ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం పూర్తిగా విగ్రహాల చుట్టూనే తిరుగుతోంది. ఈ గొడవ ఇప్పట్లో చల్లారేలా లేదు. చల్లార్చే ప్రయత్నం చేయాల్సిన ప్రభుత్వం.. మరింత అగ్గి రాజేస్తోంది. ప్రతిపక్షనేతపై నిందలేస్తూ.. దోషులను పట్టుకోవడంపై నిర్లక్ష్యం వహిస్తోంది. మరోవైపు.. ఇదే అదనుగా బీజేపీ, జనసేనలు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు యత్నిస్తున్నాయి. ఈ స్థితిలో.. తిరుపతి ఉప ఎన్నికల ముంగిట ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం గతంలో ఎన్నడూ ఎదుర్కోని సంక్షోభం దిశగా పయనిస్తున్నట్లు ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి.
విష రాజకీయాలకు బీజం పడుతోందా?
ఏపీ ప్రశాంతంగా ఉండే రాష్ట్రం. ఇక్కడ గతంలో ఎప్పుడూ మత కలహాలు జరిగిన దాఖలాలు లేవు. అన్ని మతాల వారూ కలిసిమెలిసి జీవిస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా కలహాలు హైదరాబాద్ కే పరిమితమయ్యాయి గానీ.. ఇక్కడకు పాకలేదు. బహుశా అందుకేనేమో.. ఇక్కడ బీజేపీకి గానీ, ఎంఐఎంకి గానీ స్థానం లేదు. తెలంగాణలో దక్కిన అనూహ్య విజయాలతో ఊపుమీదున్న బీజేపీ.. ఇప్పుడు ఆంధ్రపై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఎలాగైనా పుంజుకుని.. అధికార వైసీపీకి ప్రత్యామ్నాయంగా నిలవాలనేది ఆ పార్టీ లక్ష్యం. అలా జరగాలంటే.. ఆ పార్టీ ముందున్న ఏకైక మార్గం.. ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం. అలా రెచ్చగొట్టాలంటే.. ఏం చేయాలి? ఈ ప్రశ్న నుంచి ఉత్పన్నమైందే.. నేటి ప్రమాదకర స్థితి అనేది కొందరి అభిప్రాయం.
దోషుల్ని పట్టుకోవడం ప్రభుత్వానికి ఓ లెక్కా?
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 140 ఆలయాలపై దాడులు. కానీ, ఆ చేస్తున్నది ఎవరో ప్రభుత్వానికి తెలియదట! నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. దోషుల్ని పట్టుకోవడం ఎంత పని? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది? ఈ ప్రశ్నలు ప్రస్తుతం సామాన్యుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. ఇంత రచ్చ జరుగుతున్నా.. ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటోంది? దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? బీజేపీ బలపడేందుకు ఆయుధం అందించే ప్రయత్నమా ఇది? అంటే.. ఔననే అంటున్నారు విశ్లేషకులు.
