త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన ప్రకటనపై జనసైనికులు విరుచుకుపడుతున్నారు. తిరుపతి నుంచి బీజేపీ అభ్యర్థి పోటీచేస్తారని వీర్రాజు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే ప్రస్తుతం జనసైనికుల ఆగ్రహానికి కారణమవుతోంది. అసలు తిరుపతిలో మీకున్న బలమెంత? పోటీ చేస్తే.. గెలుపు మాట పక్కన పెడితే.. ఎన్ని ఓట్లు తెచ్చుకోగలరు? అంటూ ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీకి నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని, ఇలాంటి పరిస్థతుల్లో అలా ఏకపక్ష ప్రకటన ఎలా చేస్తారని మండిపడుతున్నారు.
కమిటీ నిర్ణయిస్తుంది
జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. పవన్ అప్రమత్తమయ్యారు. తిరుపతిలో ఎవరి బలం ఎంతో తేల్చేందుకు ఓ కమిటీని వేసినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ.. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి.. తిరుపతిలో జనసేన పోటీ చేస్తే బాగుంటుందని తేల్చినట్లు తెలుస్తోంది. తిరుపతిలో ఓ బలమైన సామాజిక వర్గం జనసేనకు మద్దతిచ్చే అవకాశం ఉందని, వారు బీజేపీకి మద్దతిచ్చే పరిస్థితి లేదని ఆ కమిటీ నివేదికలో పేర్కొంది. చిరంజీవి కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయాన్ని కమిటీ ప్రస్తావించింది. ప్రత్యేక హోదా హమీని ఇక్కడే ఇచ్చి.. తర్వాత మాట తప్పడాన్ని జనం ఇంకా మరచిపోలేదని జనసైనికులు అంటున్నారు. అయినా.. పవన్, జేపీ నడ్డా కలిసి చర్చించి.. ఉమ్మడి అభ్యర్థిని ప్రకటిస్తారని, ఈ లోగా సోము వీర్రాజుకు తొందరెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా తిరుపతి నుంచి జనసేన అభ్యర్థి పోటీలో ఉంటారని వారు ఘంటాపథంగా చెబుతున్నారు.
సోముకు చిక్కులే
జరుగుతున్న పరిణామాలపై సొంత పార్టీలోనే వీర్రాజుపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. తొలి నుంచీ ఆయన వ్యవహార శైలి ఏకపక్షంగానే ఉంటోందని, ఒక వర్గాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని సీనియర్ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు ఉన్న వ్యక్తినే అధ్యక్షుడిని చేయాలన్న ఒకే ఒక్క కారణంతో వీర్రాజుకు అవకాశం దక్కిందని, ఆయన మాత్రం అధ్యక్షుడైన తొలినాళ్లలోనే కన్నా వర్గీయుడైన ఓవీ రమణపై ఏకపక్షంగా బహిష్కరణ వేటు వేశారని మండిపడుతున్నారు. ఇలాగైతే.. భవిష్యత్తులో పార్టీ పుంజుకోవడం కష్టమని వ్యాఖ్యానిస్తున్నారు.
Must Read ;- తిరుపతిలో టీడీపీ వూహకర్త!