అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైంది. ఇందులో ఐదు ఆసక్తికర అంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇది స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన సినిమా. 1980వ దశకంలో జరిగిన విమానం హైజాక్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. విమానంలో బందీ అయినవారిని రక్షించి తీసుకువచ్చే రా ఏజెంట్ పాత్రను అక్షయ్ పోషించారు. ఇక ఈ సినిమాలో ఐదు ఆసక్తికర అంశాలేంటో తెలుసుకుందాం.
1. మాజీ మిస్ యూనివర్శ్, బాలీవుడ్ నటి లారా దత్తా ఇందులో నటించిందంటే ఎవరూ నమ్మలేరు. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ పాత్రను ఆమె పోషించింది. మేకప్ ఆర్టిస్ట్ విక్రమ్ గైక్వాడ్ లారా స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చేశాడు. ఇందిరాగాంధీని చూసినట్టే ఉంటుందిగాని ఆమె లారాదత్తా అని ఎవరూ పోల్చుకోలేరు. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడే ఇది చర్చనీయాంశమైంది.
ఇందిరాగాంధీతో తనకు ఉన్న అనుబంధాన్ని కూడా ఈ మాజీ విశ్వసుందరి వెల్లడించింది. లారా తండ్రి రిటైర్డ్ వింగ్ కమాండర్ ఎల్.కె. దత్తా తన అధికారిక పర్యటనల్లో అనేకసార్లు ఇందిరతో ఉన్నారు. అప్పుడు తండ్రి ఇందిర గురించి చెప్పిన మాటలు తను ఈ పోత్ర పోషించడానికి ఎంతో ఉపకరించాయని ఆమె చెబుతోంది. అక్షయ్ కుమార్ తో లారాదత్తాకి ఇది 9వ సినిమా.
2. కోవిడ్ మొదటి దశ తర్వాత సెట్స్ పైకి వెళ్లిన సినిమా ఇది. ఓ పక్క కరోనా కేసులు ఉన్నా షూటింగ్ కొనసాగించారు.
3. ఈ సినిమా షూటింగ్ 20 ఆగస్టు 2020న ప్రారంభమైంది. కచ్చితంగా ఏడాది తర్వాత అంటే 19 ఆగస్టు 2021న ఈ సినిమా విడుదలవుతోంది. ఒక్క రోజు తేడాతో సినిమా విడుదల కానుండటం కాకతాళీయమే అనుకోవాలి.
4. ఇప్పటిదాకా యశ్ రాజ్ ఫిలిమ్స్ కే పరిమితమైన హీరోయిన్ గా వాణి కపూర్ కు హిందీలో బయటి బ్యానర్ లో ఇది మొదటి సినిమా. ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’తో ఆమె బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసింది. తమిళ చిత్రం ఆహా కళ్యాణం, యుద్ధం, బేపిక్రే లాంటి చిత్రాలన్నీ కూడా యశ్ రాజ్ పిలిమ్స్ తోనే ముడిపడి ఉన్నాయి. ఇందులో అక్షయ్ భార్యగా వాణి కపూర్ నటించింది.
5. ‘బెల్ బాటమ్’ పేరుతో ఓ కన్నడ చిత్రం కూడా ఉంది. ఇది 2019లో విడుదలైన కామెడీ చిత్రం. పేరులోనే పోలిక తప్ప ఆ సినిమా కథ వేరు, ఈ సినిమా కథ వేరు. ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. కరోనా పరిస్థితులు ఉన్నా చిత్ర యూనిట్ రిస్క్ చేసి సినిమాను పూర్తి చేయడం విశేషం. ఇలాంటి ఎన్నో విశేషాలున్న ఈ సినిమా విడుదల కూడా రిస్క్ తోనే ఉంది. కరోనా మూడో వేవ్ హెచ్చరికలు చిత్ర యూనిట్ ను వణికిస్తున్నాయి.
Must Read ;- అక్షయ్ ‘బెల్ బాటమ్’ కు షాకింగ్ న్యూస్











