రైతులకు సంఘీభావం తెలిపిన కర్నాటక రైతులు
‘న్యాయంస్థానం టూ దేవస్థానం’ పేరుతో రాజధాని అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు అన్ని వర్గాలతో పాటు, ప్రాంతాలు, రాష్ట్రాలకు అతీతంగా ముందుకొచ్చి మద్దతునిస్తున్నారు. రాజధాని అమరావతినే కొనసాగించాలని గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి నవంబర్ 1 న ప్రారంభమైన రైత మహా పాదయాత్ర గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మీదిగా చిత్తూరుకు చేరుకుంది. అక్కడికి చేరుకున్న రైతులకు చిత్తూరు జిల్లా వాసులు అఖండ స్వాగతంతో జిల్లాలోకి ఆహ్వానం పలికారు. ఇప్పటికే ఒక్క వైసీపీ మినాహాయించి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధానికి, రైతులు చేస్తున్న ఉద్యామనానికి, పాదయాత్రకు మద్దతు తెలిపి, సంఘీభావాన్ని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు వచ్చి పాదయాత్రలో పాల్గొని రాజధాని రైతులకు సంఘీభావం తెలిపారు. అలానే హర్యాన రాష్ట్ర రైతులు కూడా పాదయాత్రకు మద్దతునిచ్చి, సంఘీభావం ప్రకటించారు. అంతేకాక తిరుపతి లో నిర్వహించనున్న సభకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. అలానే కర్నాటక నుంచి కూడా రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి.. మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపారు. రాజధానికి భూములచ్చిన రైతులు వ్యథ చూస్తుంటే గుండె చెరువవుతోందని అవేదన వ్యక్తం చేశారు. సాటి రైతు కష్టాన్ని చూసే పాదయాత్రకు మద్దతు ప్రకటించామన్నారు.
భారీ విరాళం అందజేసిన కర్నాటక రైతులు
రైతులు మహాపాదయాత్రకు సంఘీభావం ప్రకటించి కర్నాటక రైతులు రూ. 60 లక్షల విరాళాన్ని అందజేశారు. సాటి రైతులుగా రైతు కష్టాన్ని గుర్తించామని, రైతుల పోరాటం గెలవాలన్నదే తమ ఆకాంక్ష అని వారు పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు చేసిన చివరికి గెలిచేది రైతులేనని ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రైతు పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం శ్రీకాళహస్తికి చేరుకున్న పాదయాత్ర శుక్రవారం 40 రోజు పాదయాత్రకు విరామం ప్రకటించారు. 16వ తేదీతో రైతు పాదయాత్ర తిరుమలలో ముగుస్తోంది. తిరుమలలో స్వామివారి దర్శనమైన అనంతరం మరుసటిరోజు 17న తిరుపతి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఢిల్లీ, హర్యానా రైతులు, పలు ప్రజాసంఘాలు, దళిత సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఇప్పటికే ఆయా ప్రతినిధులు ప్రకటించారు.
Must Read ;- అమరావతి రైతులకు పులివెందుల రైతుల సంఘీభావం!











