తెలంగాణలో త్వరలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై నిర్ణయానికి సీఎం కేసీఆర్‌కు నివేదిక సమర్పించనుంది. ఆర్ధిక వనరుల పెంపునకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సమావేశమై భూముల మార్కెట్ విలువ పెంచాలని నిర్ణయించింది. మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు కె.టి.రామారావు, ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే మార్గాలపై సమీక్షించారు. 2020 జనవరిలో తెలంగాణలో భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రతిపాదనలతో పాటు గత ఆర్థిక సంవత్సరంలో జరిగిన రిజిస్ట్రేషన్ల వివరాల ఆదారంగా చర్చించారు. ఎనిమిదేళ్ల కిత్రం నిర్ణయించిన భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలే ఇప్పటికీ అమల్లో ఉండటం, బహిరంగ మార్కెట్‌లో భూముల విలువ భారీగా పెరగడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించడానికి ప్రతిపాదించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
పెరిగిన భూముల విలువ
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువలు భారీగా పెరిగాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఒక్కసారి కూడా పెంచలేదని, పక్కనే ఉన్న ఏపీలో ఎనిమిదేళ్లలో ఏడు సార్లు పెంచారని వివరించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7.5 శాతం ఉండగా తమిళనాడులో కూడా 7.5 శాతం, మహారాష్ట్రలో 7 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో భూముల విలువ భారీగా పెరిగిందని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో భూములు, ఆస్తులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువ భారీగా పెరిగిందని పేర్కొన్నారు. ఏడేళ్లలో హైదరాబాద్ చుట్టుపక్కల, హెచ్‌ఎండీఏ పరిధిలో భూములు, ఆస్తుల విలువ భారీగా పెరిగిందని తెలిపారు.
హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రభుత్వ విలువ కంటే ఎక్కువకే రిజిస్ట్రేషన్లు
కొన్నిచోట్ల ప్రభుత్వం నిర్ణయించిన విలువ కంటే ఎక్కువతో రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వెల్లడించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని రిజిస్ట్రేషన్లలో 51 శాతం ప్రభుత్వ నిర్ధారిత విలువ కంటే ఎక్కువ మొత్తానికి జరిగినట్లు తెలిపారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు రావడం, నగరాభివృద్ధి, విస్తరణ తదితర అంశాల నేపథ్యంలో హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రభుత్వం నిర్ధారించిన మార్కెట్ విలువ కంటే వాస్తవ కొనుగోళ్ల మేరకు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విలువ, మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా ఉండటంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భూముల విలువల సవరణతో వాటికి పరిష్కారం లభిస్తుందన్నారు. కొంతమంది అధిక మొత్తంలో ఆస్తుల క్రయ విక్రయాలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకే రిజిస్ట్రేషన్లు చేసుకోవడం, మరికొంత మంది బహిరంగ మార్కెట్ విలువ మేరకు చేసుకుంటుండటంతో సమాంతర అర్థిక వ్యవస్థ నడుస్తోందని అధికారులు కమిటీ దృష్టికి తెచ్చారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీలు సవరింపు.. రూ.12500 కోట్ల ఆదాయం అంచనా
తెలంగాణలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు 6 శాతంగా ఉన్నాయి. ఇందులో స్టాంపు డ్యూటీ 4 శాతం కాగా ట్రాన్సఫర్ డ్యూటీ 1.5 శాతం, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5 శాతంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలను 7 లేదా 7.5 శాతానికి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.12500 కోట్ల ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.6 వేల కోట్ల ఆదాయం వచ్చింది.
పెరుగుదల ఏమేరకంటే..?
రాష్ట్రంలో భూముల విలువతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కీలకంగా ఉన్న అపార్టుమెంట్‌ల విలువను సవరించనున్నారు. బహిరంగ మార్కెట్‌లో విలువతో పాటు వాస్తవంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్న విలువను ప్రాతిపదికగా తీసుకుని కొత్త విలువను నిర్ణయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే మూడు నుంచి ఐదురెట్ల వరకూ భూముల విలువ పెంచనున్నట్లు తెలుస్తోంది.
Must Read ;- జగన్ బాటలోనే కేసీఆర్!.. కోర్టులంటే లెక్కే లేదు!