మెగాస్టార్ అభిమానులంతా ‘ఆచార్య’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘సైరా’ తరువాత చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో, భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా వదిలిన టీజర్ .. ఈ సినిమాపై అందరిలో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ ‘ఆచార్య’ పాఠాలు చెప్పేరకం కాదు .. గుణపాఠాలు చెప్పేరకం అనే విషయం అందరికీ అర్థమైపోయింది. ఈ సినిమాను మే 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు.
ఈ పోస్టర్లో కథానాయకుడు తన తోటివారి కష్టాలను తీర్చడం కోసం, అవతలివారితో చర్చలు జరుపుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. అవతల నుంచి వచ్చే సమాధానాన్ని బట్టి తాను స్పందించే తీరు ఉంటుందన్నట్టుగా కథానాయకుడి పక్కనే గొడ్డలి సిద్ధంగా ఉండటం ఈ పోస్టర్లో కనిపిస్తోంది. చిరంజీవి చేతికి కట్టుకున్న ఎర్రగుడ్డ ఆయనలోని తిరుగుబాటు ధోరణికి అద్దం పడుతోంది. చిరంజీవి లుక్ .. ఆయన కాస్ట్యూమ్స్ కొత్తగా చాలా బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘శ్రీమంతుడు’ సినిమాలో మామిడితోట ఫైట్ కిముందు మహేశ్ బాబుతో ఏర్పాటు చేసిన మీటింగును ఈ పోస్టర్ గుర్తుచేస్తోంది.
చిరంజీవి సరసన కథానాయికగా కాజల్ అలరించనుండగా, చరణ్ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయన జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక డ్యూయెట్ కూడా ఉందనే టాక్, అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. దర్శకుడిగా కొరటాల శివ ఇంతవరకూ వరుస హిట్లను అందిస్తూ వచ్చాడు. అపజయమెరుగని ఆయన, ఈ సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో జమచేసుకుంటాడేమో చూడాలి.
Must Read ;- ‘ఆచార్య’ వెర్సెస్ ‘నారప్ప’