరకు మాత్రమే నయనతార గ్లామర్ పాత్రలను చేస్తూ వచ్చింది. ఆ తరువాత గ్లామర్ పాళ్లు తగ్గిస్తూ .. నటన పాళ్లు ఎక్కువుండే పాత్రల పట్ల ఆసక్తిని చూపుతూ వెళ్లింది. ఒక పక్కన స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తూనే, మరో వైపున వర్థమాన హీరోల జోడీ కట్టింది. అలా చేయడం వలన తన ఇమేజ్ తగ్గుతుందనే భయమే ఎరుగని సాహసం ఆమె సొంతం. ఇక వర్థమాన హీరోలతో .. సీనియర్ హీరోలతో కలిసి ఆడిపాడుతూనే, నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలను కూడా వరుసగా చేస్తూ వెళ్లడం ఆమె ఆత్మ స్థైర్యానికి ఆనవాలు.
స్టార్ హీరోలతో నయనతార చేసిన సినిమాలకి ఎంత క్రేజ్ వచ్చిందో, ఆమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కూడా అంతే క్రేజ్ రావడం విశేషం. స్టార్ హీరోల సినిమాలతో సమానమైన వసూళ్లను ఆమె సోలోగా చేసిన సినిమాలు సాధించడం మరో విశేషం. నయనతార పారితోషికం పెంచినా నిర్మాతలు వెనకడుగు వేయలేదు. ఆమె సినిమాలు కొన్ని పరాజయం పాలైనా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. అందుకు కారణం నయనతార ఎంచుకునే విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు .. ఆ పాత్రల్లో ఆమె పసిడి ఉంగరంలో పగడంలా ఇమిడిపోవడం.
నయనతార కెరియర్ ను ఒకసారి పరిశీలిస్తే, వైవిధ్యభరితమైన కథలకు ఆమె ఎంత ప్రాధాన్యతను ఇచ్చిందో .. కొత్తగా కనిపించడానికి ఎంతగా తాపత్రయ పడిందో అర్థమవుతుంది. పాత్రల పరంగా ఆమె ఎలాంటి ప్రయోగాలు .. సాహసాలు చేసిందో తెలుస్తుంది. హారర్ .. సస్పెన్స్ థ్రిల్లర్లను ఒంటిచేత్తో విజయాల వైపు పరుగులు తీయించిన తీరు స్పష్టమవుతుంది. కథ నచ్చిందో లేదో చెప్పేవిషయంలో నాన్చడమనేది నయనతారకి తెలియదు. వెయిటింగుతో ఎదుటివారి సమయాన్ని వృథా చేయడం ఆమెకి అలవాటు లేదు. వేగంగా తీసుకునే నిర్ణయాలు .. తెగింపుతో చేసే పాత్రలే ఆమెను ఈ స్థాయిలో ఇంత బలంగా నిలబెట్టాయని సన్నిహితులు చెబుతారు.
నయనతార తన సినిమాలకి సంబంధించిన లొకేషన్లో తప్ప, సినిమాలకి సంబంధించిన ఏ వేదికలపై కనిపించదు. తను చేసిన సినిమాల ప్రమోషన్స్ కి కూడా ఆమె రాదు. అలా అని చెప్పేసి ఆమెకి అహంభావం అనుకుంటే పొరపాటే. కథానాయికగా నయనతార చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసింది. ఇప్పటికీ దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు .. స్టార్ హీరోలు ఆమె డేట్స్ కోసం నిరీక్షిస్తున్నారు. అందుకు కారణం నయనతార క్రేజ్ .. ఆమె సాధించిన సక్సెస్ లు మాత్రమే కాదు, వృత్తి పట్ల ఆమెకి గల అంకితభావం కూడా.
తెలుగు .. తమిళ భాషల్లో కొత్తగా ఎంతోమంది కథానాయికలు వస్తున్నారు .. వెళుతున్నారు. కానీ నయనతార స్థానం పదిలంగానే వుంది .. ఆమె ప్రభావం కొనసాగుతూనే వుంది .. ఆమె వైభవం వెలుగుతూనే వుంది. ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న నయనతారకు ‘ది లియో న్యూస్‘ టీమ్ శుభాకాంక్షలు అందజేస్తోంది. ఆమె మరెన్నో వినూత్నమైన సినిమాలను చేయాలనీ .. విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తోంది.
Also Read ;- నయన్ ప్రేమకు పెళ్లితోనే శుభం కార్డా?