ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు గెలుపు మంత్రాలు రచించి, వాటిని పక్కాగా అమలు చేయడం ఎలాగో చెబుతున్న రాజకీయ వ్యూహర్త ప్రశాంత్ కిశోర్ కు ఇప్పుడు ఫుల్ గా డిమాండ్ ఉందనే చెప్పాలి. ప్రశాంత్ కిశోర్ ను సంప్రదించని పార్టీ దేశంలోనే లేదంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు మరోమారు తెలుగు నేల రాజకీయాల్లోకి తనదైన వ్యూహాల రచన చేసేందుకు సిద్ధమయ్యారట. ఈ సారి ఆయన ఎవరికి వ్యూహాలు అందిస్తున్నారంటే.. తెలంగాణలో ఇటీవలే పురుడు పోసుకున్న వైఎస్సార్టీపీకి. ఈ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కదా. ఏపీలో ఆమె సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తనదైన వ్యూహాలు రచించి ఇచ్చిన పీకే.. అక్కడ వైసీపీకి గ్రాండ్ విక్టరీ దక్కేలా చేశారు. పీకే వ్యూహాలతో రికార్డు మెజారిటీతో విజయం సాధించింది జగన్ ఒక్కరే. మోదీ ఆధ్వర్యంలోని బీజేపీకి కూడా పీకే ఆధ్వర్యంలో ఈ మేర రికార్డు ఫలితాలు దక్కలేదు. ఈ లెక్కన..జగన్ కు పీకే ఏ స్థాయి వ్యూహాలు రచించి ఇచ్చారో ఇట్టే చెప్పేయొచ్చు. జగన్ తో ఆ మేర పరిచయంతోనే ఇప్పుడు పీకే.. తెలంగాణలోని జగన్ సోదరిని కూడా అధికారంలోకి తీసుకొచ్చే పనిని భుజానికెత్తుకున్నారట.
షర్మిలే చెప్పేశారుగా
తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించిన వైఎస్ షర్మిల.. చెన్నైకి చెందిన ప్రియ అనే ఓ కార్పొరేట్ మహిళను తన రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్నట్లుగా అప్పుడు వార్తలు వినిపించాయి కదా. ఆ ప్రియ కూడా పీకే శిష్యురాలేనట. అయితే తెర ముందు ప్రియ ఉన్నా.. తెర వెనుక మాత్రం పీకేనే ఉన్నారన్న విషయాన్ని ఇటీవల స్వయంగా షర్మిలనే ఇన్ డైరెక్ట్ గా చెప్పుకున్నారు. తన పార్టీ కోసం వ్యూహాలు రచించేందుకు ప్రశాంత్ కిశోర్ లాంటి వ్యక్తులతో కలవడం తప్పెలా అవుతుందంటూ మొన్నామధ్య షర్మిల మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. ఈ మాటతో.. షర్మిల పార్టీకి కూడా ప్రశాంత్ కిశోరే వ్యూహాలు రచిస్తున్నారని తేలిపోయింది. అయినా ఇకపై తాను రాజకీయ వ్యూహ రచనను పక్కన పెడుతున్నానని స్వయంగా పీకేనే చెప్పారు కదా అంటారా? జగన్ స్వయంగా తన చెల్లి కోసం పనిచేయాలని కోరితే.. పీకే కాదంటారా? అన్న సమాధానం ఠక్కున వినిపిస్తోంది. మొత్తంగా అన్నను గెలిపించినట్టుగానే ఇప్పుడు చెల్లిని గెలిపించే దిశగా పీకే తనదైన శైలి వ్యూహాలు రచిస్తున్నారన్న మాట.
మరి పీకే వ్యూహాలు ఫలిస్తాయా?
ఏపీలో అంటే.. టీడీపీ అధికారంలో ఉంటే.. విపక్షంలో వైసీపీతో పాటు జనసేన, బీజేపీలు కూడా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే జనసేన, బీజేపీ ఏ మేర ప్రభావం చూపిస్తాయో తెలిసిందే కదా. అంటే.. జగన్ పోరాడాల్సింది ఒక్క టీడీపీతోనే. అందులోనూ అధికారంలో ఉన్న టీడీపీని జనంలో బ్యాడ్ చేయడం సులువే కదా. అధికారంలో ఉన్న పార్టీలపై అంతోఇంతో ప్రజా వ్యతిరేకత ఉంటుంది కదా. దానినే భూతద్దంలో చూపించి మరీ జగన్ పార్టీని పీకే ఓ రేంజిలోకి లాక్కెళ్లారు. అయితే తెలంగాణలో పరిస్థితి ఏపీకి పూర్తి విరుద్ధంగా ఉందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బ తింటున్నప్పటికీ.. ఆ పార్టీకి ఉన్న ఓటింగ్ మాత్రం పెద్దగా దెబ్బ తినలేదనే చెప్పాలి. అదే సమయంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏ మేర స్తతా చాటిందో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే.. షర్మిల పార్టీ ఇప్పుడు అధికారంలోకి రావాలంటే.. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలతో కూడా పోటీ పడక తప్పదు. తెలంగాణ సెంటిమెంట్, వలస నేత పేరున్న షర్మిలకు ఇది అంత ఈజీ కాదు. అందుకే.. ఏదో ఏపీలో అన్నను గెలిపించిన మాదిరిగానే తెలంగాణలో చెల్లిని కూడా గెలిపిస్తానని ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగితే.. పెద్దగా ఫలితం రాదనే చెప్పక తప్పదు.
Must Read ;- షర్మిల పార్టీకి శుభం కార్డు పడ్డట్టే!