ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడకు తరలివస్తూ ఇటీవల గుజరాత్ లో పట్టుబడిన డ్రగ్స్ దందా చాలా పెద్దదేనన్న వాదనలు అంతకంతకూ బలపడుతున్నాయి. విజయవాడలోని సత్యనారాయణపురానికి చెందిన తన అత్తారింటిని ఆఫీస్ గా చూపిన ఈ కేసులోని కీలక నిందితుడు సుధాకర్.. ఇప్పటికే దాదాపుగా లక్ష కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను రాష్ట్రానికి తరలించాడని, ఇక్కడి నుంచి దేశంలోని పలు నగరాలకు డ్రగ్స్ ను సరఫరా చేశాడని కూడా డైరెక్టరేట్ ఆప్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) తేల్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సుధాకర్ తో పాటు అతడి భార్యను కూడా అరెస్ట్ చేసిన డీఆర్ఐ అధికారులు వారిని గుజరాత్ కు తరలించి అన్ని కోణాల్లో విచారణ సాగిస్తున్నారట. మొత్తంగా ఈ డ్రగ్స్ దందా మామూలుది కాదన్న విషయం తేలిపోయిందనే చెప్పాలి.
సుధాకర్ వైసీపీ ఎమ్మెల్యే బంధువా?
వేల కోట్ల రూపాయలతో ముడివడి ఉన్న ఈ దందాపై ఏపీ సీఎం జగన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని సాక్షి మీడియాలో పెద్దగా వార్తలే కవర్ కాలేదట. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన విపక్ష టీడీపీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు బుధవారం మీడియా ముందుకు వచ్చిన టీడీపీ కీలక నేత, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డ్రగ్స్ దందాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.9 వేల కోట్ల విలువైన డ్రగ్స్ విజయవాడకు సరఫరా అవుతూ పట్టుబడితే వైసీపీ సర్కారు గానీ, ఏపీ పోలీసులు గానీ ఎందుకు స్పందించడం లేదని బొండా ప్రశ్నించారు. ఈ దందాలో కీలక నిందితుడిగా ఉన్న సుధాకర్ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు బంధువు అని, ఇలాంటి నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం సహకారం లేకుండా సుధాకర్ అంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ను విజయవాడకు తరలిస్తారా? అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ దందాలో సుధాకర్ కు ముమ్మాటికీ వైసీపీ సర్కారు మద్దతు ఉందని కూడా బొండా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ డబ్బు ఐఎస్ఐకి వెళుతోందట
బెజవాడ కేంద్రంగా వెలుగు చూసిన డ్రగ్స్ దందాకు చెందిన సొమ్ము పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కు చేరుతోందని కూడా బొండా ఉమా మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాలిబాన్ ఉగ్రవాదుల చెరలోని ఆఫ్ఘనిస్తాన్ నుంచి విజయవాడకు వస్తున్న డ్రగ్స్ ను అమ్మగా వచ్చిన డబ్బు ఐఎస్ఐకి చేరుతోందని డీఆర్ఐ విచారణలో తేలిందని కూడా బొండా చెప్పుకొచ్చారు. మన రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మగా వచ్చిన సొమ్ము ఐఎస్ఐకి చేరుతోందంటే.. మన దేశ భద్రత ప్రమాదంలో పడినట్టే కదా అని ఆందోళన వ్యక్తం చేసిన బొండా.. ఈ వ్యవహారంపై జగన్ సర్కారు స్పందించకపోతే.. ఏపీ పోలీసులకు ఏమైందని ప్రశ్నించారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ఈ తరహా దందాలకు చెక్ పెట్టాల్సినప బాధ్యత పోలీసులపై లేదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. మొత్తంగా ఇటు సుధాకర్ బంధువు ఓ వైసీపీ ఎమ్మెల్యే అని, ఈ డ్రగ్స్ డబ్బు ఐఎస్ఐ వెళుతోందని బొండా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
must read ;- టీడీపీ అల్టిమేట్ పోరు.. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్











