ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియామకాలకు సంబంధించి తనదైన శైలి నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు. గతంలో తనకు సాయపడిన వారితో పాటు తన కుటుంబం ఆధ్వర్యంలోని పత్రిక సాక్షిలో పనిచేసిన కీలక వ్యక్తులకు జగన్ సలహాదారులంటూ కొత్తగా పోస్టులు సృష్టించి మరీ ఇచ్చారు. ఇక ఇతరత్రా నియామకాల్లోనూ తన అన్న ముద్రను కొనసాగిస్తున్న జగన్… బుధవారం మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కుమారుడు, ప్రముఖ న్యాయవాది జాస్తి నాగభూషణ్‌ను నియమించుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రే ఈ నియామకానికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్ సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత వైసీపీకి చెందిన ఓ నేతతో కలిసి జస్టిస్ జాస్తి చలమేశ్వర్.. జగన్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీని మర్యాదపూర్వక భేటీగానే చెప్పుకున్నా… టీడీపీ శిబిరంపై తాను చేసే పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచే దిశగా సలహాలు, సూచనలు ఇవ్వాలని జస్టిస్ జాస్తిని జగన్ కోరినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఇటీవలే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై సీజేకు ఫిర్యాదు చేసేందుకు జగన్ ఢిల్లీకి వెళ్లిన సందర్బంగా ఆయన వెంట జస్టిస్ జాస్తి కుమారుడు, హైదరాబాద్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ సాగిస్తున్న జాస్తి నాగభూషణ్ కనిపించారు. జగన్ ఢిల్లీ పర్యటన మొత్తంలో జాస్తి నాగభూషణ్ ఆయన వెన్నంటే నిలిచారు. సీకేకు జగన్ రాసిన లేఖ డ్రాఫ్ట్‌ను జాస్తి నాగభూషణే సిద్ధం చేశారన్న వాదనలూ వినిపించాయి.
ఈ క్రమంలో ఇప్పుడు జాస్తి నాగభూషణ్‌ను ఏకంగా ఏపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గా నియమించేందుకు జగన్ నిర్ణయం తీసుకున్న వైనం చూస్తుంటే… నాటి ఢిల్లీ పర్యటనలో జగన్ ఆయన సహకారం తీసుకున్నారన్న వాదనను ఒప్పేసుకోవడమేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ సర్కారుకు అదనపు అడ్వొకేట్ జనరల్‌గా జాస్తి నాగభూషణ్ నియమితులు కానున్న వార్త ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.
Must Read;- తమ్మినేని కోరిక నెరవేరేనా..?