ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు చిక్కుముడిని విప్పే దిశగా కొనసాగుతున్న సీబీఐ విచారణ రోజుకో ట్విస్ట్ తీసుకుంటోంది. మొన్నటిదాకా వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలగిన వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను లక్ష్యంగా సాగిన సీబీఐ దర్యాప్తు.. ఇప్పుడు జగన్ మరో చిన్నాన్న కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కేంద్రంగా దర్యాప్తు మొదలెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే వైఎస్ అవినాశ్ రెడ్డి వద్ద పీఏలుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను విచారించగా.. తాజాగా అవినాశ్ రెడ్డితో సన్నిహితంగా మెలగుతున్న ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు. అంతేకాకుండా ఉదయ్ తండ్రి, జగన్ మామ ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్న ప్రకాశ్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు విచారణకు పిలిచారు.
అవినాశ్ టార్గెట్ ఎలా అయ్యారు?
కడప ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డి.. వైసీపీ ప్రస్థానం మొదలయ్యేదాకా ఎవరికీ తెలియదనే చెప్పాలి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి వరుసకు సోదరుడైన వైఎస్ భాస్కర రెడ్డి కుమారుడైన అవినాశ్ రెడ్డి.. తెర ముందుకు రాక ముందు నుంచే జగన్ తో సన్నిహితంగా మెలగడంతో పాటుగా.. పులవెందుల, కడప జిల్లా వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించేవారని చెబుతారు. ఈ క్రమంలో వైఎస్సార్ మరణం, జగన్ వేరు కుంపటి పెట్టుకున్న తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాశ్.. ఎలాగూ జగన్ పులివెందుల అసెంబ్లీకి మారిపోతారని, తాను కడప ఎంపీ సీటు నుంచి పోటీ చేయాలని తలచారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత వైఎస్ ఫ్యామిలీకి దూరంగా జరిగిన వివేకానందరెడ్డి.. జగన్ అరెస్ట్ సమయంలో తిరిగి ఆ ఫ్యామిలీ దరి చేరారు. ఈ క్రమంలోనే ఎక్కడ తన ఎంపీ సీటుకు పోటీ వస్తుందోనన్న భయంతో అవినాశే.. వివేకాను అడ్డు తొలగించుకునే యత్నం చేసి ఉంటారన్నది జనంలోని అనుమానంగా చెప్పాలి. అంతేకాకుండా వివేకా మర్డర్ తర్వాత.. అక్కడికి చేరుకున్న తొలి వ్యక్తిగానే కాకుండా.. వివేకా మర్డర్ ను గుండెపోటు మరణంగా చిత్రీకరించే యత్నం చేసిన వ్యక్తిగానూ అవినాశ్ పై అనుమానాలు వెల్లువెత్తాయి.
ఉదయ్ నేపథ్యమిదే
ఇక అవినాశ్ సన్నిహితుడిగా పేరు పడిన ఉదయ్ కుమార్ రెడ్డి.. ప్రస్తుతం తుమ్మలపల్లి ఉరేనియం ఫ్యాక్టరీలో ఉద్యోగిగా ఉన్నాడు. ఆ సంస్థలో ఉద్యోగిగా మారక ముందు నుంచి కూడా అతడు అవినాశ్ రెడ్డితో సన్నిహితంగా మెలిగేవారని, ఈ క్రమంలోనే అతడికి తుమ్మలపల్లి యురేనియం ఫ్యాక్టరీలో ఉద్యోగం లభించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఉదయ్ తండ్రి ప్రకాశ్ రెడ్డి.. జగన్ మామ, జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి పులివెందులలో నిర్మించిన ఆసుపత్రిలో కాంపౌండర్ గా పనిచేస్తున్నారట. ఇటీవలే ఈసీ గంగిరెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఉదయ్ ఫ్యామిలీ మొత్తం ఆది నుంచి వైఎస్ ఫ్యామిలీతో సన్నిహితంగానే మెలగుతోందని చెప్పాలి. తాజాగా శనివారం నాడు ఉదయ్ తో పాటు అతడి తండ్రి ప్రకాశ్ రెడ్డిని విచారణకు పిలిచిన సీబీఐ అధికారులు.. సునీల్ సమక్షంలోనే వారిని ప్రశ్నిస్తున్నారట. మరి ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయోనన్న ఆసక్తి నెలకొంది.
Must Read ;- వివేకా కేసులో అన్ని వేళ్లూ జగన్ వైపే!











