గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, సీనియర్ నటి లక్ష్మి జంటగా నటించిన చిత్రం ‘మిథునం’. తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఆనంద్ మువిదారావు నిర్మాతగా వ్యవహరించారు. 2012లో రిలీజ్ అయిన ‘మిథునం’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా తనికెళ్ళ భరణిలో ఉన్న గొప్ప దర్శకుడిని వెలికితీసిన చిత్రం ‘మిథునం’.
ఇందులో బాలసుబ్రమణ్యం, లక్ష్మి వృద్ధ దంపతులు. వారి పిల్లలందరూ విదేశాల్లో స్థిరపడతారు. శేష జీవితాన్ని దుఃఖంతో కాకుండా చాలా ఆనందంగా, రమణీయంగా, చిలిపిగా గడుపుతుంటారు వారిద్దరు. తమ చివరి క్షణాలను వారు ఎంత మధురానుభూతిగా మిగిల్చారన్నదే ఈ సినిమా మూల కథ. శ్రీరమణ రాసిన కథ ఆధారంగా తెరకెక్కిన ‘మిథునం’ సినిమా ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది. అలాంటి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే హిందీ హక్కులను ఒక బడా నిర్మాణ సంస్థ సొంతం చేసుకుందని సమాచారం.
ఈ రీమేక్ లో బాలసుబ్రమణ్యం పాత్రలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ జీవం పోయనున్నారని బాలీవుడ్ టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన తన పాత్రపై ఒక అభిప్రాయానికి వచ్చిన అమితాబ్ తనను తాను మార్చుకునే పనిలో పడ్డారని సమాచారం. ఇక సీనియర్ నటి లక్ష్మి పాత్రలో బాలీవుడ్ అందాల తార రేఖ నటించనున్నారని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం ఈ పాత్రలో అమితాబ్ భార్య జయ బచ్చన్ నటిస్తారని అంటున్నారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నదని టాక్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, బాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సినిమా కథలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ‘మిథునం’ రీమేక్ కోసం పూర్తి విశేషాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
Must Read ;- లూడో సినిమా విజయంతో ఫుల్ జోష్ లో ఛోటా బచ్చన్