అదృష్టం కలిసొచ్చినవారిని ఆపడం కష్టమే .. అందుకోవడం కూడా కష్టమే. అలాంటి అదృష్టం ఇప్పుడు యష్ చుట్టూనే తిరుగుతోంది .. ఆయన వెనుకనేబడి తరుముతోంది. ‘కేజీఎఫ్‘ విడుదలకు ముందు యష్ పేరు కొద్దిమందికే తెలుసు .. ఆ సినిమా విడుదలైన తరువాత ఆయన పేరు కొద్దిమందికే తెలిసి ఉండదు. అంతగా ఆయన పాపులారిటీ పెరిగిపోతోంది .. ఆయన స్టార్ డమ్ వెలిగిపోతోంది. ‘కేజీఎఫ్’ సాధించిన సంచలనాన్ని గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్న ప్రేక్షకులు, త్వరలో రానున్న ‘కేజీఎఫ్ 2‘ గురించి కూడా చర్చించుకుంటున్నారు.
అలాంటి యష్ .. శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. దర్శకుడిగా శంకర్ కు గల క్రేజ్ ను గురించి కొత్తగా చెప్పుకోవలసిన పనిలేదు. తమిళ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయన ఖాతాలో కనిపిస్తుంది. భారీతనమంటే ఇదీ .. భారీ వసూళ్లంటే ఇవీ అని నిరూపించిన దర్శకుడు ఆయన. శంకర్ కథ చెప్పకుండానే డేట్లు ఇచ్చేసే సీనియర్ స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు. అంతగా ఆయన వాళ్ల నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ఇండియన్ 2’ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఇటు కథాకథనాలపై .. అటు టెక్నాలజీపై మంచి అవగాహన కలిగిన శంకర్ .. యష్ హీరోగా ఒక సినిమా చేయనున్నాడనే టాక్ జోరుగా షికారు చేస్తోంది. ఇది ఒక చారిత్రక నేపథ్యంతో కూడిన కథ అనీ .. యుద్ధం ప్రధానంగా సాగుతుందని చెబుతున్నారు. ఆల్రెడీ ఈ కథను యష్ కి శంకర్ వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. కేవలం షూటింగును పూర్తిచేసుకోవడానికే నాలుగేళ్లు పడుతుందని చెబుతున్నారు. 2026 చివరిలోగానీ .. 2027 ప్రథమార్థంలో గాని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావొచ్చునని అంటున్నారు.వినడానికీ .. ఊహించుకోవడానికైతే బాగానే ఉంది. ఇక ఇందులో వాస్తవమెంతన్నదే తేలాలి.
Must Read ;- ‘సలార్, కేజీఎఫ్’ రెండింటికీ పోలిక ఉందా.?