వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కొత్త రాజకీయపార్టీ పెడుతుందని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం రెండు రాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వార్త వెనుక కారణాలపై , ఈ సమాచారాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు చెప్పింది ఎవరు.. చెప్పించింది ఎవరు అనే అంశంపై పలు కోణాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ చర్చ ఎన్నికోణాల్లో జరుగుతున్నా.. ప్రధానంగా రెండు పేర్లు తెరపైకి వస్తున్నాయి. షర్మిల పార్టీ పెడుతున్న అంశాన్ని షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా కేసీఆర్ కి తెలిసిందని, కేసీఆర్ తన సోర్స్ ద్వారా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి చేరవేశారని ప్రచారం జరుగుతోంది. ఇదంతా కేవలం బయట జరుగుతున్న చర్చ మాత్రమే. ఇక చావునోట్లో తల పెట్టి తెలంగాణ సాధించానని, ఏ పార్టీ వచ్చినా తనను ఏం చేయలేదని ఇన్నాళ్లూ చెప్పిన కేసీఆర్ కి తన సన్నిహితులు చెబుతున్న సమాచారం నేపథ్యంలో ‘దూర దృష్టి’తో ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి లీక్ చేసి ఉండవచ్చని తెలుస్తోంది.
తెలంగాణలో బీజేపీ జోరుకు బ్రేక్ వేసేందుకే తెలంగాణలో పార్టీ పెడుతున్నారన్న (పెట్టిస్తున్నారని) చర్చ ఓవైపు, జగన్ తో షర్మిలకు విబేధాలు కూడా కారణం అని మరోవైపు చర్చ నడుస్తోంది. ఆ విభేదాల విషయం పక్కన బెడితే.. రాజకీయంగా కేసీఆర్ తాను సేఫ్ గేమ్ అడడంలో సిద్ధహస్తుడని, ఇక రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదని బాగా నమ్మే వ్యక్తిగా చెబుతున్నారు. ఇక కేసీఆర్ కి, నిజామాబాద్ జిల్లాకి చెందిన రాధాకృష్ణకి దశాబ్దాలనాటినుంచి పరిచయాలున్నాయని అప్పటి నాయకులు చెబుతారు. అప్పట్లో ఆంధ్రజ్యోతి పాత యాజమాన్యం ఉండేది. తరువాత కొన్నాళ్లపాటు మూతపడింది. ఆ పత్రికను రాధాకృష్ణతో పాటు మరికొందరు కలసి కొనుక్కున్నారు. కాలక్రమేణా అది రాధాకృష్ణ చేతికి వచ్చిందని చెబుతుంటారు. ఇక 1998 తరువాత వీరి మధ్య పరిస్థితులను బట్టి విమర్శలు, సర్దుబాట్లు కొనసాగాయి. తాజాగా ఆ స్నేహంలో భాగంగా ఈ విషయం లీక్ చేశారని చెబుతున్నారు.
Must Read ;- షర్మిల కొత్త పార్టీ తెలంగాణలోనే.. ఎందుకంటే?
ఇక రాజకీయ అంశానికి వస్తే.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు, కేసీఆర్ ధిల్లీ టూర్ తరువాత మారిన స్వరం, కేటీఆర్ సీఎం అవుతారన్న ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లోనే పలు సందేహాలకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే.. టీఆర్ఎస్ ఓటు బ్యాంకు సేఫ్ గా ఉండేలా చూసుకోవడం ఎంత ముఖ్యమో టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీల్చడం కూడా అంతే ముఖ్యమని, ఆ వ్యూహంలో భాగంగా షర్మిల పార్టీ పెట్టే అంశం తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. మొన్నటివరకు ఆంధ్ర ప్రాంత పాలకులపై వ్యతిరేకత వ్యాఖ్యలతో సెంటిమెంట్ కు తెరదీసిన కేసీఆర్..రానున్న కాలం ఆ వ్యాఖ్యలు పెద్ద ఓటర్లపై పెద్దగా ప్రభావం చూపవనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో గతంలో సెటిలర్లు టీఆర్ఎస్ కు ఓట్లు వేయరని భావించినా..మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అండగా సెటిలర్లే ఓట్లు వేశారన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఓట్లను అలానే కాపాడుకోవడంతోపాటు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్ కు పడకుండా చేసే వ్యూహంగా కనిపిస్తోందనే అంచనాలున్నాయి.
ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు వైఎస్ జగన్ ను ఓన్ చేసుకున్నందున వైసీపీ అధికారంలోకి రావడం ఈజీ అయిందన్న అంచనాలున్నాయి. అయితే తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మనిషిగానే చూసేవారెక్కువ. తెలంగాణ విషయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడిన తీరు, నంద్యాల సభలో చేసిన వ్యాఖ్యల విషయం పక్కనబెడితే వైఎస్ అభిమానులను, కాంగ్రెస్ అభిమానులను వేరు చేసే పరిస్థితి లేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో షర్మిల పార్టీ పెడితే.. వైఎస్ అభిమానులు షర్మిల వైపు మొగ్గుచూపే అవకాశం ఉంది. అంటే.. వైఎస్ అభిమానులు జగన్ కంటే షర్మిలవైపే మొగ్గుచూపే అవకాశం ఎక్కువనే అంచనాలకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా నియోజకవర్గంలో కనీసం 3శాతం 6శాతం ఓట్లు చీల్చినా టీఆర్ఎస్ కు అది ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ లోనూ వైసీపీకి మూడు ఎమ్మెల్యే, ఓ ఎంపీ స్థానం దక్కాయంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభావం ఉందని అప్పట్లోనే చర్చ నడిచింది. ఇక జగన్ –కేసీఆర్ స్నేహం, వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో తెలంగాణలో జరిగిన వివాదాలు, మానుకోట ఘటన, టీడీపీని భూస్థాపితం చేయడం, ఇప్పుడు మరో ప్రాంతీయ పార్టీకి అవకాశం ఇవ్వడం ఇవన్నీ చర్చనీయాంశాలే అయినా.. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండదనేది కూడా ప్రధాన చర్చనీయాంశం. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి కేసీఆర్ వైపునుంచి షర్మిల పార్టీ విషయం లీక్ అయిందా.. లీక్ చేశారా.. అనేది తేలాల్సి ఉంది.
Must Read ;- షర్మిల ‘సొంత పార్టీ’ ఇష్యూ.. లీక్ చేసింది ‘ఆయనే’!











