ఒక గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ పెట్టడంలో ఆలస్యం జరుగుతోందన్నది ప్రజల ఆరోపణ. పలుమార్లు అధికార్లను అడుగుతున్నా సరే పట్టించుకోవడం లేదన్నది వారి ఆవేదన. దీన్ని సాధించుకోడానికి చాలా పద్దతులు ఉంటాయి. అలాంటి వాటిలో ఒక పద్ధతికింద భావించారో ఏమో.. వారు ఎమ్మెల్యే తమ్ముడికి చెప్పుకున్నారు. గ్రామస్తుల ఎదుట తన హవా ఏమిటో చూపించాలని అనుకున్నారో ఏమో గానీ.. సదరు ఎమ్మెల్యే తమ్ముడు పూనకం తెచ్చుకుని ఊగిపోయారు.
సదరు విద్యుత్తు అధికారికి ఫోను చేయించి.. బండబూతులు లంకించుకున్నారు. వినడానికి కూడా అసహ్యం అనిపించే నీచమైన బూతులతో ఎడాపెడా తిట్టిపోశారు. వెయ్యి మందితో నీ మీద కేసులు పెట్టిస్తా అంటూ రంకెలేశారు. ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. కలెక్టరుకు చెప్పుకుంటావో.. ఎస్పీకి చెప్పుకుంటావో.. జగన్మోహన్ రెడ్డికి లెటరు పెట్టుకుంటావో పెట్టుకో.. అంటూ రాయడానికి వీల్లేనంత భయంకరమైన బూతులతో విజృంభించేశారు. నన్నేం పీకలేవు ఏం చేసుకుంటావో చేసుకో.. అని క్లారిటీ ఇచ్చారు. నీ ఊరికొస్తా.. రెండు వందల మందితో వస్తా.. అంటూ ఒక రేంజిలో బెదిరించారు. ఒకవైపునుంచి విద్యుత్తు ఏఈ సురేష్.. జాప్యం జరగడానికి కారణాల్ని వివరిస్తూ.. మీరు ఇదే మొదటి సారి చెబుతున్నారు.. అయినా అంత బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది అని సాత్వికంగా చెప్పే ప్రయత్నం చేస్తున్న కొద్దీ.. ఎమ్మెల్యే తమ్ముడిగా తనను తాను పరిచయం చేసుకున్న సదరు మేడా బాబు అనే మేడా విజయశేఖర రెడ్డి మాత్రం.. అత్యంత దుర్మార్గమైన రీతిలో బూతులతో చెలరేగిపోవడం విస్తుగొలుపుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండ చూసుకుని, ఎమ్మెల్యే అండ చూసుకుని.. చెలరేగిన తైనాతీల ఈ బూతుపురాణం ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏఈ సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు భగ్గుమంటున్నారు. మీడియాలో ఉప్పెనలా వైరల్ కాబోతోంది.
విషయం ఏంటంటే..
రాజంపేట నియోజకవర్గం నందలూరు పరిధిలో ఈడిగపల్లె అనే గ్రామస్తులు తమ గ్రామానికి ట్రాన్స్‌ఫార్మర్ కావాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం వారు విద్యుత్తు శాఖను సంప్రదించారు. వారు చెబుతున్న ప్రకారం.. ఎమ్మెల్యేతో చెప్పిస్తే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేస్తామని అధికారులు వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకూ ఎమ్మెల్యేతో సిఫారసు చేయించడం వారికి సాధ్యమైందో లేదో తెలియదు గానీ.. ఎమ్మెల్యే తమ్ముడు మేడా విజయశేఖర్ రెడ్డి అలియాస్ మేడా బాబుకు చెప్పుకున్నారు. అసలు ఎమ్మెల్యే ఎందుకు.. నేను ఎమ్మెల్యేను మించిన వాడిని… నేనే పనిచేయించేస్తా.. అని ఆయన జనం ఎదుట బిల్డప్ ఇవ్వదలచుకున్నాడో ఏమో గానీ.. వారి ఎదుటే.. నందలూరు విద్యుత్తు ఎఇ సురేష్ కు కాల్ చేయించారు. నేను ఎమ్మెల్యే తమ్ముడు మేడా బాబు మాట్లాడుతున్నా అంటూ తనను తాను పరిచయం చేసుకున్నారు. రేపు తెల్లార్తో నువ్వు ఈడిగపల్లెకి రా అంటూ హుకుం జారీ చేశారు. ట్రాన్స్ ఫార్మర్ విషయం చెప్పారు. ఏఇ సురేష్ కూడా అలాగే అనే చెప్పారు. అక్కడిదాకా బాగానే సాగింది.. ఆ తర్వాత.. ఒక్కసారిగా బూతుపురాణం మొదలైపోయింది.
