కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో వైసీపీ నేతల అక్రమ మట్టి తవ్వకాల వ్వవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. కొండపల్లి రిజర్వు ఫారెస్టులో మైలవరం ఎమ్మెల్యే బావమరిది భారీ ఎత్తున అక్రమంగా మట్టి తరిలించడంతో అటవీ శాఖ అధికారులు ఆగష్టు 8వ తేదీన 7 జేసీబీలు, 8 టిప్పర్లు సీజ్ చేశారు. అభయారణ్యంలో అక్రమంగా మట్టి తవ్వకాలు చేయడంతో జిల్లా ఉన్నతాధికారులు కదిలారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగినా ఎమ్మెల్యే బావమరిదికి చెందిన రూ.3 కోట్ల విలువైన వాహనాలను సీజ్ చేశారు. దీంతో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రంగంలోకి దిగారు. జిల్లా అటవీ అధికారి మంగమ్మను బదిలీ చేయించారు. అయినా పెనాల్టీ కట్టించుకుని వాహనాలు విడుదల చేయకపోవడంతో వైసీపీ నేతలు కొత్త ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది.
అది రిజర్వు ఫారెస్టు కాదట…
కొండపల్లి రిజర్వు ఫారెస్టులో రూ.200 కోట్ల విలువైన మట్టిని అక్రమార్కులు తరలించివేశారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో మీడియాలోనూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో అటవీశాఖ ఉన్నత అధికారులు వైసీపీ నేతల వాహనాలను సీజ్ చేయడంతోపాటు, విచారణకు ఆదేశించారు. రెవెన్యూ, గనులశాఖ, అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మట్టి తవ్వకాలు జరిపిన ప్రాంతం అభయారణ్యం కిందకు వస్తుందని తేల్చారు. దీంతో మైలవరం ఎమ్మెల్యే బావమరిది కేసు మరింత జటిలం అయింది. అయితే తాజాగా అసలు అది అటవీ భూమి కాదని పోరంబోకు భూమి అని చెప్పాలంటూ అటవీశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఒకసారి విచారణ పూర్తి చేసిన అధికారులు ఆ భూమిని రిజర్వు ఫారెస్టు అని తేల్చారు.
వైసీపీ నేతలు భారీ ఎత్తున లాబీయింగ్ చేసి దాన్ని పోరంబోకుగా చూపించే ప్రయత్నంలో అటవీ అధికారులు బలైపోతున్నారు. వారి ఒత్తిడి మేరకు అభయారణ్యాన్ని పోరంబోకుగా చూపితే ఇక అక్రమార్కులు కబ్జాలకు దిగుతారని, తరవాత తమ ఉద్యోగాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని అటవీ అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.
Must Read ;- వైసీపీ వర్గాల కొట్లాట : ఆస్పత్రిలో ఒకరి దుర్మరణం
వింటారా.. లేదంటే బదిలీ తప్పదు..
మాట వినని అటవీ అధికారులను అరకులోయకు బదిలీ చేయిస్తామంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారు. బెదిరింపులకు భయపడి రిజర్వు ఫారెస్టు భూమిని పోరంబోకుగా చూపితే ఒక సమస్య, లేదంటే మారుమూల ప్రాంతాలకు బదిలీ తప్పదనే ఆందోళనతో అటవీ అధికారులు సతమతం అవుతున్నారని తెలుస్తోంది. ఇటు కొండపల్లి వీరప్పన్ వారి వాహనాలను విడిపించుకుని మరలా ప్రజాసేవ ప్రారంభించాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.. ఇప్పటికే తవ్వకాలతో చారిత్రాత్మక ప్రాంతమైన కొండపల్లి ఖిల్లాకు కూడా ప్రమాదం ముంచుకొస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
మట్టికి యమ డిమాండ్
విజయవాడ చుట్టుపక్కల మట్టి, ఇసుకకు మంచి డిమాండ్ ఉంది. కొత్తగా ఇళ్లు నిర్మించే వారితోపాటు, వెంచర్లు వేసిన వారు లెవలింగ్ చేసుకునేందుకు పెద్ద ఎత్తున మట్టితో నింపుతుంటారు. విజయవాడలో లారీ మట్టి రూ.8వేల ధర పలుకుతోంది. అయినా ఎక్కడా దొరకడం లేదు. దీంతో అక్రమార్కులు కొండలు, గుట్టలు, శ్మశానాలు, పోలవరం కాలువ మట్టిపై పడ్డారు. రాత్రి అయిందంటే చాలు బెంజి టిప్పర్ల హడావుడితో విజయవాడ రూరల్ గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. అక్రమార్కులు వైసీపీ నేతలే కావడంతో అధికారులు మొద్దునిద్ర నటిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
Also Read ;- ఎమ్మెల్యేపై కరపత్రాలు : దర్శి వైసీపీ నేతల కోల్డ్ వార్