వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న రిజిస్ట్రేషన్ శాఖలో నకిలీ ఛలాన్ల పేరిట ఓ భారీ కుంభకోణం బయటపడగా.. తాజాగా ఏకంగా ఏపీ సచివాలయం కేంద్రంగా మరో భారీ కుంభకోణం వెలుగు చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి చెందిన ఈ కుంభకోణం సీఎం జగన్ మెడకు చుట్టుకునే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లుగా తెలుస్తున్న ఈ కుంభకోణంలో అమరావతిలోని సచివాలయంలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల వ్యక్తిగత, సహాయక సిబ్బంది పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షించే ఈ నిధులనే అక్రమార్కులు కొట్టేశారంటే.. సీఎంఓ పాత్ర లేకుండా సాధ్యం కాదన్న వాదనలు కలకలం రేపుతున్నాయి.
సీఎంఆర్ఎఫ్ ఆసరా ఇలా..
రాష్ట్రంలో నిరుపేదల వైద్య ఖర్చులు, ఏ ఆసరా లేని ఆయా కుటుంబాలకు బాసట అందించే దిశగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో ఆయా కుటుంబాల దరఖాస్తులను పరిశీలించిన తర్వాత.. అర్హతను నిర్దేశించే ముఖ్యమంత్రి కార్యాలయం ఎంతమేర నిధులు విడుదల చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత బాధితులకు నిధులను చెక్కుల రూపంలో విడుదల చేస్తుంటారు. ఈ నిధుల కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతల నుంచి పెద్ద సంఖ్యలో సిఫారసులు వస్తుంటాయి. వాటిని కూడా పరిశీలించిన తర్వాత సీఎంఓ నిధులను మంజూరు చేస్తుంటుంది. ఈ మొత్తం వ్యవహారం అంతా సీఎంఓ పరిధిలోని అధికారులే పర్యవేక్షిస్తుంటారు. ఇందులో ఆర్థిక శాఖ ప్రమేయం కూడా పెద్దగా ఉండదు. ఇలా నేరుగా సీఎంఓ పర్యవేక్షణలో కొనసాగే ఆసరాలోనే అవకతవకలు జరిగాయంటే.. సీఎంఓ అధికారుల ప్రమేయం లేకుండా కుంభకోణం సాధ్యం కాదు కదా.
అసలేం జరిగిందంటే..?
నేరుగా సీఎంఓ పర్యవేక్షణలోనే కొనసాగే సీఎంఆర్ఎఫ్ నిధులను భారీ ఎత్తున పక్కదారి పట్టించేశారు. గతంలోనే కడప జిల్లాకు చెందిన కొందరు ఈ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు, నకిలీ చెక్కుల ద్వారా నిధులను డ్రా చేసుకున్న వైనం గతంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ కేసు దర్యాప్తు ఎక్కడిదాకా వచ్చిందో? నేరస్తులను అసలు అరెస్ట్ చేశారో? లేదో? కూడా తెలియదు గానీ.. ఇప్పుడు ఏకంగా సచివాలయంలోని సీఎం కార్యాలయం నిర్వహణలోని సీఎంఆర్ఎఫ్ నిధులను అక్రమార్కులు దారి మళ్లించేశారు. ఈ దందాలో సచివాలయంలోని అధికారుల పాత్ర, ప్రజా ప్రతినిధుల పీఏలు, అనుచరుల పాత్ర ఉందన్న దిశగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ దందాలో ఏకంగా 50 మందికి పైగా పాత్ర ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ దందాపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. అయితే సీఎం కార్యాలయం ఆధ్వర్యంలోని సీఎంఆర్ఎఫ్ నిధుల్లో గోల్ మాల్ అయిన విషయాన్ని బయటకేమీ చెప్పకుండానే ఏసీబీ అధికారులు గుట్టుగా విచారణ సాగిస్తున్నారట. మరి ఈ భారీ కుంభకోణం నుంచి తాలూకు మరకలు అంటకుండా సీఎం జగన్ ఎలా తప్పించుకుంటారో చూడాలి.
Must Read ;- భారీ స్కాంలో జగన్ జిల్లా కీలక భూమిక