తనకున్న బూతుల ప్రావీణ్యం మొత్తం అధికార్ల మీద ప్రదర్శిస్తే.. ట్రాన్స్ ఫార్మర్ హుటాహుటిన వచ్చేస్తుందని సదరు మేడా విజయశేఖర్ రెడ్డి అనుకున్నారో ఏమో తెలియదు.. నానా మాటలతో చెలరేగిపోయారు.. రెండోవైపు నుంచి ఏఇ సురేష్.. మీరు అలా బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏముందండీ.. అని అంటూనే ఉన్నకొద్దీ.. ఆయన మరింత రెచ్చిపోయారు. నేను ఈడిగపల్లెకు కూడా వస్తాను.. ముందు కంప్లయింటు ఇచ్చిన తర్వాత వస్తాను అంటూ ఉంటే.. ఇంకా రెచ్చిపోయారు. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో.. జగన్ మోహన్ రెడ్డికి కూడా లెటరు పెట్టుకో అంటూ శివాలెత్తారు. నువ్వు కంప్లయింటు ఇస్తే.. నీ మీద వెయ్యిమంది వచ్చి కంప్లయింట్లు ఇస్తారు అంటూ ఆగ్రహించారు.
ఎఇ సురేష్ ఆవేదన :
ఒక దశ దాటిన తర్వాత.. ఎఇ సురేష్ అసలు సంగతి బయటపెట్టారు. మీరు మాట్లాడుతున్నది మొత్తం రికార్డు అవుతోంది.. ఈ రికార్డుతో సహా కంప్లయింటు చేస్తా అన్నారు. సదరు మేడా బాబు.. ఈ మాటతో కాస్త అలర్ట్ అయ్యారు. అక్కడినుంచి బూతులు తగ్గించి.. ఎఇ వైపే తప్పులన్నీ ఉన్నట్లుగా ట్విస్ట్ చేసి తిట్టడం మొదలెట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ పెట్టమంటే డబ్బులు అడుగుతావా అంటూ రెచ్చిపోయారు. డబ్బులు అడిగినట్టుగా కంప్లయింటు పెట్టిస్తానన్నారు. డబ్బులు అడిగినట్టు ఎవరు చెప్పారో.. వారితో మాట్లాడించాలని ఎఇ ఒకవైపు అంటూనే ఉన్నప్పటికీ.. ఆయన ఏమాత్రం చెవిన వేసుకోలేదు. నువ్వు ఎవడికి చెప్పుకున్నా సరే నేను జనం తరఫున మాట్లాడుతున్నా అంటూ తన బూతు పురాణ పఠనానికి పవిత్రత పులుముకునే ప్రయత్నం చేశారు. నేను ఇక్కడినుంచే ఉద్యమం స్టార్ట్ చేస్తా అంటూ ప్రజానాయకుడి బిల్డప్ కూడా ఇచ్చారు. నీ ఊరేది అని అడుగుతూ ఒంటిమిట్ట అని చెప్పగానే.. రెండు వందల మందితో ఒంటిమిట్టకే వస్తా.. అంటూ మరింతగా రెచ్చిపోయారు.
విద్యుత్తు అధికారిని ఎమ్మెల్యే తమ్ముడు తిట్టిన బూతులు మాత్రం అత్యంత అసహ్యంగా ఉన్నాయి. ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోతున్నాడో.. లేదా, తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడినే గనుక.. అధికార్లను అమ్మనాబూతులు తిట్టినా.. తనను ఎవడూ ఏమీ చేయలేడని విర్రవీగుతున్నాడో తెలియదు గానీ.. ఏకంగా జగన్‌కైనా చెప్పుకో అంటూ చెలరేగిపోతున్నారంటే.. అధికార్ల మీద ఎమ్మెల్యే తైనాతీల వీరంగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఎఇ సురేష్ ఆడియో రికార్డు సహా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎమ్మెల్యే పేరు చెప్పుకుంటూ కొందరు సాగిస్తున్న ఇలాంటి సిగ్గుమాలిన పనులు కలిగించే పరువునష్టం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా తమను తాము కాపాడుకుంటారో పార్టీ పరువు నిలబెడతారో కూడా వేచిచూడాలి.
Also Read ;- కక్షగట్టి జైలుకు పంపారు.. రిజల్ట్ తో షాక్ తిన్నారు!!
మీడియాలో ఈ వ్యవహారంపై కథనం :