ఆ బాలుడు వీల్ చైర్ ఉంటేనే కదలగలడు. 90 శాతం అంగవైకల్యం ఉన్నా.. పోరాటంలో దేశవ్యాప్తంగా అందరిమన్ననలు పొందాడు. పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినా అతను చేస్తున్న పోరాటానికి అంతా హ్యాట్సాప్ చెబుతున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండే కట్జూతో పాటు పలువురు ముఖ్యులు ఆ యువకుడి పోరాట పటిమను కీర్తించకుండా ఉండలేకపోయారు. అంతేకాదు.. అతని పోరాట పటిమ దేశానికి, ఆశావహులకు దారి చూపుతుందని వ్యాఖ్యానించారు.
వీల్ చైర్ మీద మాత్రమే కదిలే పరిస్థితి..
ఆ బాలుడి పేరు మొహమ్మద్ అసిమ్. కేరళలోని కాలికట్ జిల్లా వెలిమన్ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు షాహీద్, జమ్సమా. పుట్టకతోనే రెండుచేతులు లేవు. కాళ్లు కూడా బలహీనమే. దవడ ఎముక, పళ్లు, నోరు, వినికిడి సమస్యకూడా ఉన్నాయి. ఆసిమ్ వీల్ చైర్ మీద మాత్రమే కదిలే పరిస్థితి. అతను ఎటు వెళ్లాలన్నా మరో వ్యక్తి సహాయం అవసరం కావాల్సిందే. ఈ నేపథ్యంలో ఆ బాలుడు పలు పోరాటాలు చేయడం, అవార్డులు సాధించడం విశేషం. అయితే తన పాఠశాలను తాను చదువుకోవడంతో పాటు చుట్టుపక్కల ఉన్న పేదవర్గాల వారికి కూడా ఉపయోగపడే విధంగా హైస్కూల్‌గా అప్ గ్రేడ్ చేయాలన్న కోరిక మాత్రం ఇంకా తీరలేదు. దీంతో మరోసారి పోరాటానికి సిద్ధం అవుతున్నాడు ఆసిమ్. ఇప్పటికే విద్యాభ్యాసం కోసం సదరు బాలుడు చేస్తున్న పోరాటం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
Must Read ;- ట్రంప్ నోటికి తాళం వెనుక.. తెలుగు అమ్మాయి విజయ గద్దె
పాఠశాల అప్‌గ్రేడ్ కోసం..
గతంలో గ్రామ పాఠశాల ప్రాథమిక స్థాయి వరకే ఉండేది. అయితే ఆసిమ్ వినతి మేరకు, స్థానికుల ఆందోళన మేరకు 2014లో ఉమెన్ ఛాందీ సీఎంగా ఉన్న సమయంలో ఆ పాఠశాలని ఉన్నత స్థాయికి అప్ గ్రేడ్ చేశారు. రెండేళ్ల క్రితం ఏడో తరగతి పూర్తి చేశాడు ఆసిమ్. కాగా 1924లో ఏర్పాటైన పాఠశాలలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పేదవిద్యార్థులు చాలామంది చదువుతారు. ప్రాథమిక పాఠశాలగా ఉన్నప్పుడే 400మందికి పైగా విద్యార్థులు చదివేవారు. ఉన్నత స్థాయి వరకు అప్ గ్రేడ్ చేశాక ఆ సంఖ్య 600కి పెరిగింది. ఏడోతరగతి పూర్తి చేసుకున్నఅసిమ్ హైస్కూల్‌కి వెళ్లాలంటే దాదాపు ఏడు నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కూడతాయై, వెనప్పర, కుర్వన్ పొయిల్ పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆసిమ్ అక్కడికి వెళ్లి చదవుకోవాలంటే.. తల్లిదండ్రులు లేదా ఇతర సహాయకులు నిరంతరం అందుబాటులో ఉండాలి. ఈ నేపథ్యంలో 2019 డిసెంబరులోనే ఆసిమ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. కాగా పాఠశాల అప్ గ్రేడ్ చేయడం కోసం ఆసిమ్ చేస్తున్న పోరాటం అందరినీ కదిలిస్తోంది. వందలాది మంది ఈ పోరాటంలో పాలుపంచుకుంటున్నారు. పాఠశాలను అప్ గ్రేడ్ చేయడం కోసం భారీస్థాయిలో మానవహారం చేపట్టి సంచలనం రేపారు.
సహాయ కార్యక్రమాల్లో..
