టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్న సినిమా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం సెట్స్ మీదున్న ఈ సినిమాకి నిర్మాతలు రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి. అన్యాక్రాంతమవుతోన్న దేవాలయ భూములపై, దేవాలయాల పాలక వ్యవస్థలోని దుష్ట రాజకీయాలపై కొరటాల సంధిస్తోన్న సామాజిక అస్త్రం ఈ సినిమా. లాక్ డౌన్ కు ముందు కొంత భాగం షూట్ చేసుకున్న ఈ సినిమా దాదాపు ఎనిమిది నెలల బ్రేక్ తర్వాత తిరిగి సెట్స్ మీదకు వెళ్ళింది.
అయితే ఇటీవల చిరంజీవికి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రావడం.. ఆ తర్వాత నెగెటివ్ అని తెలియడంతో ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. అందుకే చిరంజీవి లేని సీన్స్ ను కొరటాల ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. అతి త్వరలోనే చిరంజీవి తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో చిరంజీవి, ఇతర నటీనటుల పై కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించబోతున్నారట. అయితే అవి కామెడీ సన్నివేశాలట. సాధారణంగా కొరటాల సినిమాల్లో కామెడీకి ఛాన్సే ఉండదు. ఇప్పటి వరకూ ఆయన సినిమాలు పరిశీలిస్తే ఆ విషయం తెలుస్తుంది.
అయితే .. ‘ఆచార్య’ సినిమాలో మాత్రం చిరంజీవి రిక్వెస్ట్ మేరకు కొన్ని కామెడీ సన్నివేశాల్ని కొరటాల డిజైన్ చేశారట. చిరంజీవి తిరిగి షూటింగ్ లో జాయిన్ అవడం ఈ సన్నివేశాలతోనే జరుగుతుందని చెప్పుకుంటున్నారు. చిరంజీవి కామెడీ టైమింగ్ తిరుగులేనిది. ముఖ్యంగా ఆయన నటించిన మాస్ యాక్షన్ మూవీస్ లో వాటి డోస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సరిగ్గా ఆచార్య సినిమాలో కూడా చిరుపై కామెడీ సీన్స్ అభిమానుల్ని భలేగా ఎంటర్ టైన్ చేస్తాయని చెబుతున్నారు. మరి ఆచార్య సినిమాకి చిరంజీవి కామెడీ ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.
Must Read ;- ‘ఆచార్య’ శాటిలైట్ రైట్స్ ఆ టీవీ ఛానల్ కేనట….!











