మా అక్షరం..మీ ఆయుధం, వి రిపోర్ట్ యు డిసైడ్.. ఇవీ అమోదా బ్రాడ్ కాస్టింగ్ ఆధ్వర్యంలో నడుస్తున్నఏబీఎన్-ఆంధ్రజ్యోతి గ్రూపు ట్యాగ్ లైన్లు. ఇప్పుడు సరిగ్గా ఆ ట్యాగ్ లైన్లకు సరిపోలేలా కొత్త పలుకు శీర్షికతో ఆంధ్రజ్యోతి పత్రికలో గ్రూపు చీఫ్ రాధాకృష్ణ అక్షరాలనే సరికొత్త తిరుగులేని ఆయుధాలుగా వాడుతున్నారు. ఇటీవల షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందని ఓ సంచలన కథనాన్ని ప్రచురించారు. ఈ పరంపరలో రాధాకృష్ణపై చాలా మంది వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు. పనిలో పనిగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి మరింత జోరు పెంచారు. చివరికి మొన్న ఫిబ్రవరి 9 షర్మిల లోటస్ పాండ్‌లో అభిమానులతో సమావేశమయ్యారు. పార్టీ పెడతానని డైరెక్ట్‌గా చెప్పకున్నా..తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, ఎందుకు లేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా పార్టీ పెడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఓవైపు సజ్జల మాట్లాడుతూ.. కొన్నాళ్లుగా షర్మిల పార్టీకి సంబంధించి జగన్ కుటుంబీకుల్లో చర్చ నడుస్తోందని, భిన్నాభిప్రాయాలే తప్ప.. బేధాబిప్రాయాలు కాదని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. అదే సమయంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై విమర్శలు చేశారు. రాత్రి పూట రాధాకృష్ణ కలలు కంటాడని, అవే మరుసటి రోజు అచ్చేస్తారని వ్యాఖ్యానించారు. షర్మిల పార్టీ పెడుతున్న విషయం తనకే తెలియదని, రాధాకృష్ణకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించారు.
విజయసాయిరెడ్డికి కౌంటర్..
దీనిపై మరుసటి ఎపిసోడ్‌లో రాధాకృష్ణ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డికి షర్మిల పార్టీ విషయం తెలియకపోవడానికి తాను బాధ్యుడిని కాదని, తాడేపల్లి అంతఃపురంలో రహస్యాలు చాలా తెలుసునని అన్నారు. పనిలో పనిగా విజయసాయిరెడ్డి తీరు చూస్తుంటే పరిటాల రవి ఎపిసోడ్‌లో మొద్దుశీను టాపిక్ తెచ్చారు. సూరి బావ కళ్లల్లో ఆనందం చూసేందుకే పరిటాల రవిని చంపానని మొద్దు శీను గతంలో వ్యాఖ్యానించిన వైనాన్ని గుర్తుకు తెచ్చారు. అంతేకాదు..విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టే తనకు కల వస్తే వచ్చి ఉండవచ్చని చెప్పడంతో పాటు విజయసాయిరెడ్డి లీలల గురించి కూడా కొన్ని కలలు వచ్చాయని, అవేమిటో త్వరలోనే అందరికీ తెలుస్తాయని డైరెక్ట్‌గానే చెప్పారు రాధాకృష్ణ.
Must Read ;- సెంటిమెంట్లు,ముహూర్తం.. ఖమ్మం నుంచి షర్మిల తొలి అడుగు
వైసీపీలో చర్చ..
ఆంధ్రజ్యోతితో పాటు కొన్ని పత్రికలు, ఛానెళ్లలో వచ్చే కొన్ని కథనాలను, వాస్తవాలను కూడా వైసీపీ వారు ఖండించేవారు. వారు చదవడానికి, చూడడానికి, వినడానికి ఇష్టపడని అలాంటి వార్తలను గిట్టనివారు రాసినవిగా, చంద్రబాబు రాయించినవిగా లేదా మరో ముద్ర వేసి కొట్టిపడేయడం నిత్యకార్యంలా మార్చుకున్న వైసీపీ మాత్రం షర్మిల కొత్త పార్టీ ఇష్యూలో షాక్ తింది. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అచ్చేసిన కథనానికి అచ్చుగుద్దినట్టు రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో వైసీపీ శ్రేణులు తేరుకోవడానికి సమయం పట్టింది. విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లపై స్పందించిన రాధాకృష్ణ తరువాతి వీకెండ్ కామెంట్‌లో విజసాయిరెడ్డిపైనా తనకు కలలు వచ్చాయని, వాటిని తరువాతే వెల్లడిస్తానని రాధాకృష్ణ చెప్పడంతో వైసీపీలోని ఓ వర్గంలో దీనిపై చర్చ నడుస్తోంది. జగన్‌కి విశ్వాసపాత్రుడినని ఎప్పటికప్పుడు నిరూపించుకునేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తూనే ఉంటారని, ఆయన విశ్వాసం ఆయనదని వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ఎదుర్కొంటున్న అవినీతి కేసుల్లో విజయసాయిరెడ్డి పేరు కూడా ఉండడంతో ఇప్పటికే A2గా కూడా గిట్టనివారు పదేపదే ప్రస్తావిస్తుంటారు.తాడేపల్లి అంతఃపురం రహస్యాలే తనకు మొత్తం తెలుసునని రాధాకృష్ణ చెప్పడం.. తాడేపల్లి విషయాలే బయటకు వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి విషయాలు ఎందుకు తెలియవనే చర్చ నడుస్తోంది.
గురువులు వీరే..
ఇక రాధాకృష్ణ తనకు జర్నలిజం నేర్పిన గురువులుగా సుబ్బారాయుడు, జి.కృష్ణ వంటి వారి పేర్లను కూడా వినియోగించారు. వరంగల్, ప్రకాశం జిల్లాల మూలాలున్న, వామపక్ష భావజాలం, పోరాటాలే నినాదం, అభ్యుదయ వాదంతోపాటు పరిశోధనాత్మక కథనాలకు, సంచలన కథనాలను అందించడంతోపాటు అప్పటి రాజకీయ పరిశోధన వార్తలు ఇవ్వడంలో పేరున్నజర్నలిస్టులను ప్రస్తావించారు. దివంగత సాహితీ వేత్త పరాంకుశం దామోదరస్వామి రాసిన ‘ఈ నేల-ఈ గాలి’ వ్యాస సంకలనానికి ముఖచిత్రం గీసి అందరి మనన్నలు అందుకున్న సీనియర్ జర్నలిస్టు జి. కృష్ణ పరిశీలనాత్మక జర్నలిజంలో నిపుణుడు. వీరి పేర్లను రాధాకృష్ణ ప్రస్తావిచాంరంటేనే పరిశోధనాత్మక, సంచలన కథనాలు వస్తాయని ముందుగానే సూచించినట్టు భావించవచ్చు.
ఎన్నో అంశాలు..
- పనిలో పనిగా రాధాకృష్ణ తన కథనంలో షర్మిలకు, జగన్‌కు మధ్య విభేదాల విషయంలో వివేకా హత్య కేసును ప్రస్తావించారు. వివేకా కుమార్తెతో షర్మిల క్లోజ్‌గా ఉండడం జగన్‌కు నచ్చలేదని రాశారు. షర్మిలను ధిల్లీకి పంపిస్తే..తన ధిల్లీ సంబంధాలు దెబ్బతింటాయని జగన్ భావించినట్టు ప్రస్తావించారు. దీంతోపాటు షర్మిలకు రూ.పదివేల కోట్ల ఆస్తులు కూడా రాకుండా జగన్ మొండికేసినట్టు రాధాకృష్ణ చెప్పారు. వీటి విషయలో విజయసాయిరెడ్డికి సమాచారం ఉన్నా లేకున్నా..ఏది జరిగినా వార్తాంశమే అవుతుందనే అంచనాలున్నాయి.