కాగా ఆసిమ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నాడు. తన వయానాడ్ జిల్లాలోని అనేక వరద ప్రభావిత గ్రామాలను సందర్శించాడు. తనకు పరిచయం ఉన్నవారి ద్వారా నిత్యవసరాలు సేకరించి వరద బాధిత ప్రాంతాల్లో అందించాడు. వరద బాధితుల కోసం రూ.53, 815 వసూలు చేసిన ఆయన కేరళ ముఖ్యమంత్రికి అందజేశారు. బ్లడ్ డోనర్స్ కేరళ అసోసియేషన్ నిర్వహించిన నిధుల సేకరణలోనూ పాల్గొనడమే కాదు.. పేద పిల్లలకు ఆన్‌లైన్ తరగతుల కోసం టీవీ సెట్‌లు ఏర్పాటు చేశాడు. ఆసిమ్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు గాను కేరళ ఛారిటీ సర్వీసెస్ అసోసియేషన్‌కి చైల్డ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. బెంగళూరు సంస్థ ఇచ్చే డాక్టర్ ఎపిజె కలాం అవార్డును కూడా గెలుచుకున్నారు. యూనెస్కో నుంచి కూడా అవార్డులు అందుకున్నాడు అసిమ్.
పలువురి మద్దతు..
కాగా ఆసిమ్‌కు మాజీ రాష్ట్రపతి దివంగత డా. ఏపీజే అబ్దుల్ కలాం ముని మనుమడు ఏపీఏఎం షేక్ దావూద్ మద్దతు పలికారు. బాలుడి తరఫున సీఎం పినరయ్ విజయక్‌కి కూడా లేఖలు రశారు. పాఠశాలను హైస్కూల్ స్థాయికి అప్ గ్రేడ్ చేయడం కోసం ఉద్యమం చేస్తున్నారు. పాఠశాల కమిటీ కూడా ఇందుకు సానుకూలంగానే స్పందించింది. అయినా ప్రభుత్వం నంచి స్పందన రాకపోవడంతో కలెక్టర్ కార్యాలయం వరకు ధర్నా చేశారు. ర్యాలీ తీశారు. షేక్ దావూద్ ఆధ్వర్యంలోని కమిటీ కలెక్టర్‌తోనూ సమావేశమైంది. ఈ సందర్భంగా షేక్ దావూద్ మాట్లాడుతూ పాఠశాలను అప్ గ్రేడ్ చేయడం చాలా అవసరమని, ఆ ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకు విద్యాభ్యాసానికి సహకరించినవారు అవుతారని వ్యాఖ్యానించారు. ఈ ఉద్యమానికి అబ్దుల్ కలాం సోదరుడు మహ్మద్ ముత్తు మీరాలిబై మరైక్కర్ (102)కూడా సీఎం పినరయ్ విజయన్‌కి లేఖ రాశారు.
Also Read ;- నాసాలో మన భారతీయ మహిళ ‘స్వాతి మోహన్’..
ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా..
ఆసిమ్ తండ్రి మహ్మద్ సయీద్ మాట్లాడుతూ తమకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పాఠశాలను అప్ గ్రేడ్ చేయలేదని వ్యాఖ్యానించారు. నిబంధనల విషయంలో, ఈ పాఠశాల విషయంలో మానవతా దృక్పథంతో స్పందించాలని కోరుతున్నారు. ఇప్పటికే కోజికోడ్ జిల్లా పంచాయతీ, ఓమెస్సెరీ గ్రామ పంచాయతీలు పాఠశాల అప్ గ్రేడ్ కోసం తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించాయి. కాగా ప్రభుత్వం స్పందించకుంటే ఆసిమ్ గ్రామం నుంచి రాష్ట్ర రాజధాని వరకు ర్యాలీ చేయడానికి సిద్ధమని స్థానిక సంఘాలు హెచ్చరించాయి. ఇప్పటికే విద్యాహక్కు చట్టంలో భాగంగా ఆసిమ్‌కి విద్యాభ్యాస అవకాశం కల్పించాలని కేరళ హైకోర్టు కూడా తీర్పునిచ్చింది.
ఇటీవలే బాలుడు రాహుల్ గాంధీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. తన ప్రాంతంలో హైస్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు. కాగా కేరళలో పర్యటనకు వచ్చిన సమయంలో రాహుల్ గాంధీ తన ఫేస్ బుక్ పేజీలో ఆసిమ్ ను కలిశానని, అతను పోరాట పటిమ అనిర్వచనీయమైందని వ్యాఖ్యానించారు. కాగా కేరళ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.