అయినా.. బీజేపీ బలపడితే.. అధికార వైసీపీకి కలిగే ప్రయోజనమేంటి? అనేది ఇంకో ప్రశ్న. అసలు వ్యవహారమంతా ఇక్కడే ఉంది. రాష్ట్రంలో చంద్రబాబుని, టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలనేది జగన్ లక్ష్యం. అలా జరగాలంటే.. ఓ బలమైన మూడో పక్షం అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన మూడో పక్షం అంటూ ఏదీ లేదు. జనసేన ఉందా.. అంటే.. అది బీజేపీకి తోక పార్టీగా మిగిలిపోయింది. అందుకే.. బీజేపీ ఇక్కడ రాజకీయంగా పుంజుకునేందుకు కావలసిన అనుకూల పరిస్థితులను ఏర్పాటుచేసే బాధ్యతను ఢిల్లీ పెద్దలు జగన్ పై ఉంచారనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ క్రమంలోనే గుళ్లపై దాడులు మొదలయ్యాయని, ప్రభుత్వం కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితులను ఉపయోగించుకుని.. ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టించి.. తనకో బలమైన ఓటు బ్యాంకును ఏర్పరుచుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
దానికి తిరుపతి ఎన్నకనే లక్ష్యంగా చేసుకుందనేది కొందరి అభిప్రాయం. టీడీపీని అంతం చేయాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు జగన్.. బీజేపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. చంద్రబాబే విగ్రహాలను ధ్వంసం చేయిస్తున్నారంటూ.. నిస్సిగ్గుగా ప్రకటనలు కూడా చేస్తున్నారు. అదే నిజమైతే.. దాన్ని నిరూపించవచ్చు కదా! దోషులను పట్టుకుని శిక్షించవచ్చు కదా! సీఎంగా ఉండి చేయాల్సిన పనులు చేయకుండా.. ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడడం ఎంతవరకు సబబు! ఈ రాద్దాంతం ఇంకా పెద్దదవడం.. జగన్ కు ఇంకో విధంగా కూడా మేలు చేసేదే! ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లో.. అన్నీ వైఫల్యాలే. చెప్పుకోవడానికి ఒక్క విజయమూ లేదు. రాష్ట్రం ఆర్థిక సంక్షభం ముంగిట ఉంది. ఈ స్థితిలో.. ప్రజల దృష్టి మరల్చేందుకు ఇది బాగా ఉపయోగపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ వైఫల్యాల గురించి కన్నా.. విగ్రహాల ధ్వంసం గురించే చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఓ విధంగా టీడీపీ కూడా ఆయన ట్రాప్ లో పడ్డట్టే కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ పూర్తిగా బీజేపీకి అనుకూలిస్తున్నాయి.
Must Read ;- బీజేపీ స్వామి గారి జగన్ వకాల్తా ఎందుకు?
ప్రజల్లో భావోద్వేగం పెరుగుతోందా?
ఇక్కడ ఏపీ ప్రజల సంయమనాన్ని నిజంగా అభినందించి తీరాలి. రాష్ట్రంలో ఇన్ని విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా.. రాజకీయ నాయకులు హడావుడి చేస్తున్నారు తప్ప.. దీన్ని ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. ఇంత సున్నితమైన విషయంలో.. ఇప్పటివరకు ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారనిపిస్తోంది. కానీ, ఇది జిత్తులమారి రాజకీయ నాయకులకు ఏమాత్రం రుచించదు. వారు ప్రజలను రెచ్చగొట్టేందుకు మరింతగా యత్నిస్తారు. ఈ క్రమంలోనే కొందరు నాయకులు.. దారుణంగా మాట్లాడుతున్నారు.
ఓ బీజేపీ నాయకుడు.. భగవద్గీత కావాలా! బైబిల్ కావాలా! అంటాడు. ప్రజలకు అభివృద్ధి కావాలిగానీ.. ఆ రెండూ ఎందుకండీ! అంటున్నారు విశ్లేషకులు. మరో నాయకుడేమో.. తిరుపతిలో కృష్ణుడికి, జీసెన్ కీ మధ్య పోటీ అంటాడు. మధ్యలో వీళ్లెక్కడి నుంచి వచ్చారండీ అంటూ తలలు పట్టుకోవడం మేధావుల వంతైంది. ఇలా మాట్లాడడానికి ఈ నాయకులకు ఎంత తెగింపు, ధైర్యం కావాలి! ఒకప్పుడు ఇలా మాట్లాడేవారిపై టెర్రరిస్టు యాక్టు ప్రయోగించేవారు. కానీ, ఇప్పుడీ మాటలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఏదిఏమైనా.. ఈ మాటలు.. ఏపీకి భవిష్యత్తులో రాబోయే ప్రమాద సూచికలు. ప్రజలు అప్రమత్తంగా ఉండి.. వీటిని మధ్యలో తుంచేయాలి. రెండు పార్టీలు కలిసి తమపై పన్నిన రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదించాలి. దీనికి తిరుపతి ఎన్నికతోనే తెరపడేలా చేయాలి. లేదంటే.. ఏపీని కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా కాదు!
Also Read ;- అరువుకు పొరుగు రాష్ట్రం నాయకుడు.. తిరుపతిలో ‘బండి’ దూకుడు