- ఇక ఆస్తుల లెక్క విషయానికి వస్తే..విజయసాయిరెడ్డి ఆడిటర్‌గా ఉన్నారు. ఆస్తులు-అప్పుల పట్టికను ఇలా చూసి అలా పసిగట్టగలిగే చార్టెర్డ్ అకౌంటెంట్‌గా చేశారు. కాబట్టి..ఈ లెక్కలు తెలియవా అనే చర్చ కూడా నడుస్తోంది.
- ‘గడ్డం’ పట్టుకుని వదలరే:ఇక విశాఖ జిల్లాలో ఓ పదవి విషయంలో ఇద్దరు నాయకుల మధ్య వార్ మొదలైంది. ఓ వ్యక్తికి పదవి ఇప్పించే విషయంలో ఈ వార్ మొదలైందని చెబుతున్నారు. ఈ వార్‌ను సర్దుబాటు చేసేందుకు విజయసాయిరెడ్డి ఎంటర్ అయ్యారని, మీరు వివాదం పెంచుకోవద్దు అవసరమైతే పార్టీలో చర్చించి ఇప్పిస్తానని, పదవుల కోసం మొండిగా ‘గడ్డం’ పట్టుకుని వేలాడొద్దని కొంతమంది నేతలకు చెప్పినట్లు గతంలో సోషల్ మీడియాలో కామెంట్లూ వచ్చాయి. రాధాకృష్ణకు ఈ విషయంపై సమాచారం ఇంకా క్లారిటీగా ఉండి ఉండవచ్చనే చర్చ నడుస్తోంది.
- ఆ మధ్య తాడేపల్లిలోని తన అధికారిక నివాసం నుంచి సీఎం జగన్ విశాఖకు బయలు దేరే సమయంలో సీఎం జగన్ కారులో విజయసాయి కూడా ఎక్కారు. అయితే వెంటనే విజయసాయిరెడ్డి కారు దిగిపోయారు. సీఎంతోపాటు వైద్య మంత్రి ఆళ్ళనాని వెళ్లారు. విశాఖ ఎల్జీపాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లేటప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వీడియో వైరల్ అయింది. ఇందుకు కేవలం బిజీ షెడ్యూలే కారణమా..లేక మరేదైనా ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది.
- మరెన్నో అనుమానాలు..
- ధిల్లీ నుంచి వస్తున్న సమాచారం పేరుతో..చాలా చోట్ల చాలా అంశాలు ప్రచారంలో ఉన్నాయి. జగన్‌పై కేసుల విచారణ జరుగుతున్న నేపథ్యంలో అత్యవసరమైతే ఆ బాధ్యతలను నిర్వర్తించే జాబితాలో ఎవరున్నారనే ప్రచారం ఇదివరకే జరిగింది. వైసీపీలోని ఓ నాయకుడి పేరు కూడా వైరల్ అయింది. మరో నాయకుడు ఇదే అదనుగా సద్దుకునే కార్యక్రమం ఇప్పటికే మొదలు పెట్టాడని కూడా ప్రచారం జరిగింది. అయితే సీఎం జగన్ సన్నిహితుల్లో ఒకరిని ఇప్పటికే ప్రిపేర్ చేశారని మరో అంశం ప్రచారంలో ఉంది. వీటికి తోడు విశాఖలో భూముల కబ్జా ఆరోపణలు ఇటీవల పెరిగాయి. అన్ని పార్టీలకు చెందిన నాయకుల పేర్లు వినిపిస్తున్నా..సహజంగానే అధికార పార్టీ నాయకులపై ఆరోపణలు వస్తాయి. వీటన్నిటి విషయంలో బయటకు వస్తున్న సమాచారం మాత్రమే కాకుండా..రాధాకృష్ణకు ఎక్స్ క్లూజీవ్ ఏం తెలిసి ఉంటుందబ్బా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ తెలిస్తే..టైమింగ్ కోసం చూస్తున్నారా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. రాధాకృష్ణకి విజయసాయిరెడ్డి విషయంలో వచ్చే కల, వచ్చిన కల నిజం అవుతుందా , ఒక వేళ నిజం అయితే ఏ ఉదయాన నిజం అవుతుందనేది చూడాలి.
- Also Read ;- జగన్ దూతగానే ఆళ్ల షర్మిలతో భేటీ అయ్యారా?