వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంటే.. దానికేమీ తగ్గనట్టుగా కేంద్రం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు దేశాన్ని అప్పుల ఊబిలోకి తోసేస్తోంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత మోదీ అధికారం చేపట్టే నాటికి.. అంటే దాదాపుగా 70 ఏళ్లలో భారత్ ఎంత అప్పు చేసిందో.. మోదీ ప్రధాని అయ్యాక బీజేపీ సర్కారు గడచిన ఏడేళ్లలోనే దానికి రెండింతల మేర అప్పు చేసి.. దేశ మొత్తం రుణాన్ని మూడింతలుగా పెంచేసింది. వెరసి భారత అప్పు ఇప్పుడు 120 లక్షల కోట్లకు చేరిపోయింది. ఈ విషయం బీజేపీ అంటే గిట్టని వారు చెప్పినది కాదు. మోదీ ఏరికోరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నియమించుకున్న తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ పార్లమెంటు సాక్షిగా చెప్పిన మాట ఇది. భారత దేశ అప్పు రూ.119,53,758 కోట్లకు చేరిందని నిర్మల పార్లమెంటులో ప్రకటించారు. ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మల ఈ విషయాన్ని వెల్లడించక తప్పలేదు.
ఏడేళ్లలో మోదీ అప్పు ఎంతంటే..?
భారత దేశ మొత్తం అప్పు ఎంత అని తృణమూల్ కాంగ్రెస్ నేత, లోక్‌సభ సభ్యురాలు సజ్డా అహ్మద్ ఓ ప్రశ్న సంధించారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నాడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారత్ అప్పు రూ. 119,53,758 కోట్లకు చేరిందని నిర్మల అందులో పేర్కొన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎఫైర్స్, ఆర్బీఐ వెబ్‌సైట్‌లలోని వివరాల ప్రకారం 2014, మార్చి 31వ తేదీ నుంచి జూలై 31వరకూ కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు 74.74 లక్షల కోట్లుగా ఉందట. ఇదిలా ఉంటే.. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది మొదలు 2014, మార్చి 31వ తేదీ వరకూ భారతదేశ అప్పు రూ.46 లక్షల 25 వేల 37 కోట్లు మాత్రమేనట. అంటే 70 ఏళ్లలో దేశ అప్పు రూ.46 లక్షల కోట్లే అయితే.. గడచిన ఏడేళ్లలో మోదీ సర్కారు దానికి రెట్టింపు స్థాయిలో రూ.74.74 లక్షల కోట్ల మేర అప్పు చేసినట్టే కదా. మొత్తంగా 70 ఏళ్లలో అయిన అప్పు కేవలం ఏడేళ్లలోనే మూడింతల మేర పెరిగిపోయిందన్న మాట.
జగన్ ను నిలదీయని కారణమిదేనా?
ఏపీని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా జగన్ సర్కారు ఎడాపెడా అప్పులు చేసేస్తోన్న వైనం ఆందోళన రేకెత్తిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సర్కారీ ఉద్యోగుల వేతనాలు కూడా ఒక్కో నెల ఒక్కో తేదీన జమ అవుతున్నాయి. అసలు వేతనాలు ఎప్పుడు పడతాయో కూడా సర్కారీ ఉద్యోగులకు తెలియడం లేదు. వేతనాల కోసం కూడా జగన్ సర్కారు అప్పులు చేస్తోంది. ఇలాంటి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న టీడీపీ, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజులు ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని అయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. అయితే ఈ విషయాన్ని మోదీ సర్కారు లైట్ తీసుకున్నట్లుగానే తెలుస్తోంది. తానే ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్న క్రమంలో ఏపీ చేస్తున్న అప్పులపై జగన్ సర్కారును నిలదీసేదెలాగన్న రీతిలో యోచిస్తున్న క్రమంలోనే మోదీ సర్కారు ఆచితూచి స్పందిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బుగ్గన వివరణతో నిర్మలమ్మ శాంతించలేదట