MAA Elections 2021 :
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) రచ్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుత పాలక వర్గం పదవీకాలం సెప్టెంబరు 18తో ముగుస్తుంది. అదే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇంత సమయం ఉన్నా మా ఎన్నికల రచ్చ ముందే మొదలైన సంగతి తెలిసిందే. మా ఎన్నికల వ్యవహారం అనేది కేవలం సినిమా నటీనటులకు మాత్రమే సంబంధించింది. ఇందులో ప్రజలకు ఆసక్తికరమైన అంశం ఏదీ లేదు. కాకపోతే సినిమా అనేది జనంతో పెనవేసుకుపోయింది కాబట్టి ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా బూతద్దంలో చూడటం సర్వసాధారణం.
మా అధ్యక్ష పదవికి నటుడు ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. వీరు కాక మరో ఇద్దరి దృష్టి కూడా ఈ పదవిపై ఉంది. ఈ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించి ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకోవాలని కూడా అనుకున్నారు. అసలు సెప్టెంబరు దాకా ఎందుకు ఇప్పుడే ఎన్నికలు నిర్వహించేస్తే ఓ పనైపోతోందని వాదించే వర్గం కూడా ఉంది.అందుకే కొంతమంది ఈసీ మెంబర్స్ ప్రస్తుత పాలకవర్గాన్ని రద్దు చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఈ అసోసియేషన్ కు నటుడు కృష్ణంరాజు క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు.
పాలకవర్గాన్ని రద్దుచేసి ఎన్నికలు నిర్వహించాల్సిందిగా 15 మంది ఈసీ మెంబర్స్ కృష్ణంరాజుకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ఎలాగూ పదవీకాలం ముగిసింది కనుక వెంటనే ఎన్నికలు నిర్వహించేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఈసారి ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. ప్రస్తుత మా అధ్యక్షుడు సీనియర్ నరేష్ పదవీ కాలం ముగియవచ్చింది. అలాగే జీవిత ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గురువారం మా కార్యవర్గ సమావేశం జరగనుంది.
కృష్ణంరాజుకు రాసిన లేఖపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త అధ్యక్షుడి ఎన్నికను ఏకగ్రీవం చేస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. నటుడు మురళీ మోహన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు సమాచారం. ఎలాంటి వివాదాలకూ ఆస్కారం లేకుండా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు బరిలో విష్ణు, ప్రకాష్ రాజ్ లేకుండా కొత్త నాయకుడిని తెరమీదకు తెచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి సూచన మేరకే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Must Read ;- ‘మా’ ముగ్గులోకి బాలయ్య పేరును లాగిన విష్ణు