సెల్ ఫోన్ కొంటే.. దానిని ఎప్పటికప్పుడు చార్జింగ్ చేసుకునేందుకు ఓ చార్జర్ కూడా ఇస్తారు కదా. సెల్ ఫోన్‌ను చార్జింగ్ చేసే సమయంలో ఆ చార్జర్ ను ప్లగ్ లో పెట్టేసి.. దానికున్న తీగను సెల్ ఫోన్ కు తగిలిస్తాం. అంటే.. చార్జర్ ద్వారా విద్యుత్ ను సెల్ ఫోన్ కు పంపి.. దాని బ్యాటరీని నింపుతుంది. అంటే,, చార్జింగ్ అయిపోయి మూగబోయిన సెల్ ఫోన్ కు ఈ తీగ (వైర్) ప్రాణం పోస్తుందన్న మాట. చేతిలో ఇమిడే సెల్ ఫోన్ కు ప్రాణం పోసే ఆ తీగ ఏకంగా ఓ మనిషి ప్రాణం తీసింది. నమ్మకం లేదా? అయితే.. ఇటీవల విజయవాడను షేక్ చేసిన యువ వ్యాపారి కరణం రాహుల్ హత్యను పరిశీలిస్తే.. ఈ మాట నిజమేనని నమ్మక తప్పదు. కారులో కూర్చున్న రాహుల్ గొంతుకు ఈ సెల్ ఫోన్ చార్జర్ వైర్ నే బిగించి నిందితులు హత్య చేశారట. ఈ విషయాన్ని నిందితులు స్వయంగా ఒప్పుకోగా.. పోలీసులు అదే విషయాన్ని నిర్ధారించి కోర్టుకు తెలిపేందుకు చార్జిషీట్ ను రెడీ చేస్తున్నారు.
నిందితులంతా అరెస్ట్
విజయవాడ నగరంలో ఇటీవలే జరిగిన రాహుల్ హత్య కేసు రోజుకో మలుపు తిరిగింది. రాహుల్ నెలకొల్పిన సిలిండర్ల కంపెనీకి సంబంధించి కోరాడ విజయ్ కుమార్ తో విభేదాలు తలెత్తడం.. అదే సమయంలో కోగంటి సత్యం ఎంట్రీ ఇవ్వడం.. ఆ కంపెనీని ఎలాగైనా తక్కువ ధరకే చేజిక్కించుకునే వ్యూహం రచించడం.. అందుకు రాహుల్ ఒప్పుకోకపోవడం.. అదే క్రమంలోమ కోగంటి సత్యం రచించిన ప్రణాళిక ప్రకారమే రాహుల్ ను బయటకు రప్పించడం.. కారులో కూర్చోబెట్టి చర్చలు జరపడం.. ఆ తర్వాత కారులోనే అతడికి ఊపిరి ఆడకుండా చంపేయడం తెలిసిందే. అయితే రాహుల్ కు ఊపిరాడకుండా చేసేందుకు అతడి ముఖంపై దిండు పెట్టి అదిమారని తొలుత భావించగా.. తాజాగా అతడి గొంతుకు చార్జర్ వైర్ ను బిగించి హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. అంటే.. చార్జర్ కు ఉన్న వైర్ తో మనిషి ప్రాణం తీసేశారన్న మాట.
మచిలీపట్నం జైలుకు..
ఈ హత్య జరిగిన తర్వాత ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ పరారీ కాగా.. హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న గాయత్రి అనే మహిళ కూడా పరారైంది. అప్పటిదాకా ఈ హత్యతో తనకేమాత్రం సంబంధం లేదని చెబుతూ వచ్చిన కోగంటి సత్యం.. తన పాత్రపై పోలీసులకు ఆధారాలు దొరికిన వెంటనే బెంగళూరు పరారయ్యారు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రధాన నిందితులతో పాటు వారికి ఆశ్రయం ఇచ్చిన, హత్యలో పాలుపంచుకున్న మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన నేపథ్యంలోనే సెల్ ఫోన్ చార్జర్ వైర్ తో రాహుల్ ను చంపేశామని నిందితులు చెప్పడం సంచలనం రేకెత్తించింది. ఈ వివరాలన్నింటినీ కోర్టుకు సమర్పించిన పోలీసులు.. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఈ వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఐదుగురు నిందితులకు రిమాండ్ విధించగా.. వారిని పోలీసులు మచిలీపట్నం జైలుకు తరలించారు.
Must Read ;- ఏపీ హోం మంత్రి సుచరిత కాదు.. మరెవరు